You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ జెయింట్ టెలీస్కోప్ విశ్వం గుట్టు విప్పుతుందా, ఇది తీసిన మొదటి ఫోటో ఎలా ఉందంటే..
చిలీలోని శక్తిమంతమైన కొత్త టెలిస్కోప్ విశ్వాంతరాళ చీకటిలోతులను దర్శించగల తన అద్వితీయ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, తొలి ఫోటోలను విడుదల చేసింది.
ఇది విడుదల చేసిన ఒక ఫోటోలో విస్తృతమైన రంగుల వాయువులు, ధూళిమేఘాలు సుడిగుండంలా తిరుగుతూ ఓ నక్షత్ర జనన ప్రాంతంలో నృత్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ ప్రాంతం భూమికి 9 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డిజిటల్ కెమెరాలతో ఉన్న వెరా సీ రూబిన్ పరిశోధనాశాల, విశ్వంపట్ల మనకు ఉన్న అవగాహనను పూర్తిగా మార్చగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సౌర కుటుంబంలో 9వ గ్రహం నిజంగా ఉండి ఉంటే, ఈ టెలిస్కోప్ దానిని తన మొదటి ఏడాదిలోనే గుర్తించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాలను ఇది గుర్తించాలి, పాలపుంత గమన పటాన్ని రూపొందించాలి. మన విశ్వం రూపొందడానికి కారణమైన అంతుపట్టని కృష్ణపదార్థాల గురించిన కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
దక్షిణభాగంలో ఆకాశాన్ని దశాబ్దం పాటు నిరంతరాయంగా చిత్రీకరించే ప్రయాణానికి ఇది ప్రారంభం.
‘‘వ్యక్తిగతంగా ఈ దశకు చేరేందుకు పాతికేళ్లుగా శ్రమిస్తున్నాను. దశాబ్దాలుగా ఈ రకం సర్వే కోసం అద్భుతమైన సదుపాయాన్ని నిర్మించాలన్న ఆశయంతో పనిచేశాం’’ స్కాట్లాండ్ ఖగోళ శాస్త్రవేత్త కెథ్రిన్ హేమన్స్ చెప్పారు.
టెలిస్కోప్ తన మార్గంలో తీసే అతి సూక్ష్మచిత్రాలను ప్రాసెస్ చేయడం కోసం ఈ సర్వేలో కీలకభాగస్వామిగా ఉన్న యూకే డేటా సెంటర్లను నిర్వహిస్తోంది.
మన సౌర కుటుంబంలో ఇప్పటికే గుర్తించిన ఖగోళ వస్తువుల సంఖ్యను వీరా రుబిన్ పదింతలు పెంచగలదని భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)