You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విదేశాల్లో భారత్ ‘రా’ ఏజెంట్లు పనిచేస్తున్నారా, వారిపై ఆయా దేశాల ఆరోపణలు ఏంటి?
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
న్యూయార్క్‌లో అమెరికా పౌరుడి హత్యకు కుట్ర పన్నారంటూ వికాస్ యాదవ్ అనే భారతీయుడిపై అమెరికా న్యాయ విభాగం అభియోగాలు నమోదు చేసింది.
దాదాపు ఆరు నెలల కిందట ఏప్రిల్ 29న వాషింగ్టన్ పోస్ట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్ వైట్‌హౌస్ లాన్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతుండగా, భారత గూఢచార సంస్థ రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)కు చెందిన ఓ అధికారి... గురుపట్వంత్ సింగ్ పన్నూను అంతమొందించాలని హిట్ టీమ్‌గా పిలిచే ఒక కిరాయి ముఠాకు ఆదేశాలిస్తున్నారు. పన్నూ అమెరికాలో మోదీకి అతిపెద్ద విమర్శకులు’’ అని ఆ కథనం సారాంశం.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనంలో భారత ఏజెంట్ విక్రమ్ అలియాస్ వికాస్ యాదవ్ పన్నూ న్యూయార్క్ చిరునామాను హిట్ టీమ్‌కు పంపించారు.
పన్నూను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌కు అప్పటి ‘‘రా’’ చీఫ్ సమంత్ గోయల్ ఆమోదం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది.
సీఆర్‌పీఎఫ్ అధికారి అయిన వికాస్ యాదవ్‌కు, అమెరికా కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ నుంచి తప్పించుకునేందుకు అవసరమైన సామర్థ్యం, శిక్షణ లేవని ఆ కథనం చెబుతోంది.
పన్నూను హత్యచేయించేందుకు ‘రా’ మధ్యవర్తిగా నిఖిల్‌గుప్తాను ఎంచుకుంది. కానీ ఆయన తనకు తెలియకుండానే అమెరికా ప్రభుత్వానికి సమాచారం చేరవేసే వ్యక్తికే ఈ కిరాయి హత్య కాంట్రాక్ట్ ఇచ్చారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
ఈ కథనాన్ని ‘‘నిరాధారమైనది, అబద్దాలతో కూడుకున్నది’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అభివర్ణించారు.
‘‘ఇలాంటి ఆపరేషన్లు పూర్తిచేయడానికి కొన్నిసార్లు నెలల సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో సంవత్సరాలు కూడా పడుతుంది. అయితే ‘‘రా’’ ఉన్నతాధికారులు, జాతీయ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్ త్వరగా పూర్తికావాలని కోరుకున్నారు. దీనికి సంబంధించి ఏజెన్సీపై రాజకీయ ఒత్తిడికి అవకాశం ఉన్న విషయాన్ని తోసిపుచ్చలేం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ‘‘రా’’ మాజీ ప్రత్యేక కార్యదర్శి తెలిపారు.
‘‘అఫ్గానిస్తాన్‌తో పాటు ఇతర దేశాల్లో ‘‘రా’’ ఆపరేషన్లలో నిఖిల్ గుప్తా గతంలో ఆ సంస్థకు సహాయపడ్డారు. అయితే పాశ్చాత్యదేశాల్లో ఆపరేషన్‌కు ఆయన్ను వినియోగించడం ఇదే తొలిసారి’’ అని నిఖిల్ నేపథ్యం గురించి తెలిసినవారు చెబుతున్నారు.
కుల్‌భూషణ్ జాదవ్ కేసు
విదేశాల్లో ఓ వ్యక్తిని అరెస్టు చేయడం, బహిష్కరించడం ఇదే మొదటిసారి కాదు. ఇలాగే గతంలోనూ కొన్ని ఘటనలు జరిగాయి.
ఏడేళ్ల కిందట ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లో కుల్‌భూషణ్ జాదవ్‌ను పట్టుకున్నారు.
భారత నావికాదళం మాజీ అధికారి అయిన జాదవ్ ఇప్పటికీ పాకిస్తాన్ జైలులోనే ఉన్నారు. ఆయన్ను తిరిగి భారత్ రప్పించేందుకు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
అమెరికా, కెనడాలోనే కాదు. ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్‌లలో కూడా ‘‘రా’’ ఏజెంట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి, అక్కడి భద్రతా సంస్థలకు మధ్య అనేక గొడవలు ఉన్నాయి.
కొన్నిదేశాలలో కొందరు వ్యక్తులను ‘‘రా’’ ఏజెంట్లుగా ఆరోపించి వారిని అరెస్టు చేశారు. వారిని ఆయా దేశాల నుంచి బహిష్కరించారు.
‘‘భారత భద్రతకు తీవ్రముప్పు కలిగించేఅంశంగా ఖలిస్తానీ ఉద్యమాన్ని భారత అధికారయంత్రాంగం అనేక దశాబ్దాలుగా పరిగణిస్తోంది. భారత నిఘా సంస్థలు విదేశాల్లో ఆ ఉద్యమానికి సంబంధించిన కార్యకలాపాలను పరిశీలిస్తున్నాయి. కానీ ఆయా దేశాలకు భారత నిఘా సంస్థలు చేసే పని నచ్చడంలేదు’’ అని వాషింగ్టన్ పోస్ట్ ఇండియా బ్యూరో చీఫ్ గారీ షై ‘‘ది వైర్’’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
జర్మనీలో ‘రా’ఏజెంట్లనే పేరుతో జైలు శిక్ష
‘‘జర్మనీలో నివసిస్తున్న కొందరు సిక్కులు 2019లో ‘రా’ ఏజెంట్లుగా నియమితులయ్యారు. వారిని జర్మనీ భద్రతాసంస్థలు అరెస్టుచేసి, విచారణ జరిపాయి. ఖలిస్తానీ, కశ్మీరీ కార్యకర్తలపై నిఘా పెట్టి, వారి సమాచారం ‘రా’ కు చేరవేసినందుకు భారతీయ జంట మన్‌మోహన్, కన్వల్‌జిత్‌కు జైలుశిక్ష, జరిమానా విధించారు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని మాజీ ‘రా’ అధికారి ఒకరు వెల్లడించారు.
‘‘2015 జనవరిలో మన్‌మోహన్ ‘రా’ కోసం గూఢచర్యం చేయడం మొదలుపెట్టారు. 2017 జూలై నుంచి ఆయన భార్య కన్వల్‌జిత్ భర్తకు సహకరించడం మొదలుపెట్టారు. వారి సేవలకు ప్రతిఫలంగా ‘రా’’ 6 లక్షలు(7,200 యూరోలు)కు పైగా డబ్బు అందించింది. ‘రా’ అధికారులను చాలా సార్లు కలిశామని విచారణలో వారిద్దరూ అంగీకరించారు’’ అని జర్మన్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ డాయ్ చు వెల్లా తన నివేదికలో పేర్కొంది.
‘రా’ ఏజెంట్లనే ఆరోపణలతో బహిష్కరణ
2020-21లో ఆస్ట్రేలియా కూడా ఇద్దరిని ‘రా’ ఏజెంట్లగా ఆరోపించింది. ఆస్ట్రేలియా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వారిని పట్టుకుని, తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమంతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు.
ఆస్ట్రేలియాలో రెండు ప్రధాన వార్తా సంస్థలయిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ఏబీసీ న్యూస్ రెండు పెద్ద కథనాలు ప్రచురించాయి. ‘‘ఓ భారీ గూఢచార నెట్‌వర్క్‌ను ఛేదించారు. గూఢచారులను దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు’’ అని ఆ కథనాల్లో పేర్కొన్నాయి.
నిఘా వ్యవస్థను ఛేదించడంపై ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ చీఫ్ మైక్ బర్గెస్ ఆ సమయంలో ఓ ప్రకటన చేశారు. అప్పుడందరూ మైక్ బర్గెస్ చెబుతోంది రష్యా లేదా చైనా నిఘా సంస్థల గురించని భావించారు.
భారత్‌లోని మోదీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలో గూఢచారుల నెట్‌వర్క్ నెలకొల్పిందని చెబుతూ 2024 ఏప్రిల్‌లో ఏబీసీ న్యూస్ ఓ రిపోర్ట్ ప్రచురించింది.
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు ఆస్ట్రేలియాకు సంబంధించిన రహస్య రక్షణ ప్రాజెక్టుల వివరాలు, వాణిజ్య సంబంధమైన వ్యవహారాల సమాచారం సేకరించడం వంటివి ఆ చేశారని ఆ వ్యక్తులపై ఆరోపణలొచ్చాయి.
బ్రిటన్‌లోనూ ఆరోపణలు
‘‘2014-15లో సమంత్ గోయల్ లండన్‌లో ‘‘రా’’ స్టేషన్ చీఫ్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన తన పరిధిని అతిక్రమిస్తున్నట్టు బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ-15 హెచ్చరించింది. ఆ సమయంలో గోయల్‌ను బ్రిటన్ నుంచి బహిష్కరించాలని కూడా ఆ దేశ అధికారులు ఆలోచించారు. ఖలిస్తానీ నాయకుడు అవ్తర్ సింగ్ ఖండాను వెంటాడినట్టు, బెదిరించినట్టు భారత ఏజెంట్లపై ఆరోపణలొచ్చాయి’’ అని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
ఈ హెచ్చరిక అందిన తర్వాత గోయల్ కోపంగా స్పందించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. భారత భద్రతకు వాళ్లు తీవ్ర ప్రమాదకరంగా మారారని, వాళ్లతో ఎలా వ్యవహరించాలనేది తమ అధికారపరిధిలోని అంశమని గోయల్ అన్నట్టు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో రాసింది.
తర్వాత గోయల్ లండన్ నుంచి ఢిల్లీ తిరిగి వచ్చారు. ‘రా’లో సీనియర్ హోదాల్లో పనిచేస్తూ చివరకు 2019లో ఆ సంస్థ చీఫ్ అయ్యారు.
పాకిస్తాన్‌లో ఆ హత్యల వెనుక ఉందెవరు?
పాకిస్తాన్‌లో ఖలిస్తాన్ ఉద్యమంతో సంబంధమున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యల్లో ‘రా’ ప్రమేయముందని 2024 ఏప్రిల్ 4న బ్రిటిష్ న్యూస్ పేపర్ గార్డియన్ ఓ కథనం ప్రచురించింది. భారత్, పాకిస్థాన్ నిఘా అధికారుల ఇంటర్వ్యూల ఆధారంగా ఆ కథనం ప్రచురించినట్టు గార్డియన్ తెలిపింది.
ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఈ కథనానికి మరింత బలం చేకూర్చాయి. ‘‘మనం వాళ్ల ఇళ్లల్లోకి ప్రవేశించి దాడులు చేస్తామని మన శత్రువులకు సైతం తెలుసు’’ అని ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యానించారు.
అయితే ‘చట్టం పరిధి వెలుపల హత్యలు’ తమ విధానం కాదని భారత ప్రభుత్వం పదే పదే చెబుతుంటుంది.
వాషింగ్టన్ పోస్ట్‌లో ప్రచురితమైన కథనం ‘నిరాధారమైనది, అవాస్తవమైనది’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అభివర్ణించారు.
భారత వ్యవస్థలపై, భారతీయులపై దాడులు చేయాలని ప్రజలను రెచ్చగొట్టినట్టు ఆరోపణలున్న పన్నూ, నిజ్జర్ వంటి ఖలిస్తాన్ కార్యకర్తలపై అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా భారతీయ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
భారత్ ఫిర్యాదుచేసినప్పటికీ, ఖలిస్తాన్ కార్యకర్త తల్వీందర్ సింగ్ పర్మార్‌పై కెనడా ప్రభుత్వం 1980లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
తీవ్రవాదసంస్థ బబ్బర్ ఖల్సా తొలి అధ్యక్షుడు పర్మార్. 1985లో ఎయిర్ ఇండియా విమానం కనిష్కను బాంబులతో పేల్చివేసి 329 మంది ప్రాణాలు తీసిన ఘటనకు ప్రధాన సూత్రధారి పర్మార్ అని నమ్ముతారు.
1992లో పంజాబ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పర్మార్ చనిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)