You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోప్ అంటే ఎవరు? ఏం చేస్తారు? ఆయన అంత్యక్రియలు ఎలా జరుగుతాయి? పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్‌లో ఎందుకు ఖననం చేయడం లేదు?
- రచయిత, రాబర్ట్ ప్లమర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పన్నెండేళ్ల పాటు రోమన్ కాథలిక్ చర్చ్ మతాధిపతిగా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో చనిపోయారు.
వాటికన్‌లోని కాసా శాంటా మార్టాలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈస్టర్ మండే రోజు పోప్ ఫ్రాన్సిస్ మరణించినట్లు వాటికన్ న్యూస్ వెల్లడించింది.
ఆయన మరణంతో శతాబ్దాల నుంచి అనుసరిస్తున్న పద్ధతిలో కొత్త పోప్‌ను ఎన్నుకోవాల్సిఉంటుంది.
పోప్ ఏం చేస్తారు?
పోప్ కాథలిక్ చర్చ్‌కు అధినేత. ఏసుక్రీస్తుకు నేరుగా ఆయన ప్రతినిధి అని రోమన్ కాథలిక్‌లు నమ్ముతారు.
క్రీస్తు తొలినాటి శిష్యుల్లో ముఖ్యులైన సెయింట్ పీటర్‌కు సజీవ వారసుడిగా పోప్‌ను భావిస్తారు.
దీని వల్ల కాథలిక్ చర్చిపై ఆయనకు పూర్తి అధికారాలు లభిస్తాయి.
ప్రపంచంలోని సుమారు140 కోట్ల కాథలిక్‌లకు ఆయన్ను అధిపతిగా పేర్కొంటారు.
బైబిల్‌ను మార్గదర్శకంగా భావించే చాలా మంది కాథలిక్‌లు, చర్చికి సంబంధించిన నమ్మకాలు, పద్ధతులు గురించి చెప్పే పోప్ బోధనలను అనుసరిస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో సగం మంది రోమన్ కాథలిక్‌లు.
పోప్ అధికారాన్ని గుర్తించని క్రైస్తవులు ఉంటారా?
ప్రొటెస్టంటులు, ఆర్థోడాక్స్ చర్చ్ సహా ఇతర కొన్ని వర్గాలకు చెందిన వారు పోప్ అధికారాన్ని గుర్తించరు.
ప్రపంచంలోనే అత్యంత చిన్నదేశమయిన వాటికన్ సిటీలో పోప్ నివసిస్తారు.
ఆ నగరం చుట్టూ ఇటలీ రాజధాని రోమ్ ఉంటుంది.
పోప్‌కు ఎలాంటి జీతం ఉండదు. కానీ ఆయన రోజువారీ వ్యవహారాలు, ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులన్నీ వాటికన్ భరిస్తుంది.
పోప్ అంత్యక్రియల్లో అనుసరించే పద్ధతేంటి?
పోప్ అంత్యక్రియల వ్యవహారం సంప్రదాయంగా చాలా సుదీర్ఘమైనది.
ఇందులోని సంక్లిష్టతను తగ్గించే ప్రణాళికలను ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు.
గత పోప్‌లను సైప్రస్ చెక్క, సీసం, ఓక్ చెక్కతో తయారు చేసిన మూడు వరుసల శవపేటికలలో ఖననం చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ మాత్రం జింక్‌తో కప్పిన సాధారణ చెక్క శవపేటికను ఎంచుకున్నారు.
సెయింట్ పీటర్స్ బసిలికాలో పోప్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఎత్తైన వేదికపై ఉంచే సంప్రదాయాన్ని కూడా ఆయన రద్దు చేశారు.
ఈ ప్రక్రియను కెటాఫాల్క్ అని పిలుస్తారు.
బదులుగా పోప్ భౌతిక కాయానికి శవపేటిక దగ్గర నివాళులు అర్పించడానికి అనుమతిస్తారు.
ఆ సమయంలో శవపేటికను తెరిచి ఉంచుతారు.
వాటికన్ వెలుపల ఖననం
గత శతాబ్ద కాలంలో వాటికన్ వెలుపల పోప్‌కు అంత్యక్రియలు జరగడం కూడా ఇదే తొలిసారి.
రోమ్‌లోని నాలుగు ప్రధాన పాపల్ బసిలికాల్లో ఒకటైన సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో పోప్ అంతిమ మజిలీ ఉంటుంది.
బసిలికా అనేది వాటికన్ ద్వారా ప్రత్యేక ప్రాముఖ్యత, అధికారాలను పొందిన చర్చి. ప్రధాన బసిలికాలకు పోప్‌తో ప్రత్యేక సంబంధం ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)