'ఈ వృక్షాల కింద శవాలున్నాయి, అవి మనుషుల్లా నడిచి రావచ్చు’

బ్రిటన్, యేవ్ చెట్లు, అడవి, రాక్షసులు, దయ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాత్రివేళ ఈ చెట్లు ప్రాణం పోసుకుంటాయని కొందరు చెప్పారని చరిత్రకారిణి తెలిపారు.
    • రచయిత, జోషువా అస్కే, సైమన్ ఫర్‌బెర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 3 నిమిషాలు

"ఇది చాలా అందమైన, ప్రశాంతమైన ప్రదేశం" అని చరిత్రకారిణి ఎమిలీ జెస్సికా టర్నర్ చెప్పారు.

"ఇక్కడ ప్రాచీనతకు సంబంధించిన నిజమైన అనుభూతి ఉంది" అని ఆమె అన్నారు.

బ్రిటన్‌లోని చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాల్లో ఒకటైన కింగ్లీ వేల్‌లో ఆమె బీబీసీ సీక్రెట్ సస్సెక్స్‌తో మాట్లాడారు.

చిచెస్టర్‌కు వాయువ్యంగా సౌత్ డౌన్స్‌లో ఉన్న ఈ ప్రకృతి సంరక్షణ కేంద్రం నిరంతరం పచ్చని ఆకులతో ఉండే యేవ్ వృక్షాలున్న అడవిగా గుర్తింపు పొందింది. ఇది యూరప్‌లోనే అత్యంత పురాతన యేవ్ అడవిగా ప్రాచుర్యం పొందింది.

"ఇక్కడి చెట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. అవి చాలా అద్భుతమైనవి" అని టర్నర్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యేవ్ చెట్లలో కొన్నింటి వయసు 2వేల ఏళ్లకు పైబడి ఉంటుందని, ఇవి ‘‘చాలాప్రత్యేకమని’’ జాన పద కథల్లో వీటి గురించి చెప్పుకునేవారని టర్నర్ తెలిపారు.

"మనం ఒకరితో ఒకరు చెప్పుకునే కథల్లోనూ చెట్లు ప్రస్తావన తరచుగా వస్తుంది. వీటికి పరలోకంతో సంబంధం ఉందని భావిస్తారు" అని టర్నర్ చెప్పారు.

ప్రత్యేకంగా ఈ వృక్షాల వేర్లు పాతాళలోకంతో ముడిపడి ఉంటాయని చెబుతుంటారు.

కింగ్లీ వేల్‌లోని యేవ్ వృక్షాలు వైకింగ్ సమాధులకు గుర్తులని ఆమె అన్నారు.

"యుద్ధంలో చనిపోయిన స్కాండినేవియన్ రాజుల దేహాలు నా పాదాల కింద, ఈ చల్లని నేలలో శాశ్వతంగా భూమిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి" అని ఆమె బీబీసీ సీక్రెట్ ససెక్స్‌తో చెప్పారు.

బ్రిటన్, యేవ్ చెట్లు, అడవి, రాక్షసులు, దయ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్లే వ్యాలీలోని ఈ చెట్లు యుద్ధంలో చనిపోయినవారి గుర్తులని తెలిపారు.

వెయ్యేళ్ల క్రితం దోపిడీలకు పాల్పడే డానిష్ దురాక్రమణదారులు ఈ ప్రాంతాన్ని జయించేందుకు సస్సెక్స్‌కు వచ్చారని టర్నర్ వివరించారు.

స్థానికులు చాలా బలంగా భయంకరంగా పోరాడటంతో వందల మంది వైకింగులు చనిపోయారని ఆమె చెప్పారు.

వారి మృతదేహాలను బో హిల్ సమీపంలోని యేవ్ చెట్ల మధ్య వదిలి అక్కడే పూడ్చి పెట్టారు.

కొండపై ఉన్న నాలుగు పెద్ద సమాధులను స్థానికులు "దెయ్యపు దిబ్బలు" అని పిలిచేవారు. అవి యుద్ధంలో చనిపోయిన వైకింగ్ రాజుల సమాధులని టర్నర్ చెప్పారు.

"యుద్ధాల కారణంగా ఇది రక్తంతో తడిచిన నేల కాబట్టి, మీరు ఊహించినట్లే యుద్ధంలో చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి" అని ఆమె వివరించారు.

"ఇక్కడ ప్రకృతితో పాటు ప్రకృతిని దైవంగా భావించినవారి ఆత్మలు కూడా ఉన్నాయని కొందరు అంటుంటారు" అని టర్నర్ చెప్పారు.

కింగ్లీ వేల్ గురించి స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలలో అక్కడి చెట్లు ప్రాణం పోసుకుని మనుషుల్లాగా నడుస్తాయనేది తనకు బాగా ఇష్టమైన కథ అని టర్నర్ అన్నారు.

"ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన, భయపెట్టే ఆలోచన" అని టర్నర్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)