ఆంధ్రప్రదేశ్: తిత్లీ తుపాను దెబ్బకు శ్రీకాకుళం విలవిల

బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని చాలా మండలాల్లో 30 సెం.మీ పైగా కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ధాటికి ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద తీరాన్ని తాకిన తుపాన్.. పలాస- ఒడిశాలోని గజపతి జిల్లా మీదుగా తీరాన్ని దాటింది.

తుపాను సమయంలో గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తుపానులో అంతర్గత గాలుల వేగం 155 నుంచి 187 కిలోమీటర్లుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాగల 24 గంటల్లో..

తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు, కవిటి, ఇచ్చాపురం, కంచిలి, పలాస, మందస, నందిగామ, మేలియపుట్టి, సోంపేట మండలాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మిగిలిన చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 0101 కు ఫోన్ చేయాలని సూచించింది.

రేపు ఏపీలోని కాకినాడ, బరువా ప్రాంతాల్లో సముద్రంలో 8 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని 'ఇన్‌కాయిస్' ఒక ప్రకటనలో పేర్కొంది.

కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం

తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రెండు వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీరప్రాంత గ్రామాలకు వెళ్లేందుకు వీలులేకుండా రోడ్లు దెబ్బతిన్నాయి.

తడిసిముద్దయిన శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండ‌లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

ప‌లాస‌, వ‌జ్ర‌పుకొత్తూరు, నందిగామలలో అత్యధికంగా 28.02 సెం.మీ. వర్షపాతం నమోదవగా, కోట‌బొమ్మాళిలో 24.82 సెం.మీ., సంత‌బొమ్మాళి 24.42సెం.మీ., ఇచ్ఛాపురం 23.76 సెం.మీ., టెక్క‌లి- 23.46 సెం.మీ., సోంపేట‌, మంద‌స - 13.26సెం.మీ., క‌విటి - 12.44 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

ముమ్మరంగా సహాయక చర్యలు

తిత్లీ తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)