You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వరదల నుంచి కార్చిచ్చుల దాకా, ప్రపంచం నలుమూలలా సంభవించిన ప్రకృతి వైపరీత్యాల దృశ్యాలు...
నేపాల్-చైనా సరిహద్దులో ఉన్న రసువా జిల్లాలోని లెండెఖోలాలో ఆకస్మిక వరదలు సంభవించడంతో తొమ్మిది మంది మరణించగా, కొంతమంది చైనా జాతీయులు సహా 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
వరదలకు రెండు దేశాలను కలిపే మిటేరి వంతెన కొట్టుకుపోయింది. రసువాలోని సయాఫ్రుబేసి నుంచి రసువాగధి చెక్‌పాయింట్ వరకు ఉన్న రహదారిని మూసివేశారు.
ఈ వరదలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించినవి కాకపోవచ్చని
సరస్సులు పొంగిపొర్లడం వల్ల సంభవించి ఉండవచ్చని నేపాల్ హైడ్రాలజీ, వాతావరణ విభాగం అంచనా వేసింది.
నువాకోట్‌లోని త్రిశూలి నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ ఆర్మీ హెలీకాప్టర్ ద్వారా రక్షించారు.
వరదల కారణంగా రసువాగధి కస్టమ్స్ కార్యాలయం సమీపంలో ఉన్న కార్గో కంటైనర్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
కొన్ని నెలల వ్యవధిలో కురవాల్సిన వర్షపాతం కేవలం కొన్ని గంటల్లోనే నమోదైంది. జూలై 4న సంభవించిన తుపానులతో టెక్సాస్‌లోని హిల్ కంట్రీని వరదలు ముంచెత్తాయి.
సుమారు వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు.
టెక్సస్‌లో వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తుల అవశేషాలు లేదా ప్రాణాలతో బయటపడిన వారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ వర్కర్ శిథిలాల వెతుకుతుండగా ఇలా వరదలో నీటమునిగిన వాహనాలు కనిపించాయి.
న్యూ మెక్సికోలోని రుయిడోసో గ్రామంలో వరదల వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
8.8 సెం.మీ (3.5 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. దీని వలన రుయిడోసో నది నీటిమట్టం మునుపెన్నడూలేని స్థాయికి చేరుకుంది.
చాలా ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోతున్న ఒక ఇంటి దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
జూలై 9, 2025న చైనాలోని చాంగ్‌కింగ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీధుల్లో వరదనీరు ముంచెత్తింది.
చాంగ్‌కింగ్ మునిసిపాలిటీ మంగళవారం నుంచి తీవ్రమైన వర్షాలతో అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తిన ప్రాంతం ఏరియల్ వ్యూ నుంచి ఇలా కనిపించింది.
మంగళవారం చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని హాంగ్‌జౌలో టైఫూన్ డానాస్ ప్రభావం వల్ల అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో చాలామంది పర్యటకులు షెల్టర్‌లలో తలదాచుకున్నారు.
బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం నుంచి 441 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.
ఢాకాలో రిక్షా లాగేవారు ప్రయాణికులతో ఇలా కనిపించారు.
వరదల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షంలో గొడుగుతోనే ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించారు.
ఫ్రాన్స్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మార్సెయిల్‌లో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మధ్యధరా ఓడరేవు నగరం దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కార్చిచ్చు చెలరేగింది.
దక్షిణ ప్రాంతంలో గత కొన్నిరోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. గాలులకు మంటలు ఎగసిపడడంతో ఎండిన వృక్షాలన్నీ కాలిబూడిదయ్యాయి.
బుధవారంనాడు దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లోని ఎల్'ఎస్టాక్ జిల్లాలోని కాంపాగ్నే బ్లూ వద్ద కారు ఇలా కాలిపోయి కనిపించింది.
మార్సెయిల్‌లోని లెస్ పెన్నెస్-మిరాబ్యూ ప్రాంతంలోని మార్సెయిల్‌కు ఉత్తరాన ఉన్న కొండలలో మంటల చెలరేగుతున్న సమయంలో జాతీయ పౌర భద్రతా దళానికి చెందిన కెనడైర్-రకం వాటర్ బాంబర్ విమానం మంటలను ఆర్పుతున్న దృశ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)