గంగా ప్రక్షాళన కోసం దీక్ష చేస్తూ ప్రొ. జీడీ అగర్వాల్ కన్నుమూత

గంగానదిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 22 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు.

గంగను ప్రక్షాళన చేసి, నది పవిత్రతను కాపాడాలంటూ ఆయన చేస్తున్న సత్యాగ్రహాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రెండు రోజుల క్రితం నీరు తీసుకోవడానికి సైతం అగర్వాల్ నిరాకరించారు. గంగ ఉపనదుల ప్రాంతాల్లో హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. నదికి పునర్‌వైభవం తీసుకురావాలంటే గంగా పరిరక్షణ, నిర్వహణ చట్టాన్ని అమలుచేయాలని సూచించారు.

కాన్పూర్ ఐఐటీలో అధ్యాపకుడిగా పనిచేసిన అగర్వాల్ తర్వాత కాలంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో మెంబర్ సెక్రటరీగా కూడా సేవలందించారు. పారిశ్రామిక, పట్టణ కాలుష్యానికి కారణమవుతున్నవారిపై ఆ సమయంలో కఠిన చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. నదులు సహజసిద్ధంగా, కాలుష్యరహితంగా ప్రవహించాలని, అప్పుడే సమాజం బాగుంటుందని ఆయన చెప్పేవారు. హిమాలయాల్లోని గంగోత్రిలో పుట్టిన గంగ... బంగాళాఖాతంలో కలిసేలోపు తీవ్రంగా కలుషితమవుతోందని, దీనికి కారణమైనవారిలో ఏ ఒక్కరిపైనా ఎవరూ ఎలాంటి చర్యా తీసుకోవడం లేదని అగర్వాల్ తరచూ ఆవేదన చెందేవారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)