హాంకాంగ్: రన్‌వేను దాటి సముద్రంలోకి దూసుకుపోయిన విమానం.. ప్రమాదం అనంతర దృశ్యాలు

హాంకాంగ్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ కార్గో విమానం రన్ వే నుంచి జారిపోయి సముద్రంలోకి వెళ్లిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.

రన్‌వేపై దిగిన తర్వాత అదుపు తప్పిన విమానం సముద్రంలోకి వెళ్లింది. ఎమిరేట్స్‌ విమానం ఈకే 9788 ను ఏరోట్రాన్స్ కార్గోగా నడుపుతున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం వేకువజామున 3.50కి దుబాయి నుంచి హాంకాంగ్ చేరుకుంది.

దుబాయ్ నుంచి వస్తున్న ఎమిరేట్స్ విమానం ఈకే9788, నార్త్ రన్‌వేపై ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైన సమయంలో అక్కడే ఉన్న ఒక పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది.

బోయింగ్ 747-481 విమానం సగానికి విరిగిపోయి, సముద్రం మీద పడిపోయిందని అధికారులు తెలిపారు.

విమానం స్కిడ్ అయి, అక్కడే ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టగా అది కూడా సముద్రంలో పడిపోయింది. అందులో ఉన్న ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ ఈ ప్రమాదంలో మరణించారని పోలీసులు చెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రస్తుతం విమానాశ్రయంలోని నార్త్ రన్ వేను అధికారులు మూసేశారు. అయితే ఇతర రన్ వేలపై రాకపోకలు కొనసాగుతున్నాయి.

1998లో ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన ప్రమాదాల్లో ఇది రెండో అత్యంత ప్రమాదకర ఘటన అని చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)