You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనాథ పసికందుకు పాలిచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు
అనాథగా చెత్తకుప్పలో పడి ఉన్న పసికందును చేరదీసి పాలిచ్చి కాపాడారు బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ అర్చన.
ఆ చిన్నారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకురాగానే, అర్చన అందుకుని చనుబాలు పట్టించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
"ఆ చిన్నారి పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పసికందు ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నా బిడ్డే ఏడుస్తున్నట్టుగా అనిపించింది. నా బిడ్డే అన్నట్టుగా పాలిచ్చాను. అంత పసిబిడ్డకు డబ్బాతో పాలు ఎలా తాగిస్తాం?" అని 32 ఏళ్ల అర్చన బీబీసీతో అన్నారు.
ఆమె ఐదేళ్లుగా పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఈ మధ్యే ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చారు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ నిర్మాణ ప్రాంతం వద్ద పసికందు అనాథగా పడి ఉండటం చూసి చెత్త ఏరుకునే వ్యకి సమీపంలోని దుకాణం నిర్వాహకుడికి చెప్పారు. ఆ విషయాన్ని దుకాణదారుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పారు.
దాంతో వెంటనే ఏసీపీ ఆర్.నగేష్ అక్కడికి వెళ్లి చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
"ఆస్పత్రిలో చిన్నారిని శుభ్రం చేయగానే, పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లాం. గుక్కపట్టి ఏడుస్తున్న ఆ బిడ్డను వెంటనే అర్చన తన చేతుల్లోకి తీసుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లి చనుబాలు ఇవ్వడం ప్రారంభించారు. అది చాలా ప్రశంసనీయమైన విషయం" అని నగేశ్ అన్నారు.
"చెత్త కుప్పలోంచి తీసుకొచ్చినప్పుడు ఆ చిన్నారి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు ఒక్క రూపాయి కూడా అడగలేదు. ఆస్పత్రి నుంచి బయటకు రాగానే స్థానిక దుకాణదారుడు బేబీ కోసం కొన్ని బట్టలు ఇచ్చారు. అతడు కూడా డబ్బులు తీసుకోలేదు" అని ఆయన వివరించారు.
ఆ చిన్నారికి కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి పేరు పెట్టామని నగేశ్ తెలిపారు.
"అర్చన చేసిన పని చాలా గొప్పది. మన సమాజంలో పసిపిల్లలను దైవ సమానంగా చూస్తాం. ఆ చిన్నారికి తన తల్లి ఎవరో కూడా తెలియదు" అని నగర డిప్యూటీ కమిషనర్ డాక్టర్. ఎస్. బోరలింగయ్య అన్నారు.
తాను చేసిన పనికి తన భర్త కూడా ప్రశంసించారని అర్చన ఆనందం వ్యక్తం చేశారు.
"కొద్ది రోజుల క్రితం కూడా ఇలాగే ఓ పసిబిడ్డను గుర్తించాం. అయితే సమీపంలోనే ఆ బిడ్డ తల్లి దొరకడంతో ఆమెనే పాలిచ్చారు. ఒక అనాథ బిడ్డకు నేను పాలివ్వడం ఇదే తొలి అనుభవం" అని అర్చన తెలిపారు.
ఈ చిన్నారి 'కుమారస్వామి'ని పోలీసులు శిశు విహార్‌లో చేర్పించారు. ఆ చిన్నారిని వదిలేసి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
"పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోగలిగితే జీవితం చాలా సాఫీగా సాగుతుంది" అన్నది అర్చన వాట్సాప్ స్టేటస్‌లో ఉన్న సందేశం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)