డైనోసార్లు మూగవా, అవి అరిస్తే భూమి దద్దరిల్లేలా ఉంటుందనే భావన తప్పా?

    • రచయిత, రిచర్డ్ గ్రే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డైనోసార్లు అరుపులు భూమి దద్దరిల్లేలా ఉంటాయని మనం అనుకుంటాం. ఈ భావన బహుశా తప్పని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

క్రెటేషియస్ కాలం నాటి దట్టమైన అడవుల్లో డైనోసార్ల అరుపులు భయంకరంగా ఉండేవి.

6.6 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతమయ్యాయి. బతికి ఉన్నప్పుడు అవి ఎలాంటి శబ్దాలు చేసేవో తెలుసుకునేందుకు చాలా తక్కువ ఆధారాలు అందుబాటులో ఉన్నాయి.

శిలాజ జంతువులపై అధ్యయనాలు చేసే పెలియాంటాలజిస్టులు వెలికి తీసిన రాతి అవశేషాలు, డైనోసార్ల శరీరాలకు సంబంధించిన రుజువులను అందిస్తున్నాయి. కానీ, అవి ఎలాంటి శబ్దాలు చేసేవి, ఎలా సంభాషణలు జరుపుకునేవి అనే రుజువులు దొరకలేదు. నిజానికి కళేబరం శిలాజంగా మారుతుంది. కానీ, శబ్దం శిలాజంగా మారదు కదా.

జంతువుల ప్రవర్తన గురించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే డైనోసార్లు కచ్చితంగా మౌనంగా అయితే లేవు.

శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా లభ్యమైన, అరుదైన శిలాజాల సహాయంతో, అధునాతన విశ్లేషణా పద్ధతులతో డైనోసార్లు అరుపులు ఎలా ఉండేవనే అంశంపై ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

అయితే ఈ పజిల్‌కు ఒకటే సమాధానం దొరకదు. డైనోసార్లు దాదాపు 17.9 కోట్ల ఏళ్ల పాటు భూమ్మీద ఆధిపత్యం చెలాయించాయి. ఆ సమయంలో వివిధ ఆకారాలు సైజులలో పరిణామం చెందాయి.

వీటిలో కిలో కంటే తక్కువ బరువు, 2 అడుగుల పొడవు ఉండే డైనోసార్లు కూడా ఉండేవి. అలాగే భూమ్మీద నివసించిన అతిపెద్ద జంతువుల్లో ఒకటిగా పిలిచే టైటానోసార్ పటాగోటియన్ మయోరం అనే పేరున్న డైనోసార్లు కూడా ఉండేవి. దీని బరువు 72 వేల కిలోలు ఉండొచ్చు. అవి రెండు కాళ్లపై పరిగెత్తేవి. కొన్ని నాలుగుకాళ్లపై మెల్లిగా నడిచేవి. ఇలా బరువులతో పాటు వాటి ఆకారాల్లోనూ వైవిధ్యాలు ఉండేవి. అలా ఆకృతిని బట్టి అవి రకరకాల శబ్దాలు చేసి ఉండొచ్చు.

కొన్ని డైనోసార్ల మెడ బాగా పొడవు ఉండేది. దీని వల్ల వాటి గొంతు నుంచి ఉత్పత్తి అయ్యే శబ్దాలు మారిపోయే అవకాశం ఉంది. కొన్ని రకాల డైనోసార్లకు పుర్రె నిర్మాణం వేరుగా ఉంటుంది. పారాసారోలోపస్ ట్యూబిసెన్ అనే డైనోసార్ పుర్రె నిర్మాణం చూద్దాం. దీనికి తల వెనుక నుంచి దాదాపు మీటర్ పొడవున పొడుచుకువచ్చిన కొమ్ము వంటి నిర్మాణం ఉంటుంది. ఈ కొమ్ము లోపల ఉండే మూడు జతల హాలో ట్యూబుల నిర్మాణాలు దాదాపు 2.9 మీ పొడవు ఉండే ప్రతిధ్వని గది (రెసొనేటింగ్ చాంబర్)ను ఏర్పరుస్తాయి.

ఈ డైనోసార్ పుర్రెను 1995లో న్యూ మెక్సికో మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ అండ్ సైన్స్‌కు చెందిన పెలియాంటాలజిస్టులు కనుగొన్నారు. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (సీటీ) స్కానర్‌ని ఉపయోగించి పుర్రెలోని కొమ్ముకు చెందిన 350 ఫోటోలను తీశారు. వాటిని పరిశీలించి చాలా అరుదైన వివరాలను తెలుసుకున్నారు. తర్వాత, కంప్యూటర్ శాస్త్రవేత్తలతో కలిసి డిజిటల్‌గా ఆ అవయవాన్ని పునర్నిర్మించారు. దాని గుండా గాలి పంపిస్తే అది ఎలాంటి శబ్దాలు చేస్తుందో తెలుసుకున్నారు.

''ఆ శబ్దం నా వెన్నులో వణుకు పుట్టించింది. అది మరో ప్రపంచపు శబ్దంగా నేను అభివర్ణిస్తా'' అని మ్యూజియం క్యురేటర్, అధ్యయనవేత్త టామ్ విలియమ్సన్ అన్నారు.

ఇప్పుడు భూమ్మీద జీవించి ఉన్న వాటిలో ఆస్ట్రేలియాలో నివసించే సదరన్ కాసోవరి పక్షి అరుపుకు దగ్గరగా ఆ శబ్దం ఉంటుందని ఆయన పోల్చి చెప్పారు.

అలాగే, అన్ని డైనోసార్లకు వాటి తలలపై ట్రంపెట్ లాంటి కొమ్ము వంటి నిర్మాణాలు లేవు. డైనోసార్ల కంఠానికి సంబంధించిన శిలాజ ఆధారాలు కూడా లేవు. కాబట్టి కొందరు ఈ జంతువులు మూగవి అయ్యే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌కు చెందిన పెలియాంటాలజిస్టు జులియా క్లార్క్ మరో షాకింగ్ ఆవిష్కరణ చేశారు. తను చేసిన అధ్యయనాలు, విశ్లేషణల ప్రకారం డైనోసార్లు కచ్చితంగా గర్జించలేదు, బహుశా అవి పక్షుల్లా కూత పెట్టి ఉంటాయని ఆమె నిర్థరణకు వచ్చారు.

అయితే, నాన్ ఏవియన్ డైనోసార్లు, గొంతులోని మృదు కణజాలాలను గాలితో నింపడం ద్వారా నోరు మూసుకొని శబ్దాలు చేసి ఉండొచ్చని క్లార్క్ భావిస్తున్నారు.

కానీ, అంత పెద్ద జంతువులు ఇలాంటి చాలా శబ్దాలను ఉత్పత్తి చేస్తుంటే, అవి మన చెవులకు ఎలా వినిపించి ఉండేవి? మొసళ్లు, కాసోవరీల అరుపులు చాలావరకు ఇన్‌ఫ్రాసౌండ్ అని పిలిచే తక్కువ పౌనఃపున్యాలతో మానవ వినికిడి పరిమితికి మించి ఉంటాయి. ఏనుగులు కూడా ఇన్‌ఫ్రా సౌండ్ ద్వారానే సంభాషించుకుంటాయి. సుమత్రన్ ఖడ్గమృగాలు కూడా ఇన్‌ఫ్రాసౌండ్ విజిల్స్ ద్వారానే దట్టమైన అటవీ ఆవాసాలలోకి సంకేతాలు పంపుతాయి.

తక్కువ-ఫ్రీక్వెన్సీ శబ్దాలు, ఇన్‌ఫ్రాసౌండ్ అనేవి ముఖ్యంగా బహిరంగ వాతావరణాల్లోనూ, దట్టమైన అడవులలో ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. టి. రెక్స్ లేదా డిప్లోడోకస్ వంటి భారీ సౌరోపాడ్‌ల పరిమాణంలో ఉన్న జంతువుల ధ్వని నిజానికి చాలా తక్కువగా ఉండొచ్చు.

"శరీర పరిమాణం, పౌనఃపున్యం మధ్య సంబంధం ఉంటుందని మనకు తెలుసు. చిన్న జంతువులు సాధారణంగా వాటి స్వర తంత్రుల పొడవు కారణంగా అధిక పౌనఃపున్యం గల శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. పెద్ద జంతువులు తక్కువ పౌనఃపున్యంతో శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు నాలుగు ఏనుగులు ఒకదానిపై ఒకటి ఉంటే ఎంత పరిమాణంలో ఉంటాయో అంత పరిమాణంలో ఒకే డైనోసార్ ఉంటుంది. అవి మానవ వినికిడి ఫ్రీక్వెన్సీ పరిధిలో శబ్దాలను ఉత్పత్తి చేయవు. కానీ బహుశా మీరు వాటిని అనుభూతి చెందుతారు'' అని క్లార్క్ వివరించారు.

అతిపెద్ద డైనోసార్‌లు ఒకదానితో ఒకటి చేసే మంద్రస్థాయి శబ్దాలు కూడా మన చెవులకు వింతగా తోస్తాయని ఇతర పరిశోధనలు సూచిస్తున్నాయి. సూపర్సారస్ వంటి జీవులలో మెదడునుంచి వచ్చే శబ్ద సంకేతాలు 28 మీటర్ల పొడవు (92 అడుగులు) ఉండే మెడ వద్దకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి వాటికి శబ్దసామర్థ్యంపై నియంత్రణ ఉండేది కాదు. అంటే దీనర్ధం వాటి పరిసరాలకు సంబంధించి అవి చేసే శబ్దాలు మందకొడిగా ఉండేవని.

అయితే, డిప్లోడోకస్, సూపర్సారస్ వంటి భారీ సౌరోపాడ్‌లు మందలో కదులుతున్నప్పుడు స్పర్శ సంభాషణపై ఎక్కువగా ఆధారపడి ఉండవచ్చని కొంతమంది పెలియాంటాలజిస్టులు ప్రతిపాదించారు. బహుశా వాటికి అందుకే అంత పొడవైన తోకలుండేవని అభిప్రాయపడ్డారు. వలస వెళ్ళేటప్పుడు సహచరులతో నిరంతరం సంభాషణలో ఉండటానికి ఈ తోకలు వీలు కల్పించాయి.

దూరంగా ఎక్కడో భయంకరమైన గర్జనలతో ఓ క్రెటేషియష్ జీవి బతికి ఉన్నట్టు ఊహించుకోండి. దాని అరుపులు మీ చెవులు చిల్లుల పడేలా చేసి, మీ శరీరమంతా వణుకుపుట్టించేలా చేస్తే.. మీరు దానికి దగ్గరగా వెళతారా, లేదంటే పరుగందుకుంటారా?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)