You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మరో 'జీపు ఘటన'తో మళ్లీ ఉద్రిక్తంగా మారిన కశ్మీర్
- రచయిత, మాజిద్ జహాంగీర్
- హోదా, బీబీసీ కోసం, శ్రీనగర్ నుంచి
భారత పాలనలో ఉన్న కశ్మీర్‌లో భద్రతా బలగాలు ప్రదర్శనకారుల మీదుగా జీపును నడిపించిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కశ్మీర్‌లో భారత వ్యతిరేక ప్రదర్శనలు వెల్లువెత్తాయి.
శుక్రవారం నాడు శ్రీనగర్ డౌన్‌డౌన్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఒక వాహనం ఒక యువకుడిని ఢీకొట్టింది.
ఈ ఘటనలో మృతి చెందిన యువకుడిని 21 ఏళ్ల కైసర్ అహ్మద్ బట్‌గా గుర్తించారు.
కాగా, డౌన్‌టౌన్‌లోని ఫతేహ్ కదల్‌లో శనివారం సాయంత్రం సీఆర్‌పీఎఫ్ 82వ బెటాలియన్‌పై గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. కశ్మీర్ ప్రాంతంలో నిన్నటి నుంచి జరుగుతున్న గ్రెనేడ్ దాడుల్లో ఇది ఐదవది.
అంతకు ముందు, అనంతనాగ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన గ్రెనేడ్ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
శుక్రవారం త్రాల్‌లో పీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే నివాసంపై గ్రెనేడ్ విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.
శుక్రవారం నుంచి ఘటనల క్రమం
శుక్రవారం నాడు జామా మసీదులో ప్రార్థనల అనంతరం జనాలు బయటకు వస్తున్న సమయంలో, పెద్ద సంఖ్యలో యువకులు ఒకచోటకు చేరి శాంతియుత ప్రదర్శన కోసం సిద్ధమయ్యారు.
పోలీసులు తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనేది వారి ఆరోపణ. రంజాన్ సందర్భంగా నగరంలోని ఒక మసీదులో తీవ్రవాదులు దాక్కున్నారంటూ పోలీసులు దానిపై దాడి జరిపినందుకు వారు నిరసన తెలపాలనుకున్నారు.
గుంపు మీదుగా దూసుకొచ్చిన జీపు
ఇంతలో సీఆర్పీఎఫ్‌కు చెందిన ఒక వాహనం ఖాన్యార్ వైపు నుంచి గుంపు వైపుగా దూసుకొచ్చింది. దాంతో అక్కడున్న యువకులు ఆగ్రహించారు. వాహనం గుంపు మధ్యకు వచ్చాక ఇరు పక్షాల మధ్య ఘర్షణ మొదలైంది.
సీఆర్పీఎఫ్ వాహనం ఆ గుంపులోంచి బయటకు వెళ్లేందుకు చేసే ప్రయత్నంలో అది ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరైన కైసర్ అహ్మద్ బట్ చికిత్స క్రమంలో ఆసుపత్రిలో మృతి చెందాడు.
శనివారం కైసర్‌ను ఖననం చేసిన తర్వాత వెనక్కి వస్తున్న సమయంలో భద్రతా బలగాలకు, యువకులకు మధ్య ఘర్షణ జరగగా, పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
కైసర్ అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఆజాదీ' అంటూ వారు నినాదాలు చేశారు.
ఈ ఘటన తర్వాత శ్రీనగర్ డౌన్‌టౌన్ ప్రాంతంలో ప్రభుత్వం కఠిన ఆంక్షల్ని విధించింది. పోలీసు, అర్ధసైనిక బలగాలను భారీ సంఖ్యలో మోహరించింది.
'మేం వాహనాన్ని వారి మీదుగా నడపలేదు'
సీఆర్పీఎఫ్ ప్రతినిధి సంజయ్ శర్మ బీబీసీతో మాట్లాడుతూ, గుంపు తమ వాహనాన్ని పల్టీ కొట్టించాలని ప్రయత్నించిందని అన్నారు.
"మా వాహనం గుంపు దగ్గరకు వెళ్లగానే దాదాపు 500 మంది నిరసనకారులు నాలుగు వైపుల నుంచీ చుట్టుముట్టి దాని పైకి ఎక్కారు. వాహనంలో ఉన్న ఐదుగురు జవాన్లను బయటకు లాగడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక యువకుడు స్వయంగా వాహనం కిందకు వచ్చి దాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. మా జవాన్లు చాలా ఓపికపట్టారు. ఒక్క తూటా కూడా పేల్చలేదు" అని ఆయన వివరించారు.
ఈ ఉదంతంపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఒక కేసు సీఆర్పీఎఫ్‌పై నమోదు చేశామనీ, మరొకటి అల్లర్లను రెచ్చగొట్టినందుకు నమోదు చేసినట్టు శ్రీనగర్ ఎస్ఎస్‌పీ ఇంతియాజ్ పరే చెప్పారు.
రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ ఘటనపై స్పందిస్తూ తన ట్విటర్ హ్యాండిల్‌పై, "సీజ్‌ఫైర్ అంటే, తుపాకుల్ని ఉపయోగించకుండా, జీపులను ఉపయోగించడమని అర్థమా?" అని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని ప్రశ్నించారు.
కశ్మీర్ బంద్‌కు వేర్పాటువాదుల పిలుపు
భద్రతా బలగాలు సాధారణ పౌరులను హత్య చేశాయంటూ దీనికి నిరసనగా నేడు వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు.
నగరంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.
మరోవైపు, సోషల్ మీడియాలో ఒక ఫొటోపై బాగా చర్చ జరుగుతోంది. ఆ ఫొటోలో ఒక యువకుడి మీదుగా భద్రతా బలగాలు జీపును నడిపిస్తున్న దృశ్యం కనిపిస్తోంది.
శనివారం నాడు చాలా వరకు దుకాణాలు బంద్ అయ్యాయి. రోడ్లపై భద్రతా బలగాల మోహరింపు భారీ సంఖ్యలో కనిపించింది.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్వరలోనే కశ్మీర్ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
కశ్మీరీ వేర్పాటువాదులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1980లో ఉద్యమం ప్రారంభించారు. స్థానికులు చాలా మంది ఈ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)