You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉదయ్‌పుర్: కత్తిపోట్లకు గురైన విద్యార్థి మృతి, నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి
- రచయిత, మొహర్ సింగ్ మీణా
- హోదా, జయ్‌పుర్ నుంచి బీబీసీ హిందీ కోసం
రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఆగస్ట్ 16న కత్తి పోట్లకు గురయిన విద్యార్థి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు.
ఈ మేరకు ఉదయ్‌పుర్ డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్, కలెక్టర్ అరవింద్ కుమార్ పోసవాల్ ధ్రువీకరించారు.
కత్తిపోట్లకు గురైన తరువాత ఆ విద్యార్థి ఉదయ్‌పుర్‌లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
మెరుగైన చికిత్స అందించడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం జయపుర్ నుంచి ముగ్గురు వైద్యుల బృందాన్ని ఉదయ్‌పుర్ పంపింది.
కాగా విద్యార్థి మృతిపై ఉదయ్‌పుర్ డివిజనల్ కమిషనర్ రాజేంద్ర భట్ ‘బీబీసీ’తో మాట్లాడారు.
‘కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారని, చికిత్స పొందుతూ విద్యార్థి మరణించారు’ అని రాజేంద్ర భట్ చెప్పారు.
విద్యార్థి మృతితో ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు.
ఉదయ్‌పుర్ ఐజీ అజయ్ పాల్ లాంబా మీడియాతో మాట్లాడుతూ ‘నగరంలో పోలీస్ బలగాలను మోహరించాం. ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాం. ఎవరైనా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు’ అన్నారు.
నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని.. అయితే, విద్యార్థి అంతిమయాత్రకు హాజరయ్యేవారిపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని లాంబా చెప్పారు.
నిందితులకు శిక్ష పడే వరకు మృతదేహాన్ని తీసుకోవడానికి విద్యార్థి తల్లి నిరాకరించారా అన్న ప్రశ్నకు లాంబా స్పందిస్తూ ‘చనిపోయిన విద్యార్థి ఒక్కరే వారికి సంతానం. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ మరణానికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని తల్లి కోరుకోవడం సహజం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అన్నారు.
విద్యార్థి మృతిపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందిస్తూ.. విద్యార్థి కుటుంబానికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరిన ఆయన ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.
అసలు ఏమైంది?
ఉదయ్‌పుర్‌లోని సోరాజ్‌పోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది.
ఆ క్రమంలో ఒక విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. దాంతో గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
విషయం తెలిసిన వెంటనే ఉదయ్‌పుర్‌లోని హిందూ సంఘాలు రోడ్లపై నిరసనలు తెలిపాాయి.
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి రాళ్లు రువ్వారు, వాహనాలకు నిప్పు పెట్టారు.
గాయపడిన విద్యార్థి ఉన్న ఆసుపత్రి బటయ జనం చేరి నినాదాలు చేశారు. శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగింది.
పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు, అధికారులు శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
కాగా వివాదం ఎక్కడ మొదలైందనేది సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘బీబీసీ’తో చెప్పారు.
విద్యార్థులిద్దరూ నోట్ బుక్ విషయంలో గొడవపడ్డారని.. గొడవ పెరిగి కుటుంబ నేపథ్యాల వరకు వెళ్లగా ఒక విద్యార్థి మరోొ విద్యార్థిని కత్తితో పొడిచాడని చెప్పారు.
విద్యార్థి కత్తిపోట్లకు గురయ్యాడనే వార్త నగరంలో వ్యాపించడంతో హిందూ సంస్థలు ధర్నా చేశాయి. హాథిపోల్, దిల్లీ గేట్, చేతక్ సర్కిల్ సహా పలు మార్కెట్‌లను మూసివేశారు.
ఆ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌పై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు.
కాగా కత్తిపోటు ఘటన అనంతరం రాజస్థాన్‌లోని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆశిష్ మోదీ పాఠశాలల్లోకి పదునైన ఆయుధాలు తీసుకురావడాన్ని నిషేధిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)