నవాజుద్దీన్ సిద్దిఖి: వారసత్వం ఉంటే మొదటి సినిమా అవకాశం ఈజీగా వస్తుంది.. తర్వాత కష్టపడాల్సిందే

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి. నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత మొదటి పది సంవత్సరాలు చిన్నా చితకా పాత్రలు చేసినా.. ఆ తరువాత నుంచి వైవిధ్యభరిత పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఇపుడు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త వెబ్ సిరీస్‌లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మీ మాట్లాడారు.

బీబీసీ: భారతదేశంలో విడుదలవుతున్న తొలి భారతీయ నెట్ఫ్లిక్స్ సిరీస్ ఇది. వెండితెర మీద ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మీరు ఈ కొత్త వేదికను ఎంచుకోవడానికి కారణం ఏమిటి?

నవాజుద్దీన్: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో పాశ్చాత్య దేశాలకు చెందిన పెద్ద పెద్ద తారలు నటించారు. రెండోది, ఈ సిరీస్ ప్రమాణాలను అందుకోవడం కోసం కూడా ప్రయత్నిస్తుంటాం. ఒక్కోసారి ఇవి సినిమాల కన్నా చాలా మెరుగ్గా ఉంటాయి. మరో కారణం, దీనికి అనురాగ్ కశ్యప్ దర్శకుడు కావడం. విక్రమ్ చంద్ర నవలలోని ఈ కథ చాలా కొత్తది. చాలా బలమైన ఇతివృత్తం. ఇలా రెండు మూడు కారణాలున్నాయి.

బీబీసీ: వెబ్ సిరీస్ చేసేటప్పుడు ఒక నటుడికి ఎలాంటి స్వేచ్ఛ లభిస్తుంది? ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?

నవాజుద్దీన్: మామూలుగా సినిమా వ్యవధి రెండు, రెండున్నర గంటలే ఉంటుంది. అందుకే, సినిమాల్లో పాత్రలను వివరంగా చూపించే అవకాశం అంతగా ఉండదు. పాత్రలకు సంబంధించిన కొన్ని లక్షణాలను మాత్రమే చూపించగలం. అదే వెబ్ సిరీస్‌లో, ముఖ్యంగా 'సేక్రెడ్ గేమ్స్‌'లో పాత్రల స్వభావాలను విభిన్న కోణాల్లో చూపించేందుకు ప్రయత్నించాం.

బీబీసీ: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మీద ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో, నవాజుద్దీన్ సిద్దిఖీ భారత రాజకీయాలలో ఒక వివాదాస్పద నేతకు సంబంధించిన బయోపిక్ చేస్తున్నారన్న చర్చ మొదలయింది. ఈ చిత్రాన్ని అంగీకరించేందుకు ఏమైనా సందేహించారా?

నవాజుద్దీన్: ఏమీ లేదు. ఎంతో నమ్మకంతో శ్రద్ధతో ఈ మంటో పాత్ర చేశాను. ఠాక్రే పాత్ర కూడా అంతే నమ్మకంతో, అంతే శ్రద్ధతో చేశాను. నేను ఒక నటుడిని. అన్ని రకాల పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. అది గణేష్ గాయ్ తుండే కావచ్చు, మంటో కావచ్చు లేదంటే ఠాక్రే కావచ్చు. భవిష్యత్తులో కూడా ప్రతి పాత్ర విషయంలో అంతే కష్టపడతాను.

బీబీసీ: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో "బంధు ప్రీతి" ఎక్కువ అనే విమర్శ ఉంది. నిజంగానే, సినీ రంగంలో ఇలాంటి పరిస్థితి ఉందంటారా?

నవాజుద్దీన్: చూడండి, వారసత్వంతో వచ్చే వాళ్ళకు మొదటి సినిమా అవకాశం ఎలాంటి కష్టం లేకుండా వస్తుంది. కానీ, ఆ తరువాత కూడా చిత్రాలు రావాలంటే వారు ఎంతో శ్రమించాలి. ఇప్పుడున్న నటీనటులు కష్టపడుతున్నారు కూడా. కొంతమంది డాన్స్‌లో కష్టపడుతున్నారు. మరి కొంతమంది యాక్షన్ సన్నివేశాల కోసం కష్టపడుతున్నారు. ప్రజలు అన్ని రకాల చిత్రాలు చూస్తారు. అన్నింటినీ ఆనందిస్తారు.

బీబీసీ: నటులకు ఏదో ఒక డ్రీమ్ రోల్ ఉంటుందని అంటుంటారు. మీకు అలాంటిది ఏమైనా ఉందా? లేక మీ డ్రీమ్ రోల్ ఇప్పటికే చేసేశారా?

నవాజుద్దీన్: నేను ఇప్పటివరకు డ్రీమ్ రోల్ గురించి ఎన్నడూ ఆలోచించలేదు. ఒకవేళ అలా ఏదైనా పాత్ర గురించి కలలు కన్నాననుకోండి. ఆ పాత్ర స్వభావం నేను చేసే ఇతర పాత్రల మీద ఎంతో కొంత పడే అవకాశముంది. అయితే, నేను ఒక పాత్రను చేస్తున్నప్పుడు, ఆ పాత్ర ఇతరులకు డ్రీమ్ రోల్‌లా కనిపిస్తే బాగుంటుంది. నేను ఆలా ఆలోచిస్తాను. ఆ దిశలోనే ప్రయత్నిస్తాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)