ఎంజే అక్బర్: రాజీనామా చేసేది లేదన్న మంత్రి... ఎందుకు చేశారు? ఆ 72 గంటల్లో ఏం జరిగింది?

#MeToo అంటూ సోషల్ మీడియాలో వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ రాజీనామా చేశారు.

ఎంజే అక్బర్ జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో ఆయనతో కలిసి పని చేసిన మహిళలు కొందరు ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ సమయంలో అక్బర్ నైజీరియా పర్యటనలో ఉన్నారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన స్వదేశానికి రాగానే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారని భావించారు. కానీ, ఆదివారం నాడు స్వదేశానికి చేరుకున్న అక్బర్, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. అంతేకాదు, తనపై ఆరోపణలు చేసిన జర్నలిస్ట్ ప్రియారమణి మీద సోమవారం నాడు పరువు నష్టం దావా వేశారు.

ఈ ఆరోపణల విషయంలో అక్బర్‌తో పాటు ప్రభుత్వంలోని పెద్దలందరూ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. కానీ, సామాజిక మాధ్యమాలలో ఆయన రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగింది. చివరకు బుధవారం నాడు అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు ట్విటర్‌లో ప్రకటన కూడా చేశారు.

రాజీనామా చేసేదే లేదన్న అక్బర్ మూడు రోజుల తరువాత ఎందుకు రాజీనామా చేశారు?

ఈ 72 గంటలలో ఏం జరిగింది?

బీజేపీ వర్గాలు బీబీసీ ప్రతినిధి జుబేర్ అహ్మద్‌తో మాట్లాడుతూ, తమ పార్టీ మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉందని, మహిళ హక్కులను పరిరక్షించడానికి ప్రాధాన్యమిస్తుందని చెప్పారు.

ఇంకా, మోదీ ప్రభుత్వం ఎన్నడూ ఎలాంటి తప్పుడు చర్యలనూ సమర్థించలేదని, అక్బర్ వివాదం కోర్టులో ఉంది కాబట్టి ఆయన నిర్దోషి అని తేలేంతవరకు ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని ఆ వర్గాలు వివరించాయి.

అక్బర్ మీద మహిళలను వేధించారనే ఆరోపణలు రావడంతో, ఈ వివాదంలో ప్రభుత్వం నిష్పాక్షిక వైఖరిని ప్రదర్శించాలని నిశ్చయించుకోవడం వల్ల ఆయన రాజీనామా మార్గాన్ని ఎంచుకున్నారని కూడా బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఈ విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అక్బర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అక్బర్ రాజీనామా చేయాల్సిందేనని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే అక్బర్ మంగళవారం నాడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ను కలుసుకున్నారు. అజిత్ ఆయనకు రాజీనామా చేయడమే మేలని సూచించినట్లు పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి.

అంతకుముందు, అక్టోబర్ 11న ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి దత్తాత్రేయ హోసబల్, మీటూ ఉద్యమాన్ని సమర్థించారు.

పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖీ దాస్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టును దత్తాత్రేయ తన ట్విటర్ అకౌంట్‌లో రీట్వీట్ చేస్తూ దాన్ని సమర్థించారు.

అంఖ్ దాస్ తన ఫేస్‌బుక్‌లో "వేధింపులకు గురైన మహిళా పాత్రికేయురాలికి మద్దతు తెలపడానికి మీటూ ఉద్యమంతో పని లేదు. మీరు మహిళ అయి ఉండాల్సిన అవసరమూ లేదు. మంచి చెడులను విడదీసి చూసే వివేచన, స్పందించే తత్వం ఉంటే చాలు" అని పోస్ట్ రాశారు. దీనిని దత్తాత్రేయ షేర్ చేస్తూ సమర్థించారు.

అక్బర్ అంతకుముందు ఏమన్నారు?

లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు చేసిన ప్రియా రమణియే స్వయంగా 20 ఏళ్ళ నాటి ఆ వివాదంలో అక్బర్ తన విషయంలో అనుచితంగా ఏమీ ప్రవర్తించలేదని చెప్పారని ఎంజే అక్బర్ తరఫు న్యాయవాది అంటున్నారు. అక్బర్ మీద ఆరోపణలు చేసిన లేఖతో ఆమె గతంలో ఎక్కడా ఎవరి దగ్గరా ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అక్బర్ మీద కట్టుకథలతో కూడిన ఆరోపణలు చేశారని, అందుకు ఆధారంగా చూపిస్తున్న లేఖ ప్రియారమణి సృష్టించిందేనని వ్యాఖ్యానించారు.

ఈ అబద్ధపు ఆరోపణల మూలంగా రాజకీయాల్లో, పత్రికారంగంలో, కుటుంబంలో తన ప్రతిష్ఠ దెబ్బతిందని అక్బర్ అన్నారు. ఈ నష్టం పూడ్చలేనిదని ఆయన చెప్పారు.

మహిళా మంత్రి ఏమన్నారు?

"ఈ వ్యవహారంలో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ వ్యక్తే బదులివ్వడం సమంజసం అని మాత్రమే నేను చెబుతాను" అని స్మృతి ఇరానీ చెప్పారు.

"ఆయనతో కలిసి పని చేసిన మహిళలను ఈ విషయం గురించి మీడియా ప్రశ్నించడం మంచిదే. కానీ, ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ వ్యక్తే దీని గురించి మాట్లాడాలని నాకనిపిస్తోంది. ఆయనే తాను నిర్దోషి అని నిరూపించుకోవాలి. అయినా, దీని గురించి మాట్లాడడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే, ఆ సంఘటనలకు నేనేమీ సాక్షిని కాదు" అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.

రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒక టీవీ చానల్‌లో మాట్లాడుతూ మీటూ ఉద్యమాన్ని సమర్థించారు. కానీ, అక్బర్ గురించి ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో మీటూ మీద ఉమాభారతి స్పందన ప్రచురితమైంది. అందులో ఆమె ఈవిధంగా స్పందించారు: "మీటూ చాలా మంచి ఉద్యమం. దీనివల్ల భవిష్యత్తులో కార్యాలయాల్లో ఆశించిన మార్పు వస్తుంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడానికి మగవాళ్ళు ఇకపై భయపడతారు. ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలు నిర్భయంగా పని చేసుకోగలుగుతారు. అమ్మాయిలను వేధించేవాళ్ళు ఇకపై ప్రశాంతంగా ఉండలేరు. మగవాళ్ళు ఇకపై అప్రమత్తంగా ఉండాలి."

ఇవి కూడా చదవండి: