You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
200 ఏళ్ల నాటి కండోమ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?
- రచయిత, బార్బరా టాష్, దానై నెస్టా కుపెంబా
- హోదా, బీబీసీ న్యూస్
ఇప్పటికీ మంచి కండీషన్‌లో ఉన్న సుమారు 200 ఏళ్ల నాటి కండోమ్‌ను నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో గల రిజ్క్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు.
దీనిని గొర్రె పేగుతో తయారు చేసినట్లు భావిస్తున్నారు.
అలాగే దానిపై ఒక నన్, ముగ్గురు మత పెద్దలను చూపిస్తున్నట్లు కనిపించే డ్రాయింగ్ ఉంది.
ఈ అరుదైన కండోమ్ 1830 సంవత్సరం నాటిది, 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసింది.
ఈ కండోమ్ 19వ శతాబ్దంలో వ్యభిచారం, లైంగికత గురించి ప్రదర్శనకు ఉంచిన వాటిలో ఒకటి.
ఈ ప్రదర్శనలో ప్రింట్లు, డ్రాయింగ్‌లు, ఛాయాచిత్రాలు కూడా ఉన్నాయి.
గతంలో ఎవరు వాడారు?
''మొదటిసారి వేలంలో ఆ కండోమ్‌ను చూసినప్పుడు నేను, నా సహోద్యోగి నవ్వడం ప్రారంభించాం'' అని మ్యూజియం క్యురేటర్ జోయ్స్ జెలెన్ బీబీసీతో చెప్పారు.
''వేలంలో ఎవరూ దానిని గమనించలేదు" అని జోయ్స్ అన్నారు. బిడ్ కూడా ఒక్కరే వేసినట్లు చెప్పారు.
కండోమ్‌ను వేలంలో దక్కించుకున్న తర్వాత వారు దాన్ని అతినీలలోహిత కాంతిలో పరీక్షించారు. దాంతో ఆ కండోమ్‌ను ఉపయోగించలేదని తేలింది.
"ఇది మంచి స్థితిలో ఉంది" జోయ్స్ జెలెన్ అన్నారు.
కండోమ్ ప్రదర్శనకు వచ్చినప్పటి నుంచి మ్యూజియం అన్ని వయసుల సందర్శకులతో నిండిపోయిందని, సందర్శకుల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చిందని ఆమె అంటున్నారు.
ఈ కండోమ్ ఫ్రాన్స్‌లోని ఒక ఖరీదైన వ్యభిచార గృహం నుంచి వచ్చిన "లగ్జరీ జ్ఞాపిక"గా నమ్ముతున్నట్లు జోయ్స్ జెలెన్ వివరించారు.
అలాంటి కండోమ్‌లు రెండే ఉన్నాయని తెలిసినట్లు ఆమె చెప్పారు.
ఈ అరుదైన వస్తువు లైంగిక ఆరోగ్యానికి సంబంధించి మంచి, చెడు రెండింటిని చూపిస్తుందని మ్యూజియం తెలిపింది.
ఆ కాలంలో ప్రజలు సెక్స్‌ను ఆస్వాదించారు కానీ, అవాంఛిత గర్భాలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు, ముఖ్యంగా సిఫిలిస్ వంటి వాటికి కూడా భయపడేవారు.
కండోమ్‌పై ఉన్న ఆ డ్రాయింగ్ ఏంటి?
ఈ కండోమ్‌పై ఒక డ్రాయింగ్ ఉంది. అందులో ఒక నన్ కాళ్లు రెండూ దూరంగా చాచి కూర్చుని ఉండగా, ఆమె ముందు ముగ్గురు మతాధికారులు నిలబడి ఉన్నారు. వారి వైపు నన్ తన వేలును చూపుతుంది.
దీనిపై "వొయిలా మోన్ చోయిక్స్" అనే పదాలు కూడా ఉన్నాయి, అంటే "ఇదిగో నా ఎంపిక" అని అర్థం.
ఈ చిత్రం బ్రహ్మచర్యాన్ని ఎగతాళి చేయడంతో పాటు, పారిస్ అనే ట్రోజన్ యువరాజు ఆఫ్రొడైట్, హేరా, అథీనాల మధ్య అత్యంత అందమైన దేవతను ఎంచుకునే గ్రీకు పురాణాన్ని ఎగతాళి చేసే ఒక జోక్ అని మ్యూజియం వివరించింది.
'ఇలాంటి కండోమ్ మొదటిది'
డచ్ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్‌లు, ఫోటోలు ఉన్నాయి. కానీ, ప్రింట్ ఉన్న కండోమ్ దొరకడం ఇదే మొదటిసారి.
"మాకు తెలిసినంత వరకు, ముద్రిత కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం మాది" అని జోయ్స్ జెలెన్ అన్నారు.
ఇతర మ్యూజియాలలో ప్రదర్శన కోసం ఈ కండోమ్‌ను ఇవ్వడానికి కూడా ఇనిస్టిట్యూట్ సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. కానీ, కండోమ్ చాలా పెళుసుగా ఉందని జోయ్స్ తెలిపారు.
2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)