You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మండుతున్న కశ్మీర్: ఒక మరణం, అనేక ప్రశ్నలు
- రచయిత, అనురాధా భసీన్
- హోదా, సీనియర్ జర్నలిస్టు, బీబీసీ కోసం
భారత పాలనలో ఉన్న కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శుక్రవారం ప్రదర్శనకారుల మీదుగా సీఆర్‌పీఎఫ్ జీపు వెళ్లిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించి రాళ్లు రువ్వుతున్న కొందరు గుర్తుతెలియని వ్యక్తుల మీద, జీపును ర్యాష్‌గా నడిపారన్న ఆరోపణతో డ్రైవర్ మీద పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిరసనకారుల మీదుగా జీపు వెళ్లడంపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విటర్‌లో స్పందిస్తూ.. "గతంలో నిరసకారులను నిలువరించేందుకు మనుషులను జీపు బానెట్‌పై కట్టేసి గ్రామాల్లో తిప్పారు. ఇప్పుడు నిరసనకారుల మీదుగా జీపులను నడిపారు. ఇది మీ విధానమా? కాల్పుల విరమణ అంటే తుపాకి వాడొద్దు కాబట్టి జీపులను వాడుతున్నారా?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అయితే, గతంలో వీధుల్లో గుంపులను చెదరగొట్టే విషయంలో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అనుసరించిన తీరు కూడా గొప్పగా ఏమీ లేదు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010లో జమ్ముూ కశ్మీర్ పోలీసులు, పారా-మిలిటరీ బలగాలు జరిపిన కాల్పుల్లో 120 మందికి పైగా పౌరులు చనిపోయారు.
వారిలో ఎక్కువ మంది బుల్లెట్లు, పెల్లెట్లు లేదా టియర్ గ్యాస్ షెల్స్ నడుముకు పై భాగంలో తగలడం వల్లే మరణించారు.
వైరల్ వీడియోలు
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా యంత్రాంగం అనుసరిస్తున్న పద్ధతులు (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్) చర్చనీయాంశం అవుతున్నాయి.
గత ఎనిమిదేళ్ల కాలంలో ఆందోళనలు బాగా పెరిగాయి. ముఖ్యంగా 2016లో పెద్దఎత్తున పెల్లెట్ గన్స్ వాడటం వల్ల వంద మంది ప్రాణాలు కోల్పోయారు.
కొన్ని వందల మంది గాయపడ్డారు. వారిలో కొందరు పాక్షికంగా, మరికొందరు పూర్తిగా చూపు కోల్పోయారు.
ఆ ఘటన తర్వాత పరిణామాలు మరింత జటిలంగా మారాయి. రోజురోజుకీ నిరసనలు తీవ్రమవుతున్నాయి. యువతలో తెగించే ధోరణి పెరిగిపోతోంది.
కశ్మీర్‌లో నిరసనకారులను నియంత్రించేందుకు భద్రతా బలగాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
2010లో నిరసన ప్రదర్శన చేస్తున్న యువత టియర్ గ్యాస్ షెల్స్ తాకి చనిపోయారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాలిలోకి లేదా భూమి మీదకు కాల్పులు జరపాలి. కానీ, అప్పుడు పాయింట్ బ్లాంక్‌లో కాల్చారు.
తాజాగా ముగ్గురు నిరసనకారుల మీదుకు జీపు వెళ్లిన ఘటన, మే 5న కశ్మీర్‌లోని సఫకడల్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనను గుర్తు చేస్తోంది.
ఆ ఘటనలో ఓ యువకుడిని భద్రతా బలగాల వాహనం రెండు సార్లు ఢీకొట్టినట్టుగా ఉన్న ఓ వీడియో కశ్మీర్‌లో వైరల్ అయ్యింది. ఆ ఘటనపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
తాజా ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రకారం.. సీఆర్‌పీఎఫ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం రోడ్డుపై వెళ్తోంది. ఒక్కసారిగా నిరసనకారులు దానిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.
జీపుపై మూడు వైపుల నుంచి దాడి చేశారు. ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న ఆ జీపు మీదికి కూడా ఎక్కాడు. ఆ తర్వాత డ్రైవర్ వాహనం వేగాన్ని మరింత పెంచారు.
అయితే ఈ వీడియో యువకుల పైనుంచి వాహనం వెళ్లిన తర్వాత తీసిందా? లేక ముందే తీసిందా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
వాహనం కింద పడి ఉన్న ఇద్దరు యువకులను కొందరు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రెండు వేర్వేరు ఫొటోలు వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో కనిపించాయి.
ఆ ఫొటోల ప్రకారం ఒక వ్యక్తి జీపు కింద, మరొకరు దాని ముందు ముందు చక్రాల మధ్యలో ఇరుక్కున్నట్టు కనిపించింది. వారిని కాపాడేందుకు వాహనం ఆపినట్టుగా అర్థమవుతోంది.
అయితే, ఈ జీపు ఢీకొట్టడం వల్లనే చనిపోయినట్టుగా చెబుతున్న కైసర్ భట్ మాత్రం ఆ ఫొటోలలో కనిపించడంలేదు.
ఎన్నెన్నో ప్రశ్నలు
ఈ ఘటనపై సీఆర్‌పీఎస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. " ఒక్కసారిగా గుంపులుగా వచ్చిన యువకులు వాహనంపై దాడికి దిగారు. దాంతో డ్రైవర్ వేగం పెంచారు. ఆ యువకుడి మరణం అకస్మాత్తుగా జరిగింది" అని తెలిపారు.
వీడియో ఫుటేజీ చూస్తే.. నియంత్రించలేని రీతిలో ఒక్కసారిగా గుంపు మధ్యలో వాహనం చిక్కుకుపోయినట్టుగా అర్థమవుతోంది.
జీపుపై పెద్దఎత్తున యువకులు దాడి చేస్తున్నారు. రాళ్లు విసురుతున్నారు. చేతులతో, కాళ్లతో జీపుపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ ఆ వాహనం అక్కడే ఆగిపోతే, అందులోని భద్రతా సిబ్బంది ప్రాణాలకే ముప్పు ఏర్పడేది.
అయితే, ఇక్కడ కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఒకేసారి ముగ్గురు వ్యక్తుల మీద నుంచి జీపు వెళ్లలేదనడానికి వీడియోనే ఆధారం. మరి వాహనంపై నిరసనకారుల దాడి జరగక ముందు, లేదా ఆ తర్వాత అనవసరంగా ఆ వ్యక్తులపై నుంచి జీపు వెళ్లిందా?
కింద ఇరుక్కున్న వ్యక్తులను బయటకు తీసేందుకు రెండు చోట్ల జీపు ఆగినట్టు తెలుస్తోంది. మరి అప్పుడు నిరసనకారులు వాహనం మీద దాడి చేయలేదా?
మరో ప్రశ్న.. ఎప్పుడూ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు ఉండే ఆ ప్రాంతం గుండా భద్రతా బలగాల వాహనాన్ని ఒంటరిగా ఎలా పంపిస్తారు? అది భద్రతా చర్యల్లో లోపమా? లేక నిబంధనల అతిక్రమణా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేలా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అది అనుకోకుండా జరిగిపోయిందా? లేదా వాహనాలతో జనాలను ఢీకొట్టడమనేది కొత్త పద్ధతా? అన్నది వివరించాల్సిన అవసరం ఉంది.
కచ్చితమైన వరుస క్రమం ఎలా ఉన్నప్పటికీ, కశ్మీర్‌లో మరణించిన వారి సంఖ్యలో మరొకటి చేరింది. గాయపడిన మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు.
కాల్పుల విరమణ ముందే ఎత్తేస్తారా?
కశ్మీర్‌లో జరుగుతున్న ఘర్షణల పరంపరలో వీరు ముగ్గురూ ఒక ఫుట్‌నోట్‌గా మిగిలిపోవచ్చు.
కానీ ఈ సంఘటన కశ్మీరీల మనసులపై చెరగని ముద్రగా మిగిలిపోతుంది. భారత భద్రతా బలగాలపై కశ్మీరీల ఆగ్రహం ముందెన్నడూ లేనంతగా పెరిగిపోయింది.
అంతే కాకుండా, రంజాన్ పండుగ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటించిన క్రమంలోనే ఈ ఘటన జరగడం వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేస్తోంది.
మరణించిన 25 ఏళ్ల కైసర్ భట్ అంత్యక్రియల సందర్భంగా శనివారం కశ్మీర్ లోయలో మరోసారి నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తినపుడు ప్రభుత్వ బలగాలు మరోసారి టియర్ గ్యాస్, కాల్పులను ప్రయోగించాయి.
ఈ సంఘటనలకు అర్థం ఏమిటి? కాల్పుల విరమణ సమయాన్ని ముందే ఎత్తేస్తారా? దీనిపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది.
కశ్మీర్ రాజకీయాలు అక్కడి వాతావరణంలా ఎప్పుడు, ఎలా మారతాయో ఎవరికీ తెలీదు.
ప్రస్తుత సంక్షోభాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, భద్రతా బలగాలు ఎలా వ్యవహరిస్తాయన్న దానిపైనే పై ప్రశ్నలకు సమాధానం ఆధారపడి ఉంటుంది.
(ఇవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)