You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోప్ ఫ్రాన్సిస్ ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ అయ్యారు, ఆయనకు ఏమైంది?
- రచయిత, ఎమ్మా రోసిటర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోప్ ఫ్రాన్సిస్‌కు న్యుమోనియా సోకిందని, ఆయన రెండు ఊపిరితిత్తులలో ఇది తీవ్రంగా వ్యాపించిందని వాటికన్ సిటీ ప్రకటించింది.
88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ వారం రోజుల నుంచి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీంతో ఆయనను గత శుక్రవారం (ఈనెల 14) రోమ్‌లోని ఆసుపత్రికి తరలించారు. పోప్ పరిస్థితి సంక్లిష్టంగానే ఉంది.
ఇటీవల పోప్ ఛాతీని స్కాన్ చేయగా ఆయన రెండు ఊపిరితిత్తులలో న్యుమోనియా కనిపించిందని, దీనికి అదనపు చికిత్స (డ్రగ్ థెరపీ) అవసరమని తేలింది.
పోప్ రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను వైద్యులు పరిశీలించారని, ఆయన ఆరోగ్యం 'స్వల్పంగా మెరుగుపడింది' అని వాటికన్ తెలిపింది.
పోప్ ఉత్సాహంగానే ఉన్నారని, చదువుతూ, విశ్రాంతి తీసుకుంటూ, ప్రార్ధనలు చేసుకుంటూ రోజంతా గడిపారని వాటికన్ పేర్కొంది.
కాగా, అంతకుముందు జరిపిన వైద్య పరీక్షలు ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని చూపించాయి. న్యుమోనియా అనేది తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులలో మంట కలిగిస్తుంది, ఛాతీ నొప్పికి కారణమవుతుంది. శ్వాసను మరింత కష్టతరం చేస్తుంది.
ఆసుపత్రికి ఇటలీ ప్రధాని
పోప్ ఫ్రాన్సిస్ తన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెబుతూ, తన కోసం ప్రార్థించాలని వారిని కోరారు.
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని బుధవారం పోప్‌ను సందర్శించారు. పోప్ ప్రతిస్పందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు.
'మేం ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకున్నాం, ఆయనలో హాస్య చతురత తగ్గలేదు' అని మెలోని తెలిపారు. పోప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
పోప్ చాలా రోజులుగా బ్రాంకైటిస్ లక్షణాలతో బాధపడ్డారు. ఈవెంట్‌లలో పోప్ రాసిన ప్రసంగాలను అధికారులు చదివేవారు. 2025 క్యాథలిక్ హోలీ ఇయర్ కోసం జరిగే పలు కార్యక్రమాలకు పోప్ నాయకత్వం వహించాల్సి ఉంది. ఇవి 2026 జనవరి వరకు జరగాల్సి ఉన్నాయి. అయితే పోప్ షెడ్యూల్‌లోని అన్ని పబ్లిక్ ఈవెంట్‌లు ఆదివారం వరకు రద్దు చేశారు.
పోప్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన కోసం వైద్యులు మరోసారి 'డ్రగ్ థెరపీ' మార్చారని వాటికన్ సిటీ తెలిపింది.
పోప్ ఫ్రాన్సిస్‌కు గతంలో "శ్వాసకోశ నాళంలో పాలీమైక్రోబియాల్ ఇన్ఫెక్షన్" వచ్చిందని భావించారు.
21 ఏళ్ల వయసులోనే..
పోప్‌కు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువుంది, ఎందుకంటే ఫ్రాన్సిస్ యుక్తవయసులో ఉండగా ఆయనలో ప్లూరిసీ డెవలప్ అయింది. ఆయనకు 21 ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తులలో కొంత భాగాన్ని తొలగించారు.
అర్జెంటీనాకు చెందిన పోప్ ఫ్రాన్సిస్, గత 12 ఏళ్ల నుంచి రోమన్ క్యాథలిక్ చర్చ్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో పోప్ చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో భాగంగానే 2023 మార్చిలో బ్రాంకైటిస్ కారణంగా మూడు రోజులు ఆసుపత్రిలో గడిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)