You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పైప్‌బోట్స్: ఈ రోబోలు వాటర్ పైప్స్‌లో లీకేజి లేకుండా చేస్తాయా, లక్షల లీటర్ల నీరు వృథా కాకుండా చూసుకుంటాయా?
- రచయిత, విక్టోరియా గిల్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలోని 18 శాతం జనాభా భారత్‌లోనే నివసిస్తోంది. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరులు 4శాతం మాత్రమే.
భారత్‌లో నీటి వనరులు తక్కువగా ఉన్నప్పటికీ వృథా కూడా బాగానే జరుగుతోంది. నీటిని సరఫరా చేసే పెద్దపెద్ద పైపు లైన్లు పగలడం, నీరు వృథాగా పోతూ ఉండటం వంటి దృశ్యాలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం.
పట్టణ ప్రాంతాల్లో పైపు లీకుల వల్ల సుమారు 40శాతం నీరు వృథాగా పోతోందని అంచనా.
బ్రిటన్‌లోనూ ఇలాంటి సమస్యే ఉంది. ఇంగ్లండ్, వేల్స్‌లలో పైపు లైన్ లీకుల వల్ల ప్రతి ఏడాది కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా చిన్నచిన్న ‘మినియేచర్’ రోబోలను ఇంజినీర్లు తయారు చేశారు.
పెద్దపెద్ద పైపుల్లో ఈ చిన్న రోబోలు తిరుగుతూ లీకులను పసిగడతాయి. వాటిని బాగు చేస్తాయి. రోబోల సాయంతో పైపు లైన్ల నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా నిర్వహించొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు.
ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు నీటి వృథాను అరికట్టే రోబోలను డెవలప్ చేయడం మీద వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయని నీళ్ల వ్యాపార రంగానికి సంబంధించిన ‘వాటర్ యూకే’ అనే సంస్థ అంటోంది. నీటి సరఫరా వ్యవస్థను ప్రైవేటు రంగానికి అప్పగించిన తరువాత ప్రస్తుతం నీటి వృథా అత్యంత తక్కువగా ఉన్నట్లు అది చెబుతోంది.
బ్రిటన్‌లో లక్షల కిలోమీటర్ల నీటి పైప్ లైన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని పాతవి, శిథిలమవుతున్న పైపు లైన్లు కూడా ఉన్నాయి.
‘మా ప్రాంతంలో 8,500 కిలోమీటర్లకు పైగా పైపు లైన్లను మేం మానిటర్ చేస్తూ ఉంటాం. ఈ పైపుల్లో తలెత్తే లీకుల్లో సగం మాత్రమే మా దృష్టికి వస్తాయి. మిగతా 50శాతం లీకులను గుర్తించడం చాలా కష్టమైన విషయం’ అని ఎస్సెక్స్‌కు చెందిన కాలిన్ డే చెబుతున్నారు.
2050 నాటికి నీటి వృథాను సగానికి తగ్గిస్తామని ప్రభుత్వానికి నీటి సరఫరా కంపెనీలు హామీ ఇచ్చాయి.
‘మేం మరింత వేగంగా పని చేయాలి. శాటిలైట్ ఇమేజింగ్, థర్మల్ డ్రోన్ టెక్నాలజీ, హై టెక్ ప్రోబ్స్, పైపుల లోపల కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాం’ అని వాటర్ యూకే తెలిపింది.
పెద్దపెద్ద రంధ్రాలు పడినప్పుడు సులభంగా పైపుల్లోని లీకులను గుర్తించగలరు. పైపులు బరస్ట్ అయినప్పుడు నీరు ఒక్కసారిగా పైకి ఎగజిమ్ముతుంది. ఇలాంటివి కంటికి కనిపిస్తాయి. కానీ కొన్ని కంటికి కనిపించని చిన్నచిన్న లీకులు ఉంటాయి. వాటిని మాములుగా గుర్తించలేం.
ఇలాంటి చిన్నచిన్న లీకులను గుర్తించేందుకు రోబోలు సాయపడతాయి. పైపుల్లోని రంధ్రాలు, నెర్రెలు, పగుళ్లు వంటి వాటిని ఇవి కనిపెడతాయి. తద్వారా సరైన సమయంలో మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టవచ్చు.
నీటి సరఫరా వ్యవస్థల్లో మినీ రోబోలు ఒక విప్లవాన్ని సృష్టిస్తాయని, నీటి వృథాను అరికడతాని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఎసెక్స్ అండ్ సఫోక్ వాటర్’ సంస్థ ఇప్పటికే రోబోలను పరీక్షిస్తోంది.
నీటి పైపులకు మరమ్మతులు చేయాలంటే చాలా వరకు నేలను తవ్వాల్సి ఉంటుంది. ఇలా తవ్వకుండా సమస్యను పరిష్కరించాలంటే మినీ రోబోల సాయం కావాల్సిందే. షెఫీల్డ్ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ సివిల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సెంటర్(ఐసీఏఐఆర్) కొత్తతరం రోబొటిక్ పైప్ పాట్రోలర్స్‌ను పరీక్షిస్తోంది.
‘పైప్‌బోట్స్’ అని పిలిచే ఈ చిన్న రోబోలు పైపుల్లో తిరుగుతాయి. వాటి కెమెరా కళ్లు పగుళ్లు, నెర్రెలు, రంధ్రాలు వంటి వాటిని గుర్తిస్తాయి.
‘ఈ చిన్న రోబోలు పైపులో తిరుగుతూ ఫొటోలు తీస్తాయి. పైపులోని శబ్దాలను వినేందుకు వాటిలో మైక్రోఫోన్లు కూడా ఉంటాయి. పైపులో పగుళ్లు వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ణయాలను అది తీసుకుంటుంది’ అని ప్రొ.హరొషెంకోవ్ వివరించారు.
‘పైప్‌బోట్స్‌కు ఎదురయ్యే అతి పెద్ద సవాలు కమ్యూనికేషన్. భూమి లోపల జీపీఎస్ ఉండదు. కాబట్టి షార్ట్ రేంజ్ టెక్నాలజీ ద్వారా ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అంటే శబ్దాలు లేదా వైఫైను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని లీడ్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొ.నెటా కొహెన్ అన్నారు.
చిన్నచిన్న మినీ రోబోలను మోసుకెళ్లగల పెద్ద రోబోలను కొహెన్ బృందం తయారు చేస్తోంది.
‘చిన్నచిన్న రోబోలను పైపుల్లోకి పంపిస్తాయి పెద్ద రోబోలు. పైపు లోపల చిన్న రోబోల పని అయిపోయిన తరువాత మళ్లీ అవి తిరిగి పెద్ద రోబోలోకి వెళ్లి పోతాయి. కిలోమీటర్ల పొడవున ఉండే పైపు లైన్లలో ఈ రోబోలు చక్కగా పని చేయాలని మేం కోరుకుంటున్నాం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే వీటిని వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నీటి వృథా వల్ల పర్యావరణం మీద కూడా ప్రభావం పడుతుంది’ అని కొహెన్ అన్నారు.
రోబోల సాయం లేకుండా భూగర్భంలోని నీటి పైపుల్లో ఎదురయ్యే సమస్యలను పూర్తిగా పరిష్కరించలేమని కొహెన్ వంటి పరిశోధకులు చెబుతున్నారు. రానున్న అయిదేళ్లలో తొలి తరం ‘పైప్‌బోట్స్’ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐసీఏఐఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఆశిస్తోంది.
అయిదేళ్ల తరువాత నీటి పైపుల్లో తొలి తరం ‘పైప్‌బోట్స్’ తిరగడాన్ని మనం చూడొచ్చని వారు అంటున్నారు. అప్పటి వరకు నీటి లీకులు ఏర్పడిన ప్రతిసారీ పైపుల వద్ద నేలను తవ్వక తప్పదు.
నీటి పైపులు, గ్యాస్ పైప్‌లైన్, కేబుల్స్... ఇలా ఏదైనా సరే వాటిలో తలత్తే సమస్యలకు పరిష్కారంగా రోబోలు నిలిచే రోజులు మరెంతో దూరంలో లేవు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- 2022లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారిణులు వీరే
- న్యూయార్క్ మహా నగరం ‘ఖాళీ’ అయిపోతోంది... ఎందుకు?
- రిషభ్ పంత్ యాక్సిడెంట్: నేషనల్ హైవేలపై డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు ఇవే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)