You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇంటింటికీ వెళ్లి 45 మంది పౌరులను కాల్చి చంపిన ఇథియోపియా బలగాలు.. మృతుల్లో ఒకరు గర్భవతి
ఇథియోపియాలోని అమ్హారా రాష్ట్రం మెరావి పట్టణంలో గత నెల ప్రభుత్వ బలగాలు ఇంటింటిపై జరిపిన దాడిలో 45 మంది పౌరులను చంపేసినట్లు ఇథియోపియా మానవ హక్కుల కమిషన్ తెలిపింది.
మృతుల్లో ఒక గర్భవతి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు.
ప్రభుత్వ బలగాల కాల్పుల్లో గాయపడ్డ ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ మరణాలపై ఇథియోపియా ప్రభుత్వం స్పందించలేదు. సుమారు 45 మంది ప్రజలు చనిపోయినట్లు తాము గుర్తించామని మానవ హక్కుల కమిషన్ తెలిపింది.
పౌరుల ఊచకోతపై అమెరికా, యూరోపియన్ యూనియన్ రెండూ ఆందోళ వ్యక్తం చేశాయి. దీనిపై స్వతంత్ర విచారణకు పిలుపునిచ్చాయి.
2023 ఆగస్ట్ నుంచి అమ్హారా ప్రాంతంలో చెలరేగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇది ఒకటి.
ఫానో ఫైటర్లను నిరాయుధులుగా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలకు వ్యతిరేకంగా శక్తిమంతమైన స్థానిక ఫానో మిలీషియాలు తమ పోరాటాన్ని ప్రారంభించారు.
అంతకుముందు ఫానో మిలీషియాలు ఇథియోపియా బలగాలతో కలిసి టిగ్రే ప్రాంతంలో ఉన్న ఉమ్మడి శత్రువు టీపీఎల్ఎఫ్ రెబల్స్‌పై పోరాడేవి.
టిగ్రేలో ప్రస్తుతం శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ఫానో, ఇతర మిలీషియాలను నిరాయుధులను చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
జనవరి 29న ప్రభుత్వ ఆర్మీకి, ఫానో ఫైటర్లకు మధ్య కొన్ని గంటల పాటు భీకర పోరాటం జరిగిందని మెరావి వాసులు చెప్పారు. ఆ తర్వాత యూనిఫామ్‌లో ఉన్న ఇథియోపియా భద్రతాధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీ చేసినట్లు తెలిపారు.
‘రోడ్లపై శవాలను చూశాను’
ఈ విషయంపై బీబీసీ పలువురు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది.
‘‘నా సోదరుల ఇంట్లోకి వారు వెళ్లారు. అతన్ని, మరో 12 మందిని తీసుకొని వచ్చారు. వారిని వీధుల్లో నిల్చోబెట్టి కాల్పులు జరిపారు’’ అని ఒక స్థానికుడు బీబీసీకి చెప్పారు.
సైనికులు తమల్ని బెదిరించారని, ఫానో ఫైటర్లకు ఆశ్రయమిస్తున్నట్లు, ఆహారం అందిస్తున్నట్లు ఆరోపించారని మరో స్థానికుడు చెప్పారు.
మరో వ్యక్తి సివిల్ సర్వెంట్‌గా పనిచేసే తన సోదరుడి గురించి చెబుతూ బాధపడ్డారు. ‘‘అతనితోపాటు కొడుకు కూడా ఉన్నాడు. పిల్లాడిని పట్టుకోవాలని వారు నాకు చెప్పారు. వారు నా తమ్ముడిని తీసుకెళ్లి, చంపేశారు’’ అంటూ రోదించారు.
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం చాలా మంది యువకులనే వారు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలిసింది.
ప్రభుత్వ దళాల కాల్పుల్లో గాయపడ్డ గర్భిణి ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాత మరణించినట్లు వైద్య సిబ్బంది బీబీసీకి తెలిపారు.
మెరావి పట్టణంలో కాల్పుల సమయంలో ప్రభుత్వ బలగాలకు కనపడకుండా దాక్కుని, ఆ తర్వాత పరిగెత్తుకుని వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న ఒక వ్యక్తి ఈ ఊచకోత గురించి బీబీసీకి వివరించారు. ‘‘ఆ తర్వాత రోజు నేను బయటకి వెళ్లినప్పుడు, రోడ్లపై శవాలు పడి ఉండటాన్ని చూశాను’’ అని చెప్పారు.
ప్రభుత్వ బలగాల చేతిలో మృతి చెందిన 45 మంది మృతదేహాలను గుర్తించామని ఇథియోపియా మానవ హక్కుల కమిషన్(ఈహెచ్‌ఆర్‌సీ) తెలిపింది. బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఇది అంచనా వేస్తోంది.
దేశంలో అత్యంత ఎక్కువ జనాభా ఉన్న రెండో పట్టణమైన అమ్హారాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను మరింత కాలం పొడిగించాలని గత వారమే ఇథియోపియా ఎంపీలు నిర్ణయించారు. మరో నాలుగు నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)