హరికేన్ మైకేల్: ఫ్లోరిడా మీదకు దాడి చేసిన మరో భీకర తుపాను

ఫ్లోరిడా వాయవ్య ప్రాంతంలో మున్నెన్నడూ లేనంతటి శక్తిమంతమైన తుపాను విరుచుకుపడింది. తీర ప్రాంత నగరాలు నీట మునిగాయి. బలమైన వృక్షాలు కూడా గాలి ధాటికి కట్టె పుల్లల్లా విరిగి పడుతున్నాయి.

చెట్టు కూలిన సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడని ఫ్లోరిడా అధికారులు తెలిపారు.

తుపాను మూలంగా ఫ్లోరిడా, అలబామా, జార్జియా ప్రాంతాల్లోని 5,00,000 మంది ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేకుండా పోయింది.

తీవ్రతను బట్టి మూడవ కేటగిరీ తుపానుగా భావిస్తున్న హరికేన్ మైకేల్ మూలంగా గాలులు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని పాన్‌హాండిల్ ప్రాంతంలో బుధవారం నాడు ఈ తుపాను అల్లకల్లోలం సృష్టించింది.

మైకేల్ హరికేన్ తీరం దాటిన తరువాత కూడా అంతే తీవ్రంగా అలబామా, జార్జియాల మీదకు దూసుకొచ్చింది. భూతలం మీదకు వచ్చిన తరువాత కూడా అది అంత బలంగా ఉండడం నిపుణులనే ఆశ్చర్యపరిచింది.

మంగళవారం నాడు రెండో కేటగిరీగా భావించిన మైకేల్ హరికేన్ బుధవారం నాటికి మరింత బలపడి దాదాపు అయిదో కేటగిరీ స్థాయికి చేరుకుంది.

ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ దీన్ని 'ఊహకందని విపత్తు'గా అభివర్ణించారు. గత 100 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తీవ్రమైన తుపాను ఇదేనని ఆయన అన్నారు.

మైకేల్ హరికేన్ ధాటికి మధ్య అమెరికాలో 13 మందికి పైగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. హోండురాస్‌లో ఆరుగురు, నికరాగ్వ లో నలుగురు, ఎల్ సాల్వడార్‌లో ముగ్గురు చనిపోయారు.

ఫ్లోరిడా నుంచి 3,70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆదేశించారు. కానీ, చాలా మంది ఆ హెచ్చరికలను నిర్లక్ష్యం చేశారని అధికారులు చెబుతున్నారు.

తీరప్రాంత నగరమైన అపలాచికోలాలో అలలు రెండున్నర మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. పనామా సిటీ బీచ్ నుంచి తన భార్యతో కలసి ఉప్పెను దాటుకుని బయటపడిన తిమోతీ థామస్ అనే వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, 'ఏదో నరకం తరుముకొస్తోంది' అని అన్నారు.

మయామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్.హెచ్.సి) వాతావరణ నిపుణుడు డెనిస్ ఫెల్ట్‌జెన్, 'మనం మరో భాగంలో ఉన్నాం' అని ఫేస్‌బుక్‌లో రాశారు.

"చరిత్రను చూస్తే, 1851 తరువాత ఫ్లోరిడా వాయవ్య ప్రాంతంలో కేటగిరీ-4 హరికేన్ ఎన్నడూ రాలేదు' అని ఆయన అన్నారు.

ఫ్లోరిడా, అలబామా, జార్జియా, ఉత్తర కెరోలినా ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. సహాయక చర్యల కోసం ఫ్లోరిడా ఇప్పటికే 3,500 మంది నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ను సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి: