You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘దిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసన’పై ఆ దేశ మీడియా ఏం రాసింది?
నిరుడు ఆగస్టు 5 తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు ఉస్మాన్ హాదితోపాటు, ఒక హిందూ యువకుడి హత్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయని అనేక బంగ్లాదేశ్ వార్తాపత్రికలు పేర్కొన్నాయి.
దిల్లీలోని తమ హైకమిషన్ బయట జరిగిన ప్రదర్శనకు వ్యతిరేకంగా శనివారం బంగ్లాదేశ్ నిరసన తెలిపింది.
ఆ తర్వాత, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఈ సంఘటనకు సంబంధించి బంగ్లాదేశ్‌లో కొన్ని మీడియా సంస్థలు 'తప్పుదోవ పట్టించే ప్రచారం' వ్యాప్తి చేయడాన్ని భారతదేశం గమనించిందని చెప్పారు.
దీనిని కేవలం 'తప్పుదోవ పట్టించే ప్రచారం'గా తోసిపుచ్చలేమని బంగ్లాదేశ్ తెలిపింది.
"ఆగస్ట్ 5న జరిగిన రాజకీయ మార్పుల తరువాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇప్పుడు ఇవి మరింత క్షీణించాయి, రెండు దేశాలు తమ దౌత్య కార్యకలాపాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి" అని బాంగ్లాదేశ్ పత్రిక ‘ది డైలీ స్టార్’ పేర్కొంది.
బంగ్లాదేశ్‌లోని భారత వీసా దరఖాస్తు కేంద్రం (ఐవీఏసీ) చిట్టగాంగ్‌లో ఉన్న వీసా కేంద్రాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది.
గత వారం మొదట్లో, భద్రత సమస్యల కారణంగా ఢాకా, ఖుల్నా, రాజ్‌షాహిలోని ఐవీఏసీలు ఒక్కొక్కటిగా పాక్షికంగా మూతపడ్డాయి.
ఈ నగరాల్లో కొనసాగుతున్న నిరసనల కారణంగా ఈ చర్య తీసుకున్నారు.
"నిన్న న్యూదిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దగ్గర జరిగిన నిరసనకు సంబంధించి ఢాకా, న్యూదిల్లీ పరస్పర విరుద్ధ ప్రకటనలు జారీ చేశాయి" అని డైలీ స్టార్ రిపోర్ట్ చేసింది.
'ఇటీవలి సంఘటనలు పరిస్థితిని మరింత దిగజార్చాయి'
"బంగ్లాదేశ్ హైకమిషన్‌కు వస్తున్న బెదిరింపులను దిల్లీ ఖండించింది. అయినప్పటికీ, రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి" అని 'మానవ జమీన్' పత్రిక ప్రధాన వార్తగా రాసింది.
"బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రెండు వైపులా ఇటీవలి సంఘటనలు పరిస్థితిని మరింత దిగజార్చాయి" అని ఆ పత్రిక రాసింది.
"ఒక సమూహం న్యూదిల్లీలోని భద్రతా దౌత్య ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ హౌస్ గేట్ల వద్ద నిరసన ప్రదర్శన చేసింది. ఆ బృందం చాణక్యపురిలో భద్రతా వలయాలను ఒకదాని తర్వాత ఒకటి ఛేదించుకుని బంగ్లాదేశ్ హైకమిషన్ గేటు ముందుకు వెళ్లింది. అక్కడ కూడా బంగ్లాదేశ్ వ్యతిరేక నినాదాలు చేశారు" అని రాసింది.
బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు జరిగిన నిరసనకు సంబంధించి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది, దీనిని "అనుచిత సంఘటన" అని పేర్కొంది.
"నిజమేంటంటే డిసెంబర్ 20న, న్యూదిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు దాదాపు 20-25 మంది యువకులు గుమిగూడారు. మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతను డిమాండ్ చేశారు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
ఏ సమయంలోనూ కంచెను దాటడానికి లేదా భద్రత ముప్పును సృష్టించడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదని రణధీర్ జైస్వాల్ అన్నారు. సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసులు నిమిషాల్లోనే ఆ గుంపును చెదరగొట్టారని తెలిపారు.
భారత్ ఏమని చెప్పింది?
"న్యూదిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ బయట జరిగిన నిరసనలకు సంబంధించి భారత్ ఇచ్చిన వివరణను శనివారం ఢాకా తిరస్కరించింది" అని బంగ్లాదేశ్ ఆంగ్ల వార్తాపత్రిక 'ఢాకా ట్రిబ్యూన్' రాసింది,
ఢాకా ఈ సంఘటనను 'చాలా దురదృష్టకరం' అని అభివర్ణించింది.
"దీనిని 'తప్పుదోవ పట్టించే ప్రచారం' అని కొట్టిపారేయలేమని రాసింది. నిరసనలు, బెదిరింపులు, విరుద్ధమైన ప్రకటనలు, మైనారిటీ వర్గాల భద్రత, దౌత్య భద్రతపై సవాళ్ల కారణంగా ఉద్రిక్తతలు పెరిగాయి" అని పేర్కొంది.
"నిరసనల గురించి హైకమిషన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితి హైకమిషన్‌లో ఉన్న సిబ్బందిని ఆందోళనకు గురిచేసింది" అని ఢాకా ట్రిబ్యూన్ రాసింది.
"వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారత్‌లో బంగ్లాదేశ్ దౌత్య కార్యకలాపాల భద్రతకు సంబంధించిన ఇండియా ఇచ్చిన హామీలను ఢాకా అంగీకరించింది. అయితే, హిందూ సమాజానికి చెందిన బంగ్లాదేశ్ పౌరుడిపై జరిగిన దాడిని మైనారిటీలపై దాడిగా చిత్రీకరించడానికి భారత అధికారులు చేసిన ప్రయత్నాలను ఢాకా తిరస్కరించింది" అని ఢాకా ట్రిబ్యూన్ రాసింది.
"ఒక యువకుడి హత్యకు సంబంధించి బంగ్లాదేశ్ అనుమానితులను అరెస్టు చేసిందని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దేశంలోని ఇంటర్ కమ్యూనిటీ పరిస్థితులు దక్షిణాసియా దేశాల కంటే మెరుగ్గా ఉందని, మైనారిటీల రక్షణ ఉమ్మడి ప్రాంతీయ బాధ్యత అని కూడా చెప్పింది" అని ఢాకా ట్రిబ్యూన్ రాసింది.
"న్యూదిల్లీలోని తమ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనపై భారత్ విడుదల చేసిన ప్రెస్ నోట్‌ను బంగ్లాదేశ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నిరసనకారులు సురక్షితమైన దౌత్య ప్రాంతంలోకి ఎలా ప్రవేశించగలిగారని బంగ్లాదేశ్ ప్రశ్నించింది. ఇది తీవ్రమైన భద్రతా లోపంగా బంగ్లాదేశ్ అభివర్ణించింది" అని 'ది బంగ్లాదేశ్ టుడే' రాసింది.
"బంగ్లాదేశ్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో అంతర్గతంగా, భారతదేశంతో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని రష్యా విజ్ఞప్తి చేసింది" అని 'ది డైలీ అబ్జర్వర్' రాసింది .
"బంగ్లాదేశ్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ గ్రిగోరివిచ్ ఖోజిన్ బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతను తగ్గించాలని సోమవారం విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు" అని ఆ పత్రిక రాసింది.
"బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని రాయబారి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా చేయడం మంచిదని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో తాను జోక్యం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. కానీ ఉద్రిక్తతలు ప్రస్తుత స్థాయికి మించి పెరగకుండా నిరోధించడానికి ఒక మార్గం వెతకడం సరైన పనని ఆయన అన్నారు" అని ఆ పత్రిక పేర్కొంది.
బంగ్లాదేశ్ హైకమిషన్ బయట జరిగిన నిరసనలపై బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలకు 'బాంగ్లాదేశర్ ఖబర్' పత్రిక ప్రధాన స్థానం ఇచ్చింది.
"దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ దౌత్య ప్రాంతంలో ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది అత్యంత సురక్షితమైన ప్రదేశం, కాబట్టి హిందూ ‘తీవ్రవాదులను’ ఈ ప్రాంతంలోకి ఎందుకు అనుమతించాలి? వారిని రానివ్వకపోతే, ఇలాంటి సంఘటన జరిగేది కాదు" అని ఆ వార్తాపత్రిక రాసింది .
"మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది, కానీ భారతదేశంలోని మా హైకమిషనర్‌ను బెదిరించారని మేం విన్నాం. ఎవరైనా ఆయనను బెదిరించడానికి ఎందుకు అక్కడికి వస్తారు? ఈ సంఘటన తర్వాత, దిల్లీలోని హైకమిషనర్ కుటుంబం సురక్షితంగా లేదని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది" అని ప్రథమ్ అలో తన వెబ్‌సైట్‌లో రాసింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)