You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
ట్వంటీ20 తరహాలో క్రికెట్‌లో ఒక కొత్త ఫార్మాట్‌ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకొస్తోంది. దీనిని 100-బాల్ ఫార్మాట్‌గా పిలుస్తున్నారు.
ఇందులో ఇన్నింగ్స్‌కు 16 ఓవర్లు ఉంటాయి. మొదటి 15 ఓవర్లలో ప్రతి ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. చివరిదైన 16వ ఓవర్‌కు మాత్రం 10 బంతులు ఉంటాయి.
ట్వంటీ20లో ఇన్నింగ్స్‌లో మొత్తం 120 బంతులు ఉండగా, ఈ ఫార్మాట్‌లో అంతకంటే 20 బంతులు తక్కువగా ఉంటాయి. ట్వంటీ20 పోటీని ప్రవేశపెట్టిన ఇంగ్లండే దీనినీ కూడా తీసుకొస్తుండటం విశేషం.
100 బాల్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టడంపై నిర్ణయం జరిగిపోయిందని, నమూనా సిద్ధమైందని ఈసీబీ ఛైర్మన్ కొలిన్ గ్రేవ్స్ చెప్పారు. విధివిధానాలపై కౌంటీ క్రికెటర్లు, ఇతర సంబంధీకులతో చర్చలు జరుపుతున్నామని ఆయన ఇటీవల తెలిపారు.
క్రికెట్ పట్ల యువత ఆకర్షితులు కావడం లేదు: గ్రేవ్స్
ఈ ఫార్మాట్‌లో 2020లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
''ప్రస్తుత ఫార్మాట్ జనాలను ఆకట్టుకోవడం లేదు. అందుకే కొత్త ఫార్మాట్ తెస్తున్నాం'' అని గ్రేవ్స్ బీబీసీ స్పోర్ట్‌తో వ్యాఖ్యానించారు.
క్రికెట్ పట్ల యువత ఆకర్షితులు కావడం లేదని, ఇష్టమున్నా, లేకున్నా ఇది అంగీకరించాల్సిన వాస్తవమని ఆయన తెలిపారు. యువత కొత్తదనాన్ని కోరుకొంటున్నట్లు తమ అధ్యయనాల్లో స్పష్టమైందన్నారు.
యువత మరింత ఉద్వేగాన్ని ఇచ్చే ఫార్మాట్‌ను, అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండే ఫార్మాట్‌ను, నిడివి తక్కువగా ఉండే ఫార్మాట్‌ను కోరుకొంటున్నారని, అందుకే తాము 100 బంతుల ఫార్మాట్‌ను తీసుకొస్తున్నామని గ్రేవ్స్ వివరించారు.
చివరి ఓవర్‌కు పది బంతులు ఉంటాయనే నిబంధనపై చర్చకు తాము సుముఖమేనని ఆయన తెలిపారు.
మిశ్రమ స్పందన
100-బాల్ ఫార్మాట్‌ను ఈసీబీ ఏప్రిల్‌లో ప్రతిపాదించింది. దీనిపై క్రికెటర్లు, అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
ప్రతిపాదిత టోర్నమెంటు కౌంటీ క్రికెటర్లకు 80 లక్షల పౌండ్ల (సుమారు రూ.72 కోట్ల) విలువైన టోర్నమెంటు అని గ్రేవ్స్ వెల్లడించారు. ఈ మ్యాచులకు వచ్చే ప్రేక్షకుల్లో 60 నుంచి 70 శాతం మంది కొత్త ప్రేక్షకులు ఉంటారని, వారు తొలిసారిగా క్రికెట్‌ను చూస్తున్నవారై ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈసీబీ ప్రతిపాదనలపై పలువురు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ- ఇవి విడ్డూరమైనవని, అనవసరమైనవని వ్యాఖ్యానించారు. ఇవి కేవలం గిమ్మిక్కులని విమర్శించారు.
ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ ఫార్మాట్‌ను తెస్తున్నామన్న ఈసీబీ మాటలపై కొందరు స్పందిస్తూ- ఆటగాళ్లతో జోకర్ వేషాలు వేయించండని, అప్పుడు క్రికెట్‌ను జనం ఇంకా బాగా చూస్తారని వ్యంగ్యంగా సూచించారు.
ఇది ఆదరణను చూరగొంటుంది: స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ- జనం ఆదరణను చూరగొనే ప్రత్యేకత 100-బాల్ ఫార్మాట్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. ఇదో వినూత్న ఆలోచనని, ఇది ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పడుతుందని ఇంగ్లండ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చెప్పారు. గత పదేళ్లలో క్రికెట్ ఎంతగానో మారుతూ వచ్చిందన్నారు.
ఈసీబీలో మహిళల క్రికెట్ విభాగం డైరెక్టర్ క్లేర్ కానర్ మాట్లాడుతూ- ఈ ఫార్మాట్ మరింత మంది మహిళలను, అమ్మాయిలను క్రికెట్ పట్ల ఆకర్షితులను చేస్తుందని తెలిపారు.
100 బంతుల ఫార్మాట్ అమల్లో, టీ20 బ్లాస్ట్ టోర్నీ నుంచి ప్రేక్షకులు దూరం కాకుండా చూసుకోవాలని ఆటతో ముడిపడినవారు తమకు సూచించారని గ్రేవ్స్ చెప్పారు. కొత్త టోర్నీ ఇప్పుడున్న టీ20 టోర్నమెంట్ మాదిరే ఉండకుండా జాగ్రత్త పడాలనే సూచన వచ్చిందని పేర్కొన్నారు.
ఈసీబీ న్యూటీ20 మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ పటేల్, ఆయన బృందం ప్రతిపాదించిన ఈ ఫార్మాట్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని గ్రేవ్స్ తెలిపారు.
100-బాల్ టోర్నీ ఎలా ఉంటుంది?
- 2020 నుంచి ఏటా వేసవిలో 38 రోజులపాటు టోర్నీ సాగుతుంది.
- ఎనిమిది జట్లు పోటీపడతాయి. మొత్తం 36 మ్యాచులు ఉంటాయి.
- ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్, బర్మింగ్‌హామ్, లీడ్స్, లండన్, మాంచెస్టర్, కార్డిఫ్, నాటింగ్‌హామ్‌లను వేదికలుగా నిర్ణయించారు.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలో ప్లే-ఆఫ్ మ్యాచులు ఉంటాయి.
- జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు సహా 15 మంది ఆటగాళ్లు ఉంటారు.
- కౌంటీలకు ఏటా కనీసం 13 లక్షల పౌండ్లు (దాదాపు రూ.11.7 కోట్లు) అందుతుంది.
- ఈ టోర్నీలో మహిళల జట్ల మధ్య కూడా మ్యాచులు ఉంటాయి.
క్రికెట్‌లో కొన్ని కీలక మార్పులు
1971: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ఇంటర్నేషనల్.
1992: టీవీ రీప్లేలను చూసి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకునే విధానం
2003: టీ-20 పోటీని తీసుకొచ్చిన ఇంగ్లండ్
2015: తొలి డే-నైట్ టెస్టు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య పింక్ బాల్‌తో ఈ మ్యాచ్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)