ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణించారు.

సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రామ్మూర్తి నాయుడు కొన్నేళ్ళుగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు.

రామ్మూర్తి నాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ ఇవాళ (నవంబర్ 16) మధ్యాహ్నం మరణించారు.

దిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, తన సోదరుని మరణవార్త తెలియగానే దిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు.

‘‘నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికీ తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అంటూ చంద్రబాబు నాయుడు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

రామ్మూర్తి నాయుడి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

నారావారిపల్లెలో ఆదివారం అంత్యక్రియలు

1952లో పుట్టిన రామ్మూర్తి నాయుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నటుడు నారా రోహిత్ రామ్మూర్తి నాయుడు కుమారుడే.

రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు రేపు అంటే ఆదివారం (నవంబర్ 17న) ఆయన సొంతూరు నారావారిపల్లెలో జరుగుతాయి.

రాజకీయ ప్రస్థానం - చంద్రబాబుతో వివాదం

1994లో రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి (కాంగ్రెస్)పై గెలిచారు. 1999లో అదే చంద్రగిరి నుంచి గల్లా అరుణ కుమారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

ఆయన 2002-2003 ప్రాంతంలో సోదరుడు చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనపై పోటీ చేయాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆ సమయంలో బాబుపై విమర్శలు చేశారు.

2004 ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి 31 వేల ఓట్లు అంటే ఆ ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం అభ్యర్థితో సమానంగా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లి అదే నియోజకవర్గంలో ఉంది. తరువాత మళ్లీ సోదరుడు చంద్రబాబుకు దగ్గరయ్యారు. తరువాత వివిధ ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

2023 ఫిబ్రవరిలో నారా రామ్మూర్తి నాయుడి గురించి అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్ బాబాయి కాదు, మీ బాబాయి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి’’ అంటూ నారా లోకేశ్‌ను ప్రశ్నించారు కొడాలి నాని. మీ బాబాయి నారా రామ్మూర్తి నాయుడును మీడియా ముందుకు తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. రామ్మూర్తిని కనపడకుండా దాచారు అంటూ ఆరోపణలు చేశారు. అది జరిగిన నెల తరువాత 2023 మార్చిలో చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌ (ప్రస్తుతం ఎక్స్)లో తాను తన తమ్ముడితో ఉన్న ఫోటో పెట్టి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)