నిమిష ప్రియను మరణశిక్ష నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్న 8 మంది, వాళ్లు ఎవరు?

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ హత్య కేసులో భారతీయ నర్సు నిమిష ప్రియకు జూలై 16న అమలు చేయాల్సిన మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా పడింది. మరణశిక్ష అమలు తేదీ ఇంకా ఖరారు చేయలేదు.

ఈ నిర్ణయం నిమిష ప్రియ తల్లి ప్రేమ కుమారితో పాటు సామాజిక కార్యకర్తలు, నిమిషను మరణశిక్ష నుంచి తప్పించడానికి పోరాడుతున్న 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' సభ్యులకు ఎంతో ఊరటనిచ్చింది.

అదే సమయంలో, మరణశిక్షను వాయిదా మాత్రమే వేయడం, రద్దు చేయకపోవడంతో మహదీ కుటుంబం నుంచి నిమిష ప్రియకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

మొదట్నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో కీలకపాత్ర పోషించిన వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది.

నేరం జరగలేదని అనలేం, కానీ.. శామ్యూల్ జెరోమ్

తమిళనాడుకు చెందిన శామ్యూల్ జెరోమ్ చాలా సంవత్సరాలుగా కుటుంబంతో యెమెన్‌లో ఉంటున్నారు. యెమెన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీకి ఏవియేషన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శామ్యూల్.. నిమిష ప్రియ కేసు మీడియా దృష్టికి రావడంలో కీలకపాత్ర పోషించారు. ఈయనకు నిమిష కుటుంబం తరఫున యెమెన్‌లో కేసు నిర్వహణకు పవర్ ఆఫ్ అటార్నీ ఉంది.

''2017లో మహదీ హత్యకు గురైన తర్వాత, నిమిష పాస్‌పోర్ట్ ఫోటో, మహదీ మృతదేహం ముక్కలైపోయిన ఫోటో వాట్సాప్‌లో సర్క్యులేట్ కావడం ప్రారంభించాయి. యెమెన్‌లో నిమిషకు సాయం చేస్తున్నారనే అనుమానంతో కొంతమంది భారతీయులను అరెస్టు చేశారు.

నేను ఆ సమయంలో తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటిలో ఉన్నా. యెమెన్‌లోని సనాకు చేరుకున్న తర్వాత, నేను ఈ కేసు గురించి తెలుసుకున్నా'' అని శామ్యూల్ బీబీసీతో చెప్పారు.

2017లో నిమిష ప్రియ అరెస్ట్ అయినప్పుడు, అంతర్యుద్ధం కారణంగా యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయ కార్యకలాపాలు ఆగిపోయాయి.

''నిమిష అరెస్ట్ అయిన తర్వాత, ఒక యెమెన్ కార్యకర్త నాకు ఫోన్ చేసి ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని సంప్రదించకపోతే, నిమిష విచారణ పారదర్శకంగా సాగదని చెప్పారు. అప్పుడు నేను అప్పటి భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే.సింగ్‌ను సంప్రదించాను'' అని శామ్యూల్ చెప్పారు.

ఆ తర్వాత, ''వీకే. సింగ్ తూర్పు ఆఫ్రికా దేశమైన జిబౌటిలోని భారత రాయబార కార్యాలయం ద్వారా యెమెన్‌కు ఒక లేఖ పంపారు. మేము దానిని తీసుకొని హూతీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఇచ్చాం. ఆ తర్వాతే నిమిష కేసులో సరైన న్యాయ విచారణ జరిగింది.'

యెమెన్‌లోని షరియా చట్టం ప్రకారం, మహదీ కుటుంబంతో క్షమాపణ చర్చలు జరపడానికి నిమిష కుటుంబం శామ్యూల్‌కు అధికారం ఇచ్చింది.

''నేను 2018లో మొదటిసారి నిమిషతో మాట్లాడా. కేసులో ఏం జరిగిందనేది ఆమె వైపు నుంచి వినాలనే ఉద్దేశంతోనే కాకుండా, భారత్‌కు చెందిన ఒకరు విదేశాల్లో ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో కూడా నేను నిమిషతో మాట్లాడా. ఏం జరిగిందో వివరిస్తూ ఆమె నాకు 14 పేజీల లేఖ రాశారు. దాని ఆధారంగా నేను మీడియాతో మాట్లాడాను'' అని శామ్యూల్ చెప్పారు.

నిమిష మరణశిక్ష చివరి నిమిషంలో వాయిదా వేయడం వల్ల మహదీ కుటుంబంతో చర్చలు జరపడానికి ఎక్కువ సమయం లభించిందన్నారు.

''మహదీ కుటుంబం పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. నిమిష నేరస్తురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, షరియా చట్టంలో ఒక మార్గం ఉండడం వల్ల మాత్రమే మేం ప్రయత్నిస్తున్నాం. క్షమాభిక్షకు వారు ఇప్పటికీ ఆసక్తి చూపడం లేదు. మేం సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'' అని ఆయన అన్నారు.

గతేడాది ఏప్రిల్‌లో భారత ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో యెమెన్‌కు వెళ్లిన నిమిష తల్లి ప్రేమ కుమారి, యెమెన్‌లో శామ్యూల్ జెరోమ్ కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్

''2019లో, నేను ఈ కేసు గురించి ఒక వార్తాపత్రికలో చదివాను. పట్టించుకోకుండా వదిలేయలేకపోయాను. అంతర్యుద్ధం జరుగుతున్న దేశంలో చిక్కుకుపోయిన భారత మహిళ ఎలా ఉండుంటారో నేను ఆలోచించాను. యెమెన్‌లో ఆమెకు సరైన న్యాయ సహాయం అందేలా చూడడమే నా లక్ష్యం'' అని సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ వైస్ చైర్‌పర్సన్, న్యాయవాది దీపా జోసెఫ్ చెప్పారు.

''నేను 2020 లో నిమిష కుటుంబాన్ని కలిశాను. నిమిషా తల్లి వితంతువు. ఆమె ఎర్నాకుళంలో ఉంటారు. పాలక్కాడ్‌లోని తన ఏకైక ఆస్తిని అమ్మేసి, యెమెన్ జైలులో ఉన్న తన కుమార్తెకు చట్టపరమైన ఖర్చుల కోసం డబ్బు పంపారు. ఆమె దృఢ సంకల్పాన్ని చూసి, నిమిషకు సహాయం చేయడానికి 2020 అక్టోబరులో సేవ్ నిమిష ప్రియ కౌన్సిల్ ఏర్పడింది'' అని దీపా జోసెఫ్ తెలిపారు.

నిమిషను రక్షించడానికి సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ విరాళాల ద్వారా నిధులు సేకరించింది. ఈ బృందం సహాయంతో, నిమిష తల్లి ప్రేమ కుమారి భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొంది, 2024 ఏప్రిల్‌లో యెమెన్‌కు వెళ్లారు.

అదే సంవత్సరంలో, మహదీ కుటుంబంతో చర్చలు జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించిన యెమెన్ న్యాయవాదికి కౌన్సిల్ రెండు విడతలుగా 34 లక్షల రూపాయలు చెల్లించింది.

‘కావాలని చేసిన హత్య కాదు’

''మహదీ కుటుంబానికి బ్లడ్‌మనీ రూపంలో 8 కోట్ల 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, మహదీ కుటుంబం బ్లడ్‌మనీకి సంబంధించి ఎలాంటి షరతులను పెట్టలేదు. వారు నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు ఆసక్తి చూపడం లేదు" అని సేవ్ నిమిష ప్రియ కౌన్సిల్ సభ్యుడు బబూ జాన్ అన్నారు.

2002 నుంచి 2015 వరకు యెమెన్‌లోని ఒక ముడిచమురు కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన బబూ జాన్ ఇప్పుడు కేరళలో ఉంటున్నారు.

''మేం నిమిష నేరాన్ని సమర్థించడం లేదు. మరణించిన మహదీని మేము నిందించడం లేదు. కానీ, పాలక్కాడ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన నిమిష తన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి యెమెన్‌కు వెళ్లారు. అక్కడ 'క్లినిక్' ప్రారంభించడానికి చాలా లక్షలు అప్పు చేశారు.

మహదీని చంపాలనే ఉద్దేశం ఉంటే ఆమె ఇలా చేసేవారు కాదు. నిమిష తల్లి, ఆమె కుమార్తె బాధ మాకు తెలుసు. అందుకే మేం చేయగలిగినదంతా చేస్తున్నాం'' అని బబూ జాన్ చెప్పారు.

''నేను కొన్నేళ్లు అబుదాబిలో టీచర్‌గా పనిచేశాను. రాజకీయ స్థిరత్వం లేని యెమెన్ వంటి దేశంలో హత్య కేసులో చిక్కుకోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే కౌన్సిల్ ద్వారా నిమిషకు అవసరమైన సహాయం అందించాం'' అని కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపల్, 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' సభ్యులు మూసా అన్నారు.

నిమిష ప్రియను దౌత్యపరమైన చర్యల ద్వారా రక్షించడానికి భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 'సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' గ్రూప్ తరఫున జూలై 10న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ సుభాష్ చంద్రన్ కూడా నిమిషను రక్షించడానికి ప్రయత్నిస్తున్నవారిలో ముఖ్యమైన వ్యక్తి.

''యెమెన్ న్యాయవ్యవస్థ నిమిషకు క్షమాభిక్ష కోరే అవకాశాన్ని అందిస్తోంది. కాబట్టి మేం దానిని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. నిమిష ఇప్పటికే చాలా సంవత్సరాలు జైలులో గడిపారు. ప్రాణానికి ప్రాణం సమాధానం కాదు'' అని సుభాష్ చంద్రన్ అన్నారు.

షేక్ అబ్దుల్‌ మాలిక్ అల్ నెహ్యా, అబ్దుల్లా అమీర్

యెమెన్‌లో అనేక గిరిజన సమూహాలు ఉన్నాయి. వారికి యెమెన్ రాజకీయాలపై గట్టి పట్టుంది. మృతుడు తలాల్ అబ్దో మహదీ కూడా 'అల్-ఒసాబ్' అనే గిరిజన సమూహానికి చెందినవారు.

నిమిష ప్రియ విషయంలో, మహదీ కుటుంబం నుంచి క్షమాపణ పొందడం అంత తేలికైన పని కాదు, ఎందుకంటే నిమిష కుటుంబం లేదా శామ్యూల్ జెరోమ్ వారితో నేరుగా మాట్లాడలేరు. ఇది కొంతమంది గిరిజన నాయకుల ద్వారా మాత్రమే చేయగలం.

మహదీ కుటుంబంతో శామ్యూల్ జెరోమ్ చర్చలు జరపడానికి సహాయం చేసే కీలక వ్యక్తులలో ఒకరు షేక్ అబ్దుల్‌ మాలిక్ అల్-నెహ్యా. ఆయన అల్-ఒసాబ్ గ్రూపుకు షేక్. యెమెన్‌లో, 'షేక్'ను ఒక జాతి సమూహానికి నాయకుడిగా పరిగణిస్తారు.

‘‘మహదీ హత్యకు ముందే నాకు నిమిష, మహదీ తెలుసు. వారు కలిసి 'క్లినిక్' నిర్వహించారు, అది ప్రారంభించడానికి నేను సహాయం చేశాను. నాకు వారిద్దరి కుటుంబాల గురించి కూడా తెలుసు'' అని షేక్ అబ్దుల్‌ మాలిక్ అల్ నెహ్యా బీబీసీతో చెప్పారు.

''నిమిష ఈ హత్యను ఎందుకు, ఎలా చేశారో నేను మాట్లాడదలచుకోలేదు. ఆమెకు కోర్టు శిక్ష విధించింది. ఇప్పుడు శామ్యూల్ జెరోమ్ షరియా చట్టం ప్రకారం క్షమాపణ లభించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను చేయగలిగినదంతా చేస్తున్నాను'' అని ఆయన అన్నారు.

"2023లో ఒకసారి, నేను నిమిషను జైలులో కలిసి మాట్లాడాను. మహదీ కుటుంబం నన్ను క్షమించగలదా? అని ఆమె అడిగారు 'నేను నా వంతు కృషి చేస్తున్నాను' అని చెప్పాను" అని అబ్దుల్ మాలిక్ అన్నారు.

మహదీ కుటుంబంతో చర్చల పరిస్థితిపై తానిప్పుడే ఏమీ మాట్లాడలేనని అబ్దుల్ మాలిక్ అన్నారు. వారు క్షమాభిక్ష అందిస్తే.. ఆ విషయాన్ని మాత్రం తాము తెలియజేస్తామని చెప్పారు.

అదేవిధంగా, నిమిష తరపున వాదించడానికి భారత ప్రభుత్వం 2020 లో నియమించిన యెమన్ లాయర్ పేరు అబ్దుల్లా అమీర్. ఆయన యెమెనీ తెగకు చెందినవారు.

మహదీ హత్య కేసులో, యెమెన్ రాజధాని సనాలోని స్థానిక కోర్టు 2020లో నిమిషకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాతే అబ్దుల్లా అమీర్‌ను ఈ కేసులో నియమించారు.

సనా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఆమె యెమెన్ సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 2023 నవంబర్‌లో అప్పీల్ కొట్టేసి, మరణశిక్షను సమర్థించినప్పటికీ, నిమిషకు బ్లడ్ మనీ' అవకాశం ఉండేలా అబ్దుల్లా అమీర్ చర్యలు చేపట్టారు.

మహదీ కుటుంబంతో చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు.

లాయర్ కె.ఎల్. బాలచంద్రన్

2018లో శామ్యూల్ ద్వారా నిమిష కేసు మీడియాలోకి వచ్చిన తర్వాత, న్యాయవాది కె.ఎల్. బాలచంద్రన్ కేరళ ఎన్నారై కమిషన్ ముందు నిమిష తరఫున హాజరై ఆమె పరిస్థితిని వివరించారు.

''ఈ కేసు ప్రారంభంలో నిమిషకు యెమెన్‌లో సరైన న్యాయ సహాయం అందలేదు. ఫలితంగా, ఆమె తన కేసు గురించి సరిగ్గా చెప్పలేకపోయారు. ఆమెకు భాష రాకపోయినా, వారు చూపించిన అన్ని పత్రాలపై ఆమె సంతకం చేశారు'' అని బాలచంద్రన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)