ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విధివిధానాలు ఏమిటంటే?

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం పేరును 'స్త్రీ శక్తి'గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈనెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది.

అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమలు చేయనున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆగస్టు 4వ తేదీన ప్రకటించారు.

సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా ఈ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఆ మేరకు పథకం విధివిధానాలను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బీబీసీకి వివరించారు.

ఎప్పటి నుంచి అమలు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15న లాంఛనంగా ఈ పథకం ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ తెలిపారు.

ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండొచ్చని, ఆ తర్వాత పథకం అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు.

మహిళలకు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలో ఉచితం

పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌‌ప్రెస్‌...ఈ ఐదు బస్సుల్లో ప్రయాణం ఉచితం.

బస్సు ఎక్కిన ప్రతి మహిళకూ జీరో టికెట్‌ ఇస్తారు.

ఆ టికెట్‌పై ప్రయాణికురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ టికెట్‌ ధర ఎంత అనే వివరాలుంటాయి. ఈ టికెట్ ధరను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్టీసీకి ఇస్తుంది.

మహిళా ప్రయాణికులకు ఇచ్చే ఆ టికెట్ మీద ధర జీరో అని ఉంటుంది.

ఆధార్, రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీల్లో ఏదో ఒక కార్డు చూపించి ప్రయాణించొచ్చు.

అలాగే కేంద్రప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులైన్ పాన్‌ కార్డ్‌ వంటివి కూడా అనుమతిస్తారు.

భవిష్యత్‌లో ఆధార్‌తో అనుసంధానమయ్యే స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నామని ఆర్డీసీ ఎండీ తెలిపారు.

ఏయే బస్సుల్లో ఉచితం ఉండదు?

నాన్‌ స్టాప్‌ బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్‌ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఏసీ బస్సులతో పాటు తిరుమల ఘాట్‌ రోడ్డులో వెళ్లే బస్సులకు ఈ ఉచిత ప్రయాణ పథకం వర్తించదు.

మొత్తంగా 8,514 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు, ఇందుకోసం ఏడాదికి ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.1,942 కోట్లు ఖర్చు కానున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.

మొత్తంగా ఏపీఎస్‌ఆర్టీసీలోని 74 శాతం బస్సుల్లో ఈ స్త్రీ శక్తి పథకం అమలు కానుందని ఆయన చెప్పారు.

'ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించాలి'

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దాని ప్రభావం ముందుగా పడేది ఆటో వాళ్లపైనేనని, ప్రధానంగా సర్వీస్‌ ఆటోలపై చాలా ఎఫెక్ట్‌ ఉంటుందని విజయవాడ సిటీ ఆటోడ్రైవర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కరోతి దుర్గారావు బీబీసీతో అన్నారు.

ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లకు ఏమైనా ప్రయోజనం చేకూర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

''గత ప్రభుత్వ హయాంలో వాహనమిత్ర పథకం కేవలం ఆటో ఓనర్లకు మాత్రమే అమలైంది. ఆ పథకాన్ని ఇప్పుడు ఆటో డ్రైవర్లందరికీ వర్తింపజేస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. కేరళలో ఉన్న సంక్షేమ బోర్డు వల్ల ఆటో డ్రైవర్లకి ఫించన్లు కూడా అందుతున్నాయి. అలాంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి'' అని దుర్గారావు అన్నారు.

ఇప్పటికైతే ఆలోచన లేదు: ఆర్టీసీ చైర్మన్‌

ఆటో డ్రైవర్ల డిమాండ్లపై ఇప్పటికిప్పుడు ఏమీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చనీ, ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని తిరిగి ఎలా సమీకరించుకోవాలనే లక్ష్యంతోనే ప్రస్తుతం ఉన్నామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు బీబీసీతో చెప్పారు.

తిరుమల మార్గంలో స్త్రీ శక్తి పథకం అమలు చేయకపోవడమనేది వాస్తవానికి టీటీడీ నిర్ణయమని ఆయన అన్నారు.

సహజంగా ఎక్కువమంది ప్రయాణికులు ఉండే ఉచిత బస్సులు తిరుమల ఘాట్‌రోడ్లలోని మలుపుల్లో తిరగడం సురక్షితంగా కాదనే అభిప్రాయంతోనే కేవలం ఆ ఒక్క రూట్‌లోనే అమలు చేయడం లేదని ఆర్టీసీ చైర్మన్‌ స్పష్టంచేశారు.

వ్యతిరేకించవద్దు : సీనియర్ జర్నలిస్ట్ డానీ

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం మంచిదేనని సీనియర్‌ జర్నలిస్ట్ ఉషా ఎజ్‌ డానీ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఉచితాలను వ్యతిరేకించకూడదని సూచించారు.

కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు తక్కువ రేట్లకు వందలకోట్ల స్థలాలు, వేల కోట్ల రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు, మహిళల మొబిలిటీని పెంచే ఈ పథకంపై ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడం తప్పేమీ కాదని డానీ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం దీన్ని భారంలా భావించకుండా మొబిలిటీ పెరగడం ద్వారా ఆదాయం పెరుగుతుందనే సూత్రాన్ని నమ్మి పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

అమలులో చిత్తశుద్ధి చూపించాలి: మహిళా సమాఖ్య

కాస్త ఆలస్యంగానైనా ఈ పథకం అమలు చేయడం మంచిదేనని అయితే, అమలులో చిత్తశుద్ధి చూపించాలని మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి బీబీసీతో అన్నారు.

బస్సులు వెళ్లగలిగే అన్ని రూట్లలో ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లోనూ తిప్పాలని, అప్పుడే ఈ స్త్రీ శక్తి పథకం ప్రయోజనం నెరవేరుతుందని ఆమె సూచించారు.

నిరుపేద మహిళలకే కాదు, దిగువ, మధ్యతరగతి మహిళలకు కూడా ఈ పథకం ద్వారా స్వావలంబన శక్తి పెరుగుతుందని, రవాణా కోసం అయ్యే నెల వారీ ఖర్చు తగ్గుతుందని రమాదేవి అభిప్రాయపడ్డారు.

''హైదరాబాద్‌లో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై విన్నాం. టీవీల్లో చూస్తుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని అంటున్నారు. నిజంగా చాలా మంచిదే. నేను రోజూ అడవినెక్కలం నుంచి విజయవాడకు వచ్చి ముంజలు, తాటికాయలు, ఇతర కూరగాయలు అమ్ముతాను. రోజుకి చార్జీల కింద వంద రూపాయలు బస్సులు, ఆటోలకే ఖర్చవుతుంది. ఇక నుంచి రోజుకి వంద అంటే నెలకు మూడు వేలు మిగిలినట్టే కదా'' అని జయలక్ష్మి అనే మహిళ బీబీసీతో అన్నారు.

'బస్సులు, ఉద్యోగుల సంఖ్య పెంచాలి'

స్త్రీ శక్తి పథకం విజయవంతం కావాలంటే ప్రభుత్వం ముందుగా ఆర్టీసీ బస్సులతో పాటు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌ సూచించారు.

ఇకపై ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, ఫుట్‌బోర్డు ప్రయాణాలను కండక్టర్లు నిలువరించలేని పరిస్థితులు ఏర్పడుతాయని, ప్రయాణికుల రక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

జీరో టికెట్‌ జారీ చేసే విధానంపై కండక్టర్లకు సరైన అవగాహన కల్పించాలని దామోదర్ కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)