You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రూ.1,242 కోట్ల లాటరీని గ్రూప్‌గా కొట్టేశారు, ఒక్కొక్కరికి ఎంత దక్కిందంటే....
బెల్జియం దేశంలో ఓ గ్రామానికి చెందిన 165 మందికి 143 మిలియన్ యూరో( సుమారు రూ.1,242 కోట్ల)ల విలువైన లాటరీ తగిలింది. ఆంట్వెర్ప్ ప్రావిన్స్‌లోని ఓల్మెన్ గ్రామస్తులు తమ స్థానిక న్యూస్ ఏజెంట్ దగ్గర టిక్కెట్‌లు కొనుగోలు చేయడానికి టీమ్‌గా ఏర్పడ్డారు.
ఈ టికెట్ కోసం అందరూ సమానంగా డబ్బులు చెల్లించారు. బెల్జియన్ నేషనల్ లాటరీ అందించిన సమాచారం ప్రకారం, ఇందులో విజేతలుగా నిలవడం ద్వారా ఈ గ్రూప్ సభ్యులు ఒక్కొక్కరు దాదాపు 868,000 యూరో(సుమారు రూ.7 కోట్లు)లకు పైగా గెలుచుకున్నారు. మంగళవారం జరిగిన డ్రా కోసం 2.7 కోట్లకు పైగా ఎంట్రీలు వచ్చాయని, చివరి జాక్‌పాట్ 142,897,164 యూరో( సుమారు రూ. 1,241,90,57,791) లని యూరో మిలియన్స్ లాటరీ సంస్థ తెలిపింది. లాటరీ సంస్థ ప్రతినిధి జోక్ వెర్మోరే మాట్లాడుతూ ‘’బెల్జియంలో గ్రూప్‌గా లాటరీ గెలవడం కొత్త కాదు. అయితే ఇదే ఇప్పటి వరకు అతిపెద్ద గ్రూప్ విజయం’’ అన్నారు. చాలా ఏళ్లుగా ఇలాంటి గ్రూపులను నడుపుతున్న న్యూస్ ఏజెంట్ ఒకరు బెల్జియన్ రేడియోతో మాట్లాడుతూ.. లాటరీ తగిలిన విషయం చెప్పినప్పుడు తన కస్టమర్లు నమ్మలేదని, ఒకటికి రెండుసార్లు నిజమా కాదా అని అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
అయితే, ఆయన విజేతల వివరాలు మాత్రం చెప్పలేదు.
గతంలో రూ.1,694 కోట్ల జాక్ పాట్..
యూరో మిలియన్స్ లాటరీలో ఇదే అతిపెద్ద జాక్ పాట్ అయితే కాదు. యూకేకి చెందిన ఓ వ్యక్తికి జూలైలో 195 మిలియన్ల యూరో( సుమారు రూ. 1,694)ల కోట్ల జాక్‌పాట్ తగిలింది.
కొన్ని నెలల కిందట గ్లౌసెస్టర్‌కు చెందిన ఒక బ్రిటిష్ జంట 184 మిలియన్ల యూరో(సుమారు రూ. 1,599 కోట్లు)ల లాటరీని గెలుచుకుంది.
మిలియన్స్ లాటరీని తొమ్మిది యూరోపియన్ దేశాలైన బెల్జియన్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్, పోర్చుగల్, ఐర్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్‌లలో నిర్వహించారు.