భారత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది

వీడియో క్యాప్షన్, నాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతున్నాం

సుమారు ఆరు దశాబ్దాల క్రితం.. 1960ల్లో బ్రెజిల్ నుంచి ఒక రైతు భారతదేశానికి వచ్చారు. గుజరాత్‌లోని గిర్ ప్రాంతం ఆవులు కావాలని ఆనాటి భావనగర్ మహారాజును కోరారు. రైతు కోర్కెను మన్నించిన మహారాజు ఐదు ఆవుల్ని, మూడు ఎద్దుల్ని ఇచ్చారు. ఆ రైతు పేరు సెల్సొ గర్జియా సిడ్. ఆ రాజు పేరు వజ్సుర్ కచర్.

బ్రెజిల్ రైతు వాటిని తమ దేశానికి తీసుకెళ్లాడు. ఐదు ఆవులు, మూడు ఎద్దులు ఆ దేశంలో ‘శ్వేత విప్లవం’ తీసుకొచ్చాయి. స్థానిక హోలిస్టీన్‌ అని పిలిచే పశు సంపద, భారతీయ గిర్ ఎద్దుల సంపర్కంతో సరికొత్త ఆవు జాతి పుట్టుకొచ్చింది. దానిపేరే గిరోలాండో. ప్రస్తుతం బ్రెజిల్ దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలల్లో 80 శాతం పాలు ఇచ్చేది ఈ గిరోలాండో జాతి ఆవులేనని బ్రెజిలియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కార్పొరేషన్‌కు చెందిన పరిశోధకుడు మార్కోస్ ది సిల్వ బీబీసీకి చెప్పారు.

బ్రెజిల్‌లో గిర్ జాతి ఆవుల ద్వారా భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతోందిప్పుడు. గత 20 ఏళ్లలో అయితే దేశ పాల ఉత్పత్తి సామర్థ్యం నాలుగు రెట్లు పెరిగింది. ఆరోగ్యంగా ఉన్న ఒక్కో ఆవు రోజుకు 60 లీటర్ల వరకూ పాలిస్తోందని స్థానికులు చెబుతున్నారు.

భారతదేశంలో ఇప్పుడు గిర్ జాతి ఆవులు, ఎద్దుల సంఖ్య తగ్గుతోందని గుజరాతీయులు అంటున్నారు. బ్రెజిల్‌లో గిర్ జాతి సృష్టించిన విప్లవం నేపథ్యంలో గిర్ జాతి పశువుల పట్ల భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆ దేశం నుంచి వీర్యాన్ని తెచ్చుకోవాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.

కానీ, గుజరాతీయులు మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)