ప్రణబ్ ముఖర్జీ: ‘నేను బాల్ థాకరేను కలవటం సోనియా గాంధీకి నచ్చలేదు’

శివసేన అధినేత బాల్ థాకరేను తాను కలవడం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి నచ్చలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.

2012 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్సీపీ నేత శరద్ పవార్ సూచనతో తాను థాకరేను కలిసానని ప్రణబ్ తన ‘‘ది కోఅలిషన్ ఇయర్స్’ పుస్తకంలో గుర్తు చేశారు.

"అప్పుడు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బాల్ థాకరే, ఆ కూటమి అభ్యర్థిని కాదని నాకు మద్దతు ఇచ్చారు. ఆయన్ను కలవాలా? వద్దా? అని సోనియా గాంధీ, శరద్ పవార్‌ ఇద్దరినీ అడిగా. సోనియా వద్దన్నారు. పవార్ మాత్రం తప్పకుండా కలవాలని సూచించారు. చివరికి సోనియా నిర్ణయాన్ని కాదని, 2012 జూలై 13న బాల్ థాకరేను కలిసేందుకు ముంబయి వెళ్లాను. అందుకు సోనియా గాంధీ నొచ్చుకున్నారు’’ అని ప్రణబ్ గుర్తు చేశారు.

"మరుసటి రోజు ఉదయాన్నే దిల్లీలో గిరిజా వ్యాస్ నన్ను పిలిచారు. నేను థాకరేను కలవడం సోనియాకు, అహ్మద్ పటేల్‌కు నచ్చలేదని ఆమె అన్నారు. ఆయన్ను కలవడంలో తప్పులేదని భావించి అలా చేశానని గిరిజాకు వివరించా. ఆ విషయాన్ని అక్కడితే వదిలేయాలని నిర్ణయించుకున్నా. మళ్లీ సోనియా, అహ్మద్ పటేల్ ముందుకు ఆ విషయాన్ని తీసుకెళ్లలేదు’’ అని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఆ ఎన్నికల్లో యూపీయే తరపున పోటీ చేసి.. భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 2012 నుంచి 2017 జూలై వరకు పదవిలో కొనసాగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)