You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్లౌడ్ బరస్ట్: కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారీ వరద, 45 మంది మృతి, ఇప్పటి వరకు ఏం జరిగింది?
జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని చషోటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ ప్రాణనష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో 45మంది మరణించారని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారని బీబీసీ కరస్పాండెంట్ మాజిద్ జహంగీర్ ధృవీకరించారు.
ఇప్పటివరకు లభించిన 35 మృతదేహాలలో 11 మృతదేహాలను గుర్తించామని కిష్త్వార్ జిల్లా ఆసుపత్రి సీఎంవో రాజేంద్ర కుమార్ తెలిపారు.
ఈ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రదేశమని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
సహాయ పునరావాస చర్యల కోసం వివిధ బృందాలను సంఘటనా స్థలానికి పంపినట్లు కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ వెల్లడించారు.
బ్లాక్, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులలో కనీసం 70 మంది చేరారని కిష్త్వార్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం బీబీసీకి తెలిపింది.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి కార్యాలయం హెల్ప్ డెస్క్, కంట్రోల్ రూమ్ నంబర్లను జారీ చేసింది.
ఇప్పటి వరకు ఏం జరిగింది?
ఆగస్టు 15 సాయంత్రం జరగాల్సిన 'ఎట్ హోమ్' టీ పార్టీని కూడా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రద్దు చేశారు. దీనితో పాటు, స్వాతంత్ర్య దినోత్సవం ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించకూడదని కూడా నిర్ణయించారు.
స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ మాట్లాడుతూ, "భారీ నష్టం సంభవించే అవకాశం ఉంది. భక్తుల యాత్ర ఇంకా కొనసాగుతోంది. కాబట్టి అక్కడ చాలామంది జనం ఉన్నారు" అని అన్నారు.
మరోవైపు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కార్యాలయాల నుంచి ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి.
ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్పారు?
ఈ దుర్ఘటనకు సంబంధించి పీటీఐ వార్తా సంస్థ కొన్ని వీడియోలను విడుదల చేసింది.
జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘ఈ రోజు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కిష్త్వార్‌లోని చషోటి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించినట్లు మాకు సమాచారం అందింది. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అధికార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి'' అని అన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకోవడంలో అదనపు రెస్క్యూ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
''రోడ్లు కొట్టుకుపోయాయి. వాతావరణం చాలా దారుణంగా ఉంది. హెలికాప్టర్లను ఉపయోగించలేము. నేను కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ఆయన తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, స్థానిక యంత్రాంగంతో సహాయ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటున్నామని అన్నారు.
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో ఇలా రాశారు : "నేను ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి జమ్మూలోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ తర్వాత పరిస్థితి గురించి వివరించాను" అని రాశారు.
"కిష్త్వార్‌లోని చషోటిలో జరిగిన క్లౌడ్ బరస్ట్ సంఘటన నన్ను బాధపెట్టింది. మృతుల కుటుంబాలకు నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్విట్టర్‌లో తెలిపింది.
"జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన క్లౌడ్ బరస్ట్ ఘటనలో చాలామంది మరణించారనే వార్త చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను సహాయ, రక్షణ కార్యకలాపాలు విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు .
"కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ప్రభావితమైన ప్రజలకు,వారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. సహాయ, రక్షణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అవసరమైన వారికి సాధ్యమైనంత సహాయం అందిస్తాం" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పోస్ట్ చేశారు .
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)