లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ ఎందుకు పట్టుబడుతోంది?

నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌‌సభ అసమ్మతి, విభేదాలతో ప్రారంభమైంది.

లోక్‌‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకునేందుకు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మద్దతు ఇవ్వాలని ఎన్డీయే ప్రభుత్వం కోరింది. కానీ, ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

అయితే, బుధవారం మూజువాణి ఓటుతో ఓం బిర్లా స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఎన్డీయేకు మెజార్టీ సంఖ్యాబలం ఉండడంతో ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవుతారన్న విషయం తెలిసిందే.

అదే సమయంలో, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అత్యంత అనుభవజ్ఞుడైన ఎంపీ కొడికున్నిల్ సురేష్‌ను స్పీకర్ పదవి రేసులో ‘ఇండియా’ కూటమి నిలిపింది.

స్పీకర్ ఎంపికకు సంబంధించి రెండు శిబిరాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం ప్రతిపక్ష నేతలు కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత టీఆర్ బాలు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. కానీ, ఏకాభిప్రాయం కుదరలేదు.

ఆ తర్వాత, కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇస్తారనేది అందరికీ తెలిసిందే. కానీ, పార్లమెంటరీ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ఈ ప్రభుత్వం నిరాకరిస్తోంది’’ అని ఆరోపించారు.

స్పీకర్ పదవికి ‘ఇండియా’ కూటమి బరిలో నిలిపిన కొడికున్నిల్ సురేష్ కేరళ నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. దళిత వర్గానికి చెందినవారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.

గణాంకాలు..

లోక్‌సభ లెక్కల ప్రకారం, మొత్తం 543 ఓట్లకు గానూ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) వంటి మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకు 293 ఓట్లు వచ్చాయి.

ఇండియా కూటమిలో 236 మంది సభ్యులు ఉన్నారు. మరికొన్ని చిన్నపార్టీలు, స్వతంత్ర ఎంపీల మద్దతు ఉంది. ప్రస్తుత లోక్‌సభలో స్వతంత్రులు, చిన్న ప్రాంతీయ పార్టీలకు చెందిన సభ్యులు 16 మంది ఉన్నారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో స్పీకర్ పదవికి గతంలో మూడుసార్లు మాత్రమే ఓటింగ్ జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. గతంలో 1952, 1967, 1976లో స్పీకర్ పదవికి ఓటింగ్ జరిగింది.

పార్లమెంట్ బయట మంగళవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ''మనం కలిసి పనిచేయాలని మోదీ అన్నారు. కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ, ఆయన మాటలకు, చేతలకు పొంతనలేదు. అధికార పార్టీ ఎంపిక చేసిన స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు మేం సిద్ధం. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వాలని మల్లికార్జున్ ఖర్గే కోరితే, మనం మళ్లీ మాట్లాడుదామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. మళ్లీ, ఇంతవరకూ పిలుపురాలేదు'' అన్నారు.

దీనికి, ప్రతిపక్షమే షరతులు విధిస్తోందని ఆరోపిస్తూ ఎన్డీయే ఎదురుదాడికి దిగింది.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ''స్పీకర్ ఏ పార్టీకి చెందినవారు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, స్పీకర్ పదవికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రతిపాదించడం బాధాకరం'' అన్నారు.

డిప్యూటీ స్పీకర్ కోసం కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేస్తోంది?

మీరు లోక్‌సభ వెబ్‌సైట్‌లోకి వెళితే, '17వ లోక్‌‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి మే 2019 నుంచి ఖాళీగా ఉంది' అని రాసి ఉంటుంది.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో, డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నది 17వ లోక్‌‌సభలోనే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం, డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక తప్పనిసరి. రాజ్యాంగం ప్రకారం, సభలోని ఇద్దరు సభ్యులను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

1969 వరకు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు పదవులను కాంగ్రెస్ తన వద్దే ఉంచుకుంది. కానీ, ఆ తర్వాత ఈ ధోరణి మారింది. షిల్లాంగ్ ఎంపీగా ఉన్న ఆల్ పార్టీ హిల్ లీడర్స్ నాయకుడు గిల్బర్ట్ జీ స్వేల్‌కి కాంగ్రెస్ ఈ పదవి ఇచ్చింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం, స్పీకర్ గైర్హాజరీలో ఉంటే, స్పీకర్ విధులను డిప్యూటీ స్పీకర్ నిర్వర్తిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటే ఆ విధులు నిర్వర్తించేందుకు సభలోని ఒక సభ్యుడిని రాష్ట్రపతి ఎంపిక చేస్తారు.

ఆర్టికల్ 94 ప్రకారం, స్పీకర్ తన పదవికి రాజీనామా చేస్తే, ఆయన డిప్యూటీ స్పీకర్‌ను అడ్రస్ చేస్తూ తన రాజీనామా పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

1949లో రాజ్యాంగ పరిషత్‌లో దీనిపై చర్చ జరిగింది. డిప్యూటీ స్పీకర్ పదవి కంటే స్పీకర్ పదవి పెద్దదని, అందువల్ల డిప్యూటీ స్పీకర్‌ను అడ్రస్ చేయడానికి బదులు, రాష్ట్రపతిని అడ్రస్ చేయాలని డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ అన్నారు.

అయితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎంపిక చేసేది సభలోని సభ్యులే కాబట్టి, వారికే జవాబుదారీ అవుతారన్న వాదనలు కూడా ఉన్నాయి.

రాజీనామాను సభలోని సభ్యులందరినీ అడ్రస్ చేస్తూ తెలియజేయలేం కాబట్టి, సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున స్పీకర్, లేదా డిప్యూటీ స్పీకర్‌లకు మాత్రమే తెలియజేయాలి. దీంతో, స్పీకర్‌ రాజీనామా చేస్తే డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ రాజీనామా చేస్తే స్పీకర్‌కు తెలియజేయాలని నిర్ణయించారు.

నిందారోపణలతో ప్రారంభమైన 18వ లోక్ సభ

ఇండియా కూటమి అభ్యర్థి కొడికున్నిల్ సురేష్ ఆంగ్ల దినపత్రిక ది హిందూతో మాట్లాడుతూ, ''ఇది గెలుపోటములకు సంబంధించిన విషయం కాదు. స్పీకర్‌ను అధికార పార్టీ నుంచి, డిప్యూటీ స్పీకర్‌ను ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోంది'' అన్నారు.

''మాకు ప్రతిపక్ష హోదా ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి మా హక్కు'' అన్నారాయన.

అధికార, విపక్షాల మధ్య జరిగిన ఈ వివాదంపై ఆ పత్రిక సంపాదకీయం కూడా రాసింది.

ఏకాభిప్రాయం కావాలని, రాజ్యాంగానికి విధేయులమని అధికార, ప్రతిపక్షాలు రెండూ చెబుతున్నాయని, కానీ పాలనాపరమైన లేదా రాజకీయపరమైన నిర్ణయాలకు సంబంధించి ఇప్పటివరకూ రెండుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అందులో పేర్కొంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీయే, ఇండియా కూటమి తలపడుతున్నాయని రాసింది.

డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే, స్పీకర్ ఎంపికలో ఎన్డీయేకు మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు తమ ప్రతిపాదనను ముందుపెట్టాయి. గతంలోనూ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎక్కువ శాతం ప్రతిపక్ష సభ్యుడికే కేటాయించేవారు.

16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ ‌సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.

ఈసారి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పట్టుదలగా ఉంది.

18వ లోక్ సభ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఏకాభిప్రాయం, పార్లమెంట్‌లో చర్చల గురించి చేసిన విజ్ఞప్తి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తోంది. అయితే, ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది.

మోదీ 3.0 ప్రభుత్వం తరఫున చర్చల్లో కీలకంగా పాల్గొంటున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా స్పీకర్ ఎంపిక కోసం ప్రతిపక్ష నేతలను సంప్రదించారు. కీలక నిర్ణయాలపై ప్రభుత్వం విపక్షాలను సంప్రదిస్తోందని, ఇలాంటి సంప్రదింపులు అవసరమని ఆ చర్చలు సూచిస్తున్నాయి.

చాలా సందర్భాల్లో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం అసాధ్యం కావొచ్చు. కొన్ని సందర్భాల్లో అది అవసరం కూడా కావొచ్చు. కానీ, ప్రతిపక్షంతో అధికార పక్షం నిరంతరం సంప్రదింపులు జరపడం, నరేంద్ర మోదీ రాజకీయ విశ్వసనీయతను కూడా పెంచుతుంది.

స్పీకర్ పదవి ఎందుకంత ముఖ్యం?

సభలో మెజారిటీ నిరూపించుకోవడంలో లేదా ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లో స్పీకర్ పాత్ర అత్యంత కీలకం. సభలో వివాదం తలెత్తితే స్పీకర్ నిర్ణయమే అంతిమం.

లోక్‌ సభకు అధ్యక్షుడిగా, సభకు స్పీకర్ అధిపతి, ప్రధాన ప్రతినిధి కూడా. స్పీకర్ సభలో ఆర్డర్, డెకోరమ్ నిర్వహించాలి. సభా కార్యకలాపాలను వాయిదా వేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు.

భారత రాజ్యాంగంలో పార్లమెంటుకు సంబంధించిన నిబంధనలు, లోక్‌ సభ కార్యకలాపాలు, నిబంధనల అమలుకు స్పీకర్‌దే తుది బాధ్యత. అంటే, సభలో ఆయనదే తుది నిర్ణయం.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం, ఫిరాయింపులకు పాల్పడితే ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంది. అయితే, స్పీకర్ నిర్ణయంపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని 1992లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

18వ లోక్‌ సభ ప్రారంభాన్ని పరిశీలిస్తే, ఏకాభిప్రాయం కోసం సంప్రదింపులు, భిన్నాభిప్రాయాలు, ఇరుపక్షాల మధ్య చర్చలు కనిపించాయి. గత రెండు లోక్ సభల్లో ఇలాంటి పరిస్థితి పెద్దగా కనిపించలేదు. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడమే ఇందుకు కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)