You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆరావళి: ఈ కొండల పరిరక్షణ కోరుతూ ఉత్తర భారతదేశంలో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇవి లేకపోతే దిల్లీ ఎడారిగా మారుతుందా?
- రచయిత, అభిషేక్ డే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుప్రీంకోర్టు ఆరావళి కొండల నిర్వచనాన్ని మార్చిన తర్వాత దాదాపు ఉత్తర భారతదేశం అంతటా నిరసనలు మొదలయ్యాయి.
ఆరావళి శ్రేణి ప్రపంచంలోని పురాతన భౌగోళిక నిర్మాణాలలో ఒకటి. ఇవి రాజస్థాన్, హరియాణా, గుజరాత్, దేశ రాజధాని దిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ సిఫారసుల తర్వాత సుప్రీంకోర్టు ఆమోదించిన ఆరావళి నిర్వచనం ప్రకారం చుట్టుపక్కల భూమి కంటే కనీసం 100 మీటర్లు (328 అడుగులు) ఎత్తులో ఉన్న భూభాగాన్ని మాత్రమే ఆరావళి కొండలుగా పరిగణిస్తారు.
500 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ కొండలు వాటి మధ్య భూమిని కలిగి ఉంటే వాటిని ఆరావళీ శ్రేణిలో భాగంగా పరిగణిస్తారు.
ఆరావళిని కేవలం ఎత్తు ఆధారంగా నిర్వచించడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో, పొదలతో నిండి పర్యావరణానికి ఎంతో మేలు చేసే అనేక కొండలపై మైనింగ్‌కు తలుపులు తెరిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే కొత్త నిర్వచనం ఉద్దేశం నియమాలను కఠినతరం చేయడం, ఏకరూపతను తీసుకురావడం తప్ప ఈ కొండలకు రక్షణ తగ్గించడం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఆరావళితో ప్రయోజనాలేంటి?
ఈ వారం గురుగ్రామ్, ఉదయ్‌పుర్ సహా అనేక నగరాల్లో శాంతియుత నిరసనలు జరిగాయి. స్థానికులు, రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల న్యాయవాదులు, రాజకీయ నాయకులు కూడా వీటిలో భాగమయ్యారు.
కొత్త నిర్వచనం ఆరావళి ప్రాంత ప్రజల పాత్రను దెబ్బతీస్తుందని పీపుల్ ఫర్ ఆరావళి గ్రూప్ వ్యవస్థాపక సభ్యురాలు నీలం అహ్లువాలియా బీబీసీతో అన్నారు.
వాయువ్య భారతదేశంలో "ఎడారీకరణను నిరోధించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి, ప్రజల జీవనోపాధిని కాపాడటానికి" ఆరావళి ముఖ్యమైనదని ఆమె చెప్పారు.
చిన్న పొదలతో నిండిఉండే కొండలు ఎడారీకరణను నివారించడంలో, భూగర్భ జలాలను పెంచడంలో, స్థానిక ప్రజలకు ఉపాధిని అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
"ఆరావళిని వాటి ఎత్తు ఆధారంగా కాకుండా వాటి పర్యావరణ, భౌగోళిక, వాతావరణ ప్రాముఖ్యం ద్వారా నిర్వచించాలి" అని సేవ్ ద ఆరావళీస్ ఉద్యమంలో పాల్గొన్న పర్యావరణ కార్యకర్త విక్రాంత్ టోంగడ్ అన్నారు.
అంతర్జాతీయంగా పర్వతాలను పర్యావరణంలో అవి పోషించే పాత్ర ఆధారంగా గుర్తిస్తారని, ఏకపక్షంగా ఎత్తును ప్రామాణికం చేసుకోరని విక్రాంత్ అన్నారు.
‘దిల్లీ వరకు ఎడారిగా మారేది’
"భౌగోళికంగా ఆరావళి శ్రేణిలో భాగమైన, పర్యావరణ పరిరక్షణలో లేదా ఎడారీకరణను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఏదైనా భూమిని, దాని ఎత్తుతో సంబంధం లేకుండా, ఆరావళి శ్రేణిగా పరిగణించాలి" అని ఆయన అంటున్నారు.
ఆరావళి ప్రాంతాన్ని దాని భౌగోళిక, పర్యావరణ, వన్యప్రాణుల స్థావరాలు, వాతావరణ స్థితిస్థాపకత వంటి శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా ప్రభుత్వం నిర్వచించాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కోర్టు కొత్త నిర్వచనం మైనింగ్, నిర్మాణం, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చని, పర్యావరణ వ్యవస్థకు నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుందని టోంగడ్ హెచ్చరిస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీలూ దీనిపై ఆందోళన వ్యక్తంచేశాయి. కొత్త నిర్వచనం పర్యావరణం, జీవావరణానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆరోపించాయి.
ఆరావళిని రక్షించడాన్ని, దిల్లీ ఉనికిని కాపాడడాన్ని వేరుగా చూడలేమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు టీకా రామ్ జుల్లీ ఆరావళిని ఆ రాష్ట్రానికి 'జీవనాడి'గా అభివర్ణించారు. ఆరావళి అక్కడ లేకుంటే 'దిల్లీ వరకు ఉన్న మొత్తం ప్రాంతం ఎడారిగా మారేది' అని అన్నారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
కేంద్ర ప్రభుత్వం ఈ ఆందోళనలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
నియమాలను కఠినతరం చేయడం, ఏకరూపతను తీసుకురావడం కొత్త నిర్వచనం లక్ష్యమని ప్రభుత్వం ఆదివారం(డిసెంబరు 21) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అన్ని రాష్ట్రాల్లో మైనింగ్‌ను ఒకేలా నియంత్రించడానికి స్పష్టమైన, నిష్పాక్షికమైన నిర్వచనం అవసరమని కూడా ఆ ప్రకటన పేర్కొంది.
పర్వతాల వాలు, చుట్టుపక్కల భూములు, చొచ్చుకుపోయే ప్రాంతాలు సహా పర్వత సమూహాలను కొత్త నిర్వచనం మొత్తంగా వివరిస్తుందని తెలిపింది.
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రతి భూమిలో మైనింగ్‌కు అనుమతి ఉంటుందని భావించడం తప్పు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఆరావళి కొండలు లేదా శ్రేణుల పరిధిలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు కాబోవని, అలాగే మైనింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే పాత లీజులు కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పింది.
రక్షిత అడవులు, పర్యావరణ సున్నితమైన జోన్‌లు, చిత్తడి నేలలు వంటి ప్రాంతాలలో మైనింగ్‌పై పూర్తి నిషేధం ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
1,47,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఆరావళి శ్రేణిలో సుమారు 2 శాతం మాత్రమే మైనింగ్‌కు ఉపయోగపడుతుందని, అది కూడా అధ్యయనాలు, అధికారిక ఆమోదం పొందిన తర్వాతేనని పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు.
కాగా, నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని, కోర్టు కొత్త నిర్వచనాన్ని సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాలు వెతుకుతున్నామని అనేక సంస్థలు తెలిపాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)