You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మైనర్ బాలికను లైంగికంగా వేధించారంటూ యడ్యూరప్పపై పోక్సో కేసు, ఆయన ఏమన్నారంటే..
మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారనే అభియోగాలతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై కేసు నమోదైనట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఆయనపై బెంగళూరు పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 354 (ఏ) కింద కేసు నమోదు చేశారని ఏఎన్ఐ తెలిపింది.
17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.
2024 ఫిబ్రవరి 2న తాను ఓ చీటింగ్ కేసులో న్యాయం కోసం తల్లీకూతుళ్లు యడ్యూరప్ప నివాసానికి వెళ్ళగా ఈ ఘటన జరిగినట్టు ఆమె గురువారం సాయంత్రం ఫిర్యాదు చేయగా, రాత్రి పొద్దుపోయాక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఆరోపణలపై యడ్యూరప్ప స్పందించారు. తాను ఏమీ అనకముందే ఆమె తనపై నిందలు చేశారని ఆయన అన్నారు.
‘‘ఆమె ఇక్కడ నిలబడి, ఏడుస్తున్నారు. ఆమెను గతంలో కూడా చూశాను కానీ కలవలేదు. పిలిచి మాట్లాడాను. ఆ వెంటనే ఆమె నాపై నిందలు వేయడం ప్రారంభించారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌ను పిలిచాను. ఆ తర్వాత ఆమె నాపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనట్టు అనిపించింది’’ అని యడ్యూరప్ప మీడియాతో చెప్పారు.
ఆయన కార్యాలయంలోని ఓ అధికారి మాట్లాడుతూ ‘‘రెండు నెలల కిందట మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్పను కలవడానికి ఆమె వచ్చారు. మా దగ్గర అప్పటి సీసీటీవీ ఫుటేజీ కూడా ఉంది. అందులో ఆమె యడ్యూరప్ప నివాసం బయటే కూర్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. యడ్యూరప్ప అసలు ఆమెను కలవనేలేదు’’ అని చెప్పారు.
పలుకుబడి కలిగిన వ్యక్తులపై ఈ మహిళ కేసులు పెట్టారంటూ.. ఒక జాబితాను యడ్యూరప్ప కార్యాలయం విడుదల చేసింది.
కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది. ఇది చాలా సున్నితమైన విషయం. నిజం బయటపడేవరకూ ఏం చెప్పలేం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, నమస్తే తెలంగాణ విలేకరులు 25 లక్షలు డిమాండ్ చేయడంతో.. ముగ్గురు కుమారులకు ఉరేసి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి
- గీతాంజలి ఆత్మహత్య: 'ఆ రోజున ఇంటర్వ్యూ ఇవ్వకపోయి ఉంటే బతికి ఉండేది..' ట్రోలింగ్ బాధితురాలి మృతిపై ఎస్పీ తుషార్ ఇంకా ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- సుద్ద పొడికి కవర్ చుట్టి, బ్రాండ్ వేసి, ట్యాబ్లెట్లుగా అమ్మేస్తున్నారు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)