పాకిస్తాన్‌లో పోయిన కరెంటు... ఆర్థికసంక్షోభమే కారణమా

    • రచయిత, కరోలినా డేవిస్, టామ్ స్పెండర్
    • హోదా, బీబీసీ కోసం

పాకిస్తాన్‌లో సోమవారం ఉదయం నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ బ్రేక్‌డౌన్ కావడంతో సోమవారం ఉదయం నుంచి అక్కడ విద్యుత్ లేదని ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

దేశంలోని అతిపెద్ద నగరం కరాచీ, రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ సహా అన్ని ప్రధాన నగరాలలో కరెంట్ పోయింది.

దక్షిణ పాకిస్తాన్‌లో ‘ఫ్రీక్వెన్సీ వేరియేషన్’ కారణంగా గ్రిడ్ విఫలమైనట్లు విద్యుత్ శాఖ మంత్రి ఖుర్రమ్ దస్తగిర్ చెప్పారు. ఇదేమీ పెద్ద సమస్య కాదని, త్వరలోనే విద్యుత్ పునరుద్ధరిస్తారని ఆయన చెప్పారు.

పాకిస్తాన్‌లో విద్యుత్ కోతలు సాధారణమే. నిర్వహణ లోపాలు, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడుల సహకారం లేకపోవడం వంటివి అక్కడ విద్యుత్ కోతలకు ప్రధాన కారణంగా చెప్తారు.

పాకిస్తాన్ ఇంధన శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు(భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలు) గ్రిడ్ ఫెయిలైంది. గ్రిడ్ వ్యవస్థను పునరుద్ధరించడానికి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఇప్పటి కొన్ని గ్రిడ్‌లను పునరుద్ధరించారని.. మొత్తం అన్ని గ్రిడ్‌లు పునరుద్ధరించి విద్యుత్ అందివ్వడానికి మరో 12 గంటలు పట్టొచ్చని మంత్రి దస్తగిర్ చెప్పారు.

‘చలికాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతుంది. దాంతో పొదుపు చర్యలలో భాగంగా రాత్రిపూట విద్యుదుత్పత్తి నిలిపివేశాం. తిరిగి ఉదయం విద్యుదుత్పత్తి ప్రారంభించినప్పుడు దక్షిణ పాకిస్తాన్‌లో ఫ్రీక్సెన్సీ, వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడినట్లు గుర్తించారు. దాదు, జమ్సోరో మధ్య ఇది జరిగిందని.. ఆ తరువాత విద్యుత్కేంద్రాలు ఒక్కొక్కటి ఆగిపోయాయి’ అని దస్తగిర్ ‘జియో టీవీ’తో మాట్లాడుతూ చెప్పారు.

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు పనిచేయలేదు, ఫ్యాన్లన్నీ ఆగిపోయాయి, లైట్లు పనిచేయలేదు.

పాకిస్తాన్‌లో ఓల్టేజ్ సమస్యలు, విద్యుత్ కోతలు సాధారణమే. వ్యాపారాలు చేసుకునేవారు, కొందరు ఇళ్లలో కూడా జనరేటర్లు వాడుతుంటారు.

పెషావర్‌లోని లేడీ రీడింగ్ హాస్పిటల్ అధికారులు బీబీసీతో మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఈ పవర్ కట్ ప్రభావం పడలేదన్నారు. హాస్పిటల్‌లోని అన్ని విభాగాలకు జనరేటర్లు ఉన్నాయని, ఎమర్జెన్సీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకూ జనరేటర్లతో విద్యుత్ అందుతుందని చెప్పారు.

హాస్పిటల్స్, పెద్దపెద్ద వ్యాపార సంస్థలు జనరేటర్లు వాడుతున్నా చిరువ్యాపారాలు, సాధారణ ప్రజల ఇళ్లలో జనరేటర్లు తక్కువే. వారంతా ప్రభావితమయ్యారు ఇప్పుడు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ విద్యుత్ వ్యయం తగ్గించుకోవడానికి గాను రాత్రి 8.30 తరువాత మార్కెట్లు మూసేయాలని, రాత్రి 10 గంటల తరువాత మాల్స్ మూసివేయాలని ఇప్పటికే ఆదేశించింది.

ఆ నిర్ణయం వల్ల 6,200 కోట్ల పాకిస్తాన్ రూపాయలు ఆదా అవుతాయని ఆ దేశ మంత్రివర్గం పేర్కొంది. అంతేకాదు.. కేంద్ర విభాగాలన్నీ వాటి విద్యుత్ వినియోగం 30 శాతం మేర తగ్గించుకోవాలనీ ప్రభుత్వం సూచించింది.

పాకిస్తాన్‌లో విద్యుదుత్పత్తి ఎక్కువగా శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తారు. అందుకోసం దిగుమతులపై ఆధారపడతారు.

గత ఏడాది అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, విదేశీ మారక ద్రవ్యంపై భారం పడింది. ఇంధన దిగుమతులకు విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నిల్వలు భారీగా తగ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)