You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయిదేళ్లుగా రెండు చెవులూ వినిపించట్లేదు.. చెవుడు వచ్చిందని అంతా అనుకున్నారు.. కానీ, చెవుల్లో ఇయర్ బడ్స్ ఇరుక్కుపోయాయని తెలిసి షాక్ అయ్యారు..
అయిదేళ్లు అవుతోంది... ఆయన చెవులు సరిగ్గా వినపడక.
త్వరలోనే చెవుడు వస్తుందేమోనని ఆయన భయపడ్డారు. ఇంట్లో వాళ్లు కూడా ఆందోళన చెందారు.
ఈ సమస్యకు కారణం చిన్న ‘ఇయర్ బడ్’ వల్లే తన చెవులకు ఇంత కాలం సరిగ్గా వినపడటం లేదని తెలిసి ఆ వ్యక్తి ఆశ్చర్య పోయారు.
ఏం జరిగింది?
బ్రిటన్‌లోని డోర్సెట్‌కు చెందిన వాలెస్ లీ, రాయల్ నేవీలో పని చేసి రిటైర్ అయ్యారు. సుమారు అయిదేళ్లుగా ఆయన చెవులకు సరిగ్గా వినపడటం లేదు.
చాలా కాలం పాటు ఆయన విమానయాన పరిశ్రమలో పని చేశారు. అక్కడ విమానాల నుంచి వచ్చే పెద్దపెద్ద శబ్దాల వల్ల తన వినికిడి శక్తి తగ్గిపోయిందేమోనని ఆయన అనుకున్నారు.
వినికిడి శక్తి తగ్గిపోవడంతో వాలెస్ లీ ఆందోళనకు లోనయ్యారు. ఆయనకు చెవుడు వస్తుందేమోనని ఆయన భార్య చాలా భయపడ్డారు.
ఇటీవల ఆయన ఎండోస్కోప్ ‘హోమ్ కిట్’ను కొనుగోలు చేశారు. దాని ద్వారా తన చెవుల్లో తెల్లని వస్తువు ఏదో ఉన్నట్లుగా వాలెస్ గుర్తించారు.
చెవుల్లో ఇయర్ బడ్స్
చెవుల్లో ఏదో ఉందని తెలుసుకున్న తరువాత వాలెస్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు చెవులును పరీక్షించి వాటిలో ఉన్న ఇయర్ బడ్స్‌ను బయటకు తీశారు.
తన చెవుల్లోకి అవి ఎలా వెళ్లాయో వాలెస్ ఇలా వివరించారు...
‘ఇదంతా అయిదేళ్ల కిందట జరిగింది. మా బంధువులను కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ఇయర్ ప్లగ్స్ కొన్నాను. విమానంలో వచ్చే నాయిస్‌కు అనుగుణంగా వాటికి వివిధ రకాల పరిమాణాల్లో ఉండే బడ్స్‌ను అటాచ్ చేసుకోవచ్చు.
అప్పుడు అనుకోకుండా బడ్స్ అటాచ్‌మెంట్స్ నా చెవుల్లో ఉండిపోయాయి. ఇలా అయిదేళ్ల పాటు అవి చెవుల్లోనే ఉన్నాయి.
నా చెవులను క్లీన్ చేసేందుకు చాలా సార్లు ప్రయత్నించా. కానీ ఫలితం కనిపించలేదు. ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు.
డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు వాటిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఏళ్లుగా అవి చెవిలోనే ఉండిపోవడం వల్ల వాటి చుట్టూ గుమిలి పేరుకు పోయింది. అందువల్ల అవి కదలడం లేదు.
దాంతో చెవిలోకి ఒక చిన్న ట్యూబ్ పంపి దాని సాయంతో వాటిని బయటకు తీశారు.
అవి బయటకు వచ్చిన మరుక్షణమే ఆ గదిలోని అన్ని శబ్దాలు నాకు స్పష్టంగా వినిపించాయి. ఇన్ని సంవత్సరాలుగా నాలో ఉండే ఆ బాధ ఒక్కసారిగా తొలగి పోయింది.
నాకు చాలా బాగా వినపడింది.
చాలా కాలం తరువాత మళ్లీ స్పష్టంగా వినగలగడం చాలా బాగా అనిపించింది.’
ఇంటి దగ్గర మన చెవులను మనమే పరీక్షించుకోవడం మరీ అంత ప్రమాదకరం కాదని ఈఎన్‌టీ సర్జన్ డాక్డర్ నీల్ డె జోయసా అన్నారు. అయితే చెవిలో ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తీయడానికి మాత్రం ప్రయత్నించకూడదని హెచ్చరించారు. వైద్యుల సాయం లేకుండా ప్రయత్నిస్తే సమస్య మరింత తీవ్రతరం కావడం లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరగొచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- 15 ఏళ్ల క్రితం తన కుమార్తెను చంపి, ముక్కలుగా కోసిన హంతకుడిని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’
- చిత్రకూట్, తీర్థగఢ్ వాటర్‌ఫాల్స్.. విశాఖకు దగ్గరలో బాహుబలి జలపాతం
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- జీ20 లోగోలో ‘కమలం’ ఏమిటి.. అసలు మోదీ, బీజేపీలకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు