You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
కేరళ యువకుడు క్లిఫిన్ ఫ్రాన్సిస్‌కు ఫుట్‌బాల్ అంటే చెప్పలేనంత ఇష్టం. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఆయన వీరాభిమాని. ఫుట్‌బాల్ 2018 ప్రపంచ కప్ మ్యాచులు చూసేందుకు మాస్కోకు వెళ్తావా అని ఓ స్నేహితుడు అడిగితే, ''ఔను, వెళ్తానేమో'' అని బదులిచ్చారు. ఈ సంభాషణ నిరుడు ఆగస్టులో జరిగింది. ప్రస్తుతం రష్యాలో ఉన్న ఆయన మాస్కో దిశగా సాగిపోతున్నారు. సైకిల్‌పై!
మాస్కో వెళ్లాలని నిర్ణయించుకొన్నప్పుడు కేరళ నుంచి అక్కడికి విమాన ప్రయాణానికి టికెట్లు, రష్యాలో ఉండేందుకు అయ్యే వ్యయం గురించి ఆయనకు ఎలాంటి అంచనా లేదు.
ఆయన ఫ్రీలాన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గణితం బోధిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.2,725 సంపాదిస్తారు. ''రష్యాకు విమానంలో వెళ్లడానికి, అక్కడ నెల రోజులపాటు ఉండటానికి నా వద్ద ఉన్న డబ్బు సరిపోదని అర్థమైంది. తక్కువ ఖర్చుతో రష్యా చేరుకోవడమెలా అని ఆలోచించాను. సైకిల్‌పై ఆధారపడటమే నాకున్న మార్గమని అనిపించింది'' అని ఫ్రాన్సిస్ చెప్పారు.
ఆయన తన ప్రణాళిక గురించి చెబితే స్నేహితులు నమ్మలేకపోయారు.
ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 23న భారత్ నుంచి విమానంలో దుబాయ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నౌకలో ప్రయాణించి ఇరాన్‌కు వెళ్లారు. సైకిల్‌పై వెళ్తే అక్కడి నుంచి రష్యా రాజధాని మాస్కో 4,200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది.
ఫుట్‌బాల్, సైక్లింగ్ అంటే ఇష్టం.. రెండింటినీ కలిపేశా
''నాకు సైక్లింగ్ అంటే ఇష్టం. ఫుట్‌బాల్ అంటే క్రేజ్. ఈ రెండు ఇష్టాలను కలిపేసి, ప్రయాణం సాగిస్తున్నా'' అని ఆయన బీబీసీతో చెప్పారు. ఆయన మొదట పాకిస్తాన్ గుండా ప్రయాణం సాగించాలనుకున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగా లేకపోవడంతో తర్వాత తన ఆలోచనను మార్చుకున్నారు.
ఈ మార్పుతో ఖర్చు బాగా పెరిగిపోయిందని ఫ్రాన్సిస్ చెప్పారు. దుబాయ్‌కు తన సైకిల్ తీసుకెళ్లలేకపోయానని, దాదాపు రూ.48 వేలు పెట్టి అక్కడ కొత్త సైకిల్ కొనుక్కోవాల్సి వచ్చిందని తెలిపారు. సుదీర్ఘ ప్రయాణాలకు ఇది అనువైనది కాదని, కానీ తన వద్ద ఉన్న డబ్బుతో ఇదే కొనగలనని చెప్పారు.
ఫ్రాన్సిస్ మార్చి 11న ఇరాన్ రేవు బాండర్ అబ్బాస్ చేరుకున్నారు.
'ఇరాన్ ప్రజలు చాలా బాగా చూసుకుంటారు'
ఇరాన్ ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన దేశమని ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. ప్రజలు చాలా మంచివారని, ఇతరులను బాగా చూసుకుంటారని చెప్పారు. ''ఇరాన్‌లో నేను 45 రోజులు ఉన్నాను. ఇందులో కేవలం రెండు రోజులే హోటల్లో ఉన్నాను. నా వద్ద ఉన్న డబ్బులో రోజుకు రూ.680కు (పది డాలర్లకు) మించి ఖర్చు చేయలేను. ఇరాన్‌లో ఎక్కడకు వెళ్లినా ప్రజలు నన్ను వాళ్ల ఇంట్లో ఉండమని ఆహ్వానించారు, భోజనం పెట్టారు'' అని వివరించారు.
ఇరాన్ పట్ల తన దృక్పథం మారిపోయిందని ఫ్రాన్సిస్ తెలిపారు. రాజకీయాల ప్రాతిపదికగా దేశాలపై అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని తాను గుర్తించానన్నారు.
ఇరాన్ గ్రామీణ ప్రాంతం చాలా అందంగా ఉంటుందని, దీనిని చూస్తూ సైకిల్ తొక్కుతుంటే అలసట కూడా అంతగా అనిపించలేదని ఫ్రాన్సిస్ చెప్పారు. ''నేను మళ్లీ ఇరాన్‌కు వెళ్తా'' అన్నారు. ప్రపంచ కప్‌లో ఇరాన్ ఆడే మ్యాచుల్లో ఇరాన్ జట్టుకే మద్దతిచ్చి ఉత్సాహపరచాలని ఇరాన్ ప్రజలు తన వద్ద మాట తీసుకున్నారని తెలిపారు.
ఇరాన్ ప్రజలకు బాలీవుడ్ సినిమాలంటే బాగా ఆసక్తి అని, చాలా మందితో సంభాషణ సాగించేందుకు ఈ అంశం తనకు బాగా అక్కరకొచ్చిందని ఆయన తెలిపారు. ఫుట్‌బాల్, సినిమాలు ప్రపంచాన్ని ఏకం చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో ఏం జరిగిందంటే..
ఇరాన్‌లో ప్రయాణం ముగిశాక ఫ్రాన్సిస్ ఇరాన్‌కు ఉత్తరాన ఉండే అజర్‌బైజాన్ దేశ సరిహద్దులకు చేరుకున్నారు. అజర్‌బైజాన్ సరిహద్దు పోలీసులు ఆయన ప్రయాణ పత్రాలను పరిశీలించి, దేశంలోకి అనుమతించడానికి ఎనిమిది గంటలు పైనే పట్టింది. నిత్యం చాలా దూరం సైకిల్ తొక్కడంతో ఫ్రాన్సిస్ చిక్కిపోయారు. ప్రయాణ పత్రాల్లోని ఫొటోలతో ఆయన సరిపోలలేదు. దీంతో వివరాలు నిర్ధరించుకోవడానికి పోలీసులకు సమయం పట్టింది.
ఈ విషయంలో జాప్యం జరిగినప్పటికీ, వారు తనతో చాలా బాగా వ్యవహరించారని ఆయన తెలిపారు. అజర్‌బైజాన్‌లో హోటళ్లలో బస చేయడానికి సరిపడ డబ్బులు లేకపోవడంతో ఆయన పార్కుల్లో టెంట్ వేసుకుని ఉన్నారు.
''అజర్‌బైజాన్‌లో ప్రజలు మంచివారే. కాకపోతే కొత్తవారితో వెంటనే కలుపుగోలుగా వ్యవహరించలేరు. పరిచయం పెరిగాక బాగా కలిసిపోతారు. దేశ రాజధాని బకులో ఉండే కొందరు భారతీయులు నాకు పరిచయమయ్యారు. వారి వద్ద కొన్ని రోజులు ఉన్నాను'' అని ఫ్రాన్సిస్ వివరించారు.
జార్జియా: వెనక్కు పంపించేసిన అధికారులు
అజర్‌బైజాన్ తర్వాత ఆ దేశానికి వాయువ్యాన ఉన్న జార్జియాకు ఫ్రాన్సిస్ చేరుకున్నారు. అక్కడి అధికారులు ఆయన్ను వెనక్కు పంపించేశారు. దీంతో ప్రయాణం మధ్యలో మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
''నా వద్ద అవసరమైన పత్రాలన్నీ ఉన్నా జార్జియాలోకి ఎందుకు అనుమతించలేదో అర్థం కాలేదు. వాళ్ల చర్యతో నాకు దిక్కు తోచలేదు. ఎందుకంటే నా వద్ద ఉన్న వీసాతో అజర్‌బైజాన్‌లో ఒక్కసారి ప్రవేశించేందుకు మాత్రమే వీలవుతుంది. నేను తిరిగి ఆ దేశంలోకి వెళ్లలేను'' అని ఫ్రాన్సిస్ వెల్లడించారు.
అజర్‌బైజాన్, జార్జియా దేశాల మధ్య ఉన్న 'నో మ్యాన్స్ ల్యాండ్'లో ఆయన ఒకరోజంతా చిక్కుకుపోయారు. తర్వాత అజర్‌బైజాన్ అధికార యంత్రాంగం దేశంలోకి ప్రవేశించేందుకు అత్యవసరంగా మరో వీసా ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.
రష్యాలోకి ప్రవేశించేందుకు ముందుగా అనుకున్న మార్గం కాకుండా మరో మార్గాన్ని తాను ఎంచుకోవాల్సి వచ్చిందని ఫ్రాన్సిస్ తెలిపారు.
''రష్యాలోని డగెస్థాన్ ప్రాంతంతో అజర్‌బైజాన్‌కు భూ సరిహద్దు ఉందని నాకు ఒకరు చెప్పారు. డగెస్థాన్ ప్రాంతం సురక్షితం కాదనే విషయం తెలుసుకోకుండానే అక్కడకు చేరుకున్నాను. కానీ అక్కడి నుంచి తిరిగి రాలేను. మరో దారి లేక జూన్ 5న డగెస్థాన్‌లో అడుగు పెట్టాను'' అని ఆయన వెల్లడించారు.
డగెస్థాన్‌లో భాషా సమస్య ఎదురైందని, ఇంగ్లిష్ మాట్లాడేవారు తనకు పెద్దగా తారసపడలేదని ఫ్రాన్సిస్ చెప్పారు. తనను చూసిన స్థానికులు, ఒక భారతీయుడు సైకిల్‌పై తమ ప్రాంతంలోకి వచ్చాడా అని ఎంతగానో ఆశ్చర్యపోయారని వెల్లడించారు. ఫుట్‌బాల్, సినిమాలు సార్వత్రిక భాషలని, వీటితోనే తాను స్థానికులతో పరిచయం ఏర్పరచుకున్నానని తెలిపారు.
ఈ వార్తాకథనం రాసే సమయానికి ఫ్రాన్సిస్ రష్యాలోని తంబోవ్‌లో ఉన్నారు. ఇది మాస్కోకు దాదాపు 460 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నెల 26లోగా మాస్కో చేరుకోవడమే లక్ష్యంగా ఆయన సాగిపోతున్నారు. 26న ఫ్రాన్స్, డెన్మార్క్ మధ్య జరిగే మ్యాచ్‌కు టికెట్ కొన్నారు. ''నేను ఇదొక్క మ్యాచ్‌కే టికెట్ కొనగలిగాను'' అని ఫ్రాన్సిస్ చెప్పారు.
'మెస్సీని కలవడం నా కల'
టికెట్ ఇదొక్క మ్యాచ్‌కే ఉన్నప్పటికీ, తన మద్దతు మాత్రం అర్జెంటీనాకేనని ఫ్రాన్సిస్ తెలిపారు. మెస్సీ తన ఆరాధ్య ఫుట్‌బాలర్ అని, ఆయన్ను కలిసి, తన సైకిల్‌పై సంతకం చేయాలని అడుగుతానని, ఇది నా కల అని వివరించారు.
తన సైకిల్ ప్రయాణం ఫుట్‌బాల్‌పై, ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగేలా భారతీయులకు ప్రేరణ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ఫ్రాన్సిస్ చెప్పారు.
''ఏదో రోజు ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో భారత్ ఆడాలని నా కోరిక. మరింత మంది పిల్లలకు ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెరిగితేనే ఇది సాధ్యమవుతుంది. రాబోయే 20 ఏళ్లలో భారత జట్టు ప్రపంచ కప్‌లో ఆడుతుంది'' అని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
''నా కథ చదివాక సైక్లింగ్‌పైనా జనాలకు ఆసక్తి పెరుగుతుందనుకుంటున్నా. సైక్లింగ్ మనిషికి తన ప్రాథమిక అవసరాలేవో గుర్తు చేస్తుంది. రోజంతా సైకిల్ తొక్కి అలసిపోయాక స్నానం, మంచి ప్రదేశంలో టెంట్, మంచి తిండి- సైక్లింగ్‌లో కావాల్సింది ఇవే. ఇవే చాలా సంతోషాన్నిస్తాయి'' అంటూ ఫ్రాన్సిస్ తన అనుభవాన్ని బీబీసీతో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- డబ్ల్యుహెచ్ఓ: ‘మొబైల్ గేమ్స్-వ్యసనం కాదు, వ్యాధి’
- #FIFA2018: ఫుట్‌బాల్‌లో యూరోపియన్ దేశాలకు ఉన్నదేంటి? భారత్‌లో లేనిదేంటి?
- అనాథ పసికందుకు పాలిచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు
- పెయిన్‌కిల్లర్స్: నొప్పిని తగ్గించే మందు మీకు దొరకడం లేదా? ఎందుకు?
- ఇక్కడ ఇంట్లోనే గంజాయి పెంచుకోవచ్చు
- ఈమె తెలంగాణలో తొలి గిరిజన మహిళా పైలట్
- రూ.150 కోట్ల జరిమానా కట్టేందుకు అంగీకరించిన రొనాల్డో
- #FIFA2018: పీలేకి ఆ పేరు ఎలా వచ్చింది?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)