You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆకాశం నుంచి దాడి జరుగుతోందా అన్నట్లు దూసుకొచ్చిన ఆ రాకెట్ శకలాలు ఎక్కడివి?
- రచయిత, ఈవ్ వెబ్‌స్టర్
- హోదా, బీబీసీ న్యూస్
గ్రీనిచ్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30కు ఉత్తర ఐరోపా అంతటా ఆకాశంలో మండతూ గాలిలో దూసుకెళ్తున్న ఒక ప్రకాశవంతమైన వస్తువు కనిపించింది.
''వెంటనే నాకు సైంటిఫిక్ మూవీ గుర్తుకు వచ్చింది. ఒక దళంగా ఏర్పడి, ఏదైనా దాడి చేయబోతున్నారేమో అనిపించింది.'' అని మాల్మోలో పనిచేసే సిమోన్ ఎరిక్సన్ అనే వ్యక్తి స్వీడిష్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్‌తో చెప్పారు.
అయితే, ఈ పైరోటెక్నిక్స్ (ప్రకాశవంతమైన మెరుపులు వెనకున్న) వాస్తవం ఏంటంటే.. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించడం వల్ల ఇది జరిగింది. డెన్మార్క్, స్వీడన్, ఇంగ్లాండ్‌లలో ఇవి కనిపించినట్లు కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి.
ఈ మేరకు స్పేస్ ఎక్స్ కూడా ఒక వివరణ ఇచ్చినట్లు ది రిజిస్టర్ మేగజైన్ వెల్లడించింది. ‘‘ గత వారం పోలండ్‌లో కూలిపోయిన శకలాలు ఫాల్కన్ 9 రెండో దశ రాకెట్ ప్రయోగానికి సంబంధించినవి. వాటిలో ఉండే ఆక్సీజన్ లీక్ కావడం వల్ల డీ ఆర్బిట్ బర్న్ జరగలేదు.’’ అని స్పెస్ ఎక్స్ పేర్కొన్నట్లు ది రిజిస్టర్ వెల్లడించింది.
పోలాండ్‌లో క్రాష్ అయిన ఈ రాకెట్ శకలాలు, యుక్రెయిన్‌లో కూడా పడి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
గ్రీనిచ్ కాలమానం ప్రకారం 9.00 గంటలకు పోలాండ్‌లోని కొమోర్నికిలో తన గోదాము వెనుకాల పడి ఉన్న 1.5 మీటర్లు, 1 మీటరు పరిమాణంలోని ఒక కాలిపోయిన ట్యాంక్‌ను చూసి ఆడమ్ బోరుక్కి ఆశ్చర్యపోయారు.
''మేం పనికి వచ్చినప్పుడు, స్టోరేజ్ యార్డులో విరిగిపడ్డ కరెంటు స్తంభాలతో అంతా చెల్లాచెదురుగా పడి ఉండటం చూశాం.'' అని బోరుక్కి బీబీసీతో చెప్పారు.
గోదాములోని కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు, కాంక్రీటు బ్లాక్‌లు దెబ్బతిన్నాయని తెలిపారు.
''నాకు ఆశ్చర్యమేసింది. కాస్త భయంగా కూడా అనిపించింది. ఎవరికి దీనివల్ల హాని జరగకపోవడం సంతోషం.'' అని తెలిపారు.
పోలిష్ స్పేస్ ఏజెన్సీ పోల్సాతో కలిసి పనిచేస్తున్న పోలీసులను బోరుక్కి సంప్రదించారు. ఆ గుర్తు తెలియని వస్తువు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందినవని నిర్ధరించారు.
''ఈ ప్రాంతంలో ఈ వస్తువు ఎలా పడిందో మేం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అయితే, ఎవరికి దీనివల్ల హాని జరగకపోవడం ఊరట.'' అని స్థానిక పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
ఇలాంటి శకలాలనే పోలీష్ గ్రామం విరీకి సమీపంలోని అడవిలో కూడా గుర్తించినట్లు పోలీష్ పోలీసులు చెప్పారు.
అనియంత్రిత పద్ధతిలో రెండో దశలో ఫాల్కన్ 9 రాకెట్‌కు చెందిన శకలాలు పోలాండ్ వ్యాప్తంగా 2025 ఫిబ్రవరి 19న 4.46 నుంచి 4.48 మధ్యలో కనిపించినట్లు పోల్సా ధ్రువీకరించింది.
స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ను ఎర్త్ థర్మోస్పియర్లోకి, కొన్నిసార్లు ఆపైకి ప్రజలను, పేలోడ్స్‌ను తరలించేందుకు వాడుతున్నారు. తిరిగి వాడుకునేలా ఈ రాకెట్‌ను డిజైన్ చేశారు.
ఫిబ్రవరి 1న కాలిఫోర్నియా వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి స్పేస్‌ఎక్స్ లాంచ్ చేసిన రాకెట్‌కు చెందిన శకలాలే ఇవి.
'' నియంత్రిత విధానంలో ఇది భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోతుందని అనుకున్నాం.'' అని హార్వర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిస్ట్ డాక్టర్ జోనాథన్ మెక్‌డోవెల్ బీబీసీతో చెప్పారు.
''కానీ, ఇంజిన్ ఫెయిల్ అయింది. గత కొన్ని వారాలుగా ఇది భూమి చుట్టూ తిరుగుతున్నట్లు మేం చూస్తున్నాం. అనియంత్రిత పద్ధతిలో ఇది భూవాతావరణంలోకి వస్తుందని మేం అంచనావేశాం. అదే ప్రజలకు ఆకాశంలో మండుతూ కనిపించింది.'' అని అన్నారు.
''ఈ శకలాలు గంటకు సుమారు 27 వేల కిలోమీటర్ల వేగంతో ఇంగ్లండ్ మీదుగా వ్యాపించాయి. ఆ తర్వాత కొన్ని భాగాలు స్కాండినేవియాలో, కొన్ని భాగాలు ఈస్ట్రన్ యూరప్‌లో గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో పడిపోయాయి.'' అని వివరించారు.
నెలలో ఎన్నోసార్లు రాకెట్లు, ఉపగ్రహాలకు చెందిన అంతరిక్ష శకలాలు భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించాయి. భూవాతావరణంలోకి రాగానే, ఈ అంతరిక్ష శకలాలకు చెందిన ముక్కలు పూర్తిగా కాలిపోతాయి. పెద్ద ముక్కలు మాత్రమే భూమిపై పడతాయి.
అనియంత్రిత పద్ధతిలో ఒక పెద్ద రాకెట్ తిరిగి భూమిపైకి రావడం చాలా అరుదని మెక్‌డోవెల్ చెప్పారు. దీనివల్ల ప్రమాదం చేకూరే అవకాశం ఉంటుందన్నారు.
''అయితే, ఇప్పటి వరకు అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ, భూ కక్ష్యలో ఎన్ని ఎక్కువ ఉంచితే, అంత ఎక్కువగా మన అదృష్టం తొలగిపోతుంది.'' అని చెప్పారు.
''స్పేస్‌ఎక్స్ ఫాల్కన్‌తో కలుపుకుని ఇది నాలుగవ ప్రమాదం. ఇది ఆందోళనకర విషయం. ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటి లోపాలు చూస్తుంటే ఇవి సాధారణంగా మారుతున్నట్లు అనిపిస్తుంది.'' అని అన్నారు.
ఇప్పటి వరకు శకలాలకు చెందిన పెద్ద పెద్ద ముక్కలు పోలాండ్‌లో పడినట్లు తేలింది. పశ్చిమ యుక్రెయిన్‌లో కూడా ఇవి క్రాష్ అయినట్లు డాక్టర్ మెక్‌డోవెల్ భావిస్తున్నారు. ఎందుకంటే, అక్కడ కూడా ఆకాశంలో తోకచుక్కల లాంటి వెలుతురులు స్పష్టంగా కనిపించాయి.
మన నాగరికత ఎలా మారుతుందనే దానికి ఇదొక అపశకునం అని మెక్‌డోవెల్ అన్నారు. దీనిపై స్పందన కోసం బీబీసీ స్పేస్‌ఎక్స్ సంస్థను సంప్రదించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)