టీజీఎస్ఆర్టీసీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. చర్చలపై ప్రతిష్ఠంభన ఎందుకు ఏర్పడింది?

ఫొటో సోర్స్, Praveen Shubham
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. సమ్మె ప్రభావంతో వేలాది బస్సులు ఆగిపోయి లక్షలాది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
అద్దె బస్సులు, ప్రైవేటు వాహనాలు నడపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అవసరాలు తీర్చలేకపోతున్నాయి.
డిమాండ్ల పరిష్కారానికి సమయం కావాలని, ప్రస్తుతానికి సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతుండగా.. డిమాండ్లు నెరవేర్చే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె చేస్తామంటూ కార్మిక సంఘాల ఉమ్మడి కమిటీ మార్చి 13న యాజమాన్యానికి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 21 రాత్రి వరకూ ఈ నోటీసులపై చర్చలు జరిగాయి.
చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్థరాత్రి, బుధవారం మొదటి షిఫ్టు నుంచి సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.


ఫొటో సోర్స్, Praveen Shubham
కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే...
ఆర్టీసీ యాజమాన్యం ముందు కార్మిక సంఘాలు మొత్తం 32 డిమాండ్లు పెట్టాయి. వాటిలో ముఖ్యమైనవి...
సాధారణంగా తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9 వేలకు పైగా సర్వీసులు నడుస్తుంటాయి. వీటిలో ఆరున్నర వేల వరకూ సొంత బస్సులు ఉండగా, మిగతావి అద్దెవి.
అయితే, బుధవారం మధ్యాహ్నం వరకూ సుమారు వెయ్యి సర్వీసులు నడిపినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ఇవన్నీ చాలా వరకు ప్రైవేటు బస్సులు లేదా ఎలక్ట్రిక్ బస్సులే.
ప్రైవేటు బస్సులకు సొంత డ్రైవర్లు ఉండడం, ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లు కూడా ఆర్టీసీ ప్రధాన సిబ్బంది కాకపోవడంతో వారు సమ్మెలో భాగం కాలేదు.

ఫొటో సోర్స్, Praveen Shubham
తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల డిపోల్లోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆన్‌లైన్ సమావేశం ఏర్పాటు చేశారు.
వీలైనన్ని ప్రైవేటు వాహనాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు తాత్కాలిక సిబ్బందితో బస్సులు తిప్పేలా చూడాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో పలు డిపోల ఎదుట కార్మిక సంఘాల వారు బైఠాయించడంతో పోలీసులు వారిని పక్కకు తొలగించడం, అదుపులోకి తీసుకోవడం వంటివి జరిగాయి.
అద్దె, ఎలక్ట్రిక్ బస్సులు కూడా తిరగకుండా పలుచోట్ల కార్మికులు ప్రయత్నాలు చేయడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. దాదాపు అన్ని డిపోల ముందు ధర్నాలు జరుగుతుండడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
'ప్రభుత్వం సానుకూలంగానే ఉంది'
చర్చలు విఫలమైన తరువాత ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
''ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, కార్మికులు కోరుతున్న డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైన, సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి. వాటిని లోతుగా పరిశీలించి పరిష్కరించడానికి కనీసం 4 వారాల సమయం పడుతుంది కాబట్టి ఆ మేరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మికులకు తెలియజేశాం'' అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పినట్లు ఆర్టీసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
''కొన్ని సంఘాలు వాస్తవాలను విస్మరించి సమ్మెకు పిలుపునిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రలోభాలకు లోనుకాకుండా, సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మికులందరూ విధులకు హాజరై ప్రభుత్వానికి సహకరించాలి"
"ముఖ్యంగా, ఆర్టీసీపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, చిరు ఉద్యోగులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉంది. అందరూ బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలి'' అని ఎండీ నాగిరెడ్డి కోరారని అందులో పేర్కొంది.

ఫొటో సోర్స్, Ponnam Prabhakar/FB
మరోవైపు కార్మికులు సమ్మె విరమించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కోరారు.
''మేం సానుకూలంగా ఉన్నాం. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే, అధికారుల నివేదిక ఆధారంగా ఉప ముఖ్యమంత్రి, నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని సమస్యలు పరిష్కారిస్తాం. 65 లక్షల మంది ప్రయాణికులకు, పేదలకు ఆర్టీసీ జీవనాధారం'' అని మంత్రి పొన్నం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
"32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ఎటువంటి ఇబ్బందీ లేదు. ప్రభుత్వం ఏర్పడగానే 2017 పీఆర్సీ క్లియర్ చేశాం. పెండింగ్ డీఏలు ఇచ్చాం. 2013 పెండింగ్ బాండ్లు ఇస్తున్నాం. పీఎఫ్, సీసీఎస్ బకాయిలు సగానికి తగ్గించాం. త్వరలో కొత్త నియామకాలు చేపడుతున్నాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీని దెబ్బతీయవద్దు'' అని పొన్నం ప్రభాకర్ ఆ ప్రకటనలో కోరారు.

ఫొటో సోర్స్, Praveen Shubham
'సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే'
కార్మికులు మాత్రం తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకూ సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెబుతున్నారు. ముఖ్యంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన విషయంలో వారు చాలా గట్టిగా ఉన్నారు.
''తమను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. అధికారంలోకి రాగానే బకాయిలన్నీ ఇస్తామన్నారు. రిటైరైన వారికి బెనిఫిట్లు ఇవ్వడం లేదు. లీవ్ అమౌంట్, గ్రాట్యుటీ రావడం లేదు. పీఎఫ్ బకాయిలున్నాయి. చాలామంది సిబ్బందికి రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకూ బకాయిలు ఉన్నాయి. ఇక మా జీతం నుంచి పొదుపు చేసి కో-ఆపరేటివ్ సొసైటీలో దాచుకున్న డబ్బు కూడా యాజమాన్యం వాడుకుని, అది కూడా ఇవ్వడం లేదు'' అని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రచార కార్యదర్శి వీసీఎస్ రెడ్డి బీబీసీతో అన్నారు.
''ప్రభుత్వం ఇప్పుడు సమయం ఇవ్వమని అడుగుతోంది. సమ్మె మొదలయ్యాక సమయం ఎవరూ ఇవ్వరు. డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మె ఉంటుంది. సంస్థ విలీనంపై కేసీఆర్ హయాంలోనే బిల్లు పాసైంది. అది ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పలేదు. ఇప్పటికైనా స్పష్టమైన తేదీ కావాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































