ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...

బైక్, ఇటలీ, ట్రాఫిక్, పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పలు పర్యటక నగరాల్లో బైక్‌లపై ఆంక్షలు విధిస్తున్నారు.
    • రచయిత, రూత్ కోమర్‌ఫోర్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఓ ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టడంతో గాయపడిన ఇటలీలోని కోమో నగర మేయర్.. ఆ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అసలు టూ వీలర్స్‌ తిరగవద్దంటూ నిషేధం విధించారు.

ప్రజలభద్రత కోసం ఈ నిషేధం అవసరమని మేయర్ అలెసాండ్రో రాపినీస్ అన్నారు.

ఈ నిర్ణయంవల్ల సెప్టెంబరు నుంచి సైక్లిస్టులు దాదాపు 30 వీధుల్లో బైక్ నడిపేందుకు వీలు లేదు.

అక్కడి దాకా బైక్‌పై వచ్చినా, అక్కడి నుంచి దిగి నడుస్తూ వెళ్లాల్సిందే.

"ఎవరైనా తమ అనుభవాల ఆధారంగానే నడుచుకుంటారు. బైక్ ఢీ కొంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు" అని ఇటలీ న్యూస్ ఏజెన్సీ అన్సాతో రాపినీస్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

యూకే సహా ఐరోపాలోని పలు స్థానిక సంస్థలు సైతం ఈ-బైక్‌లు, ఇతర సింగిల్ పర్సన్ (ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించడానికి వీలుగా రూపొందించిన) వాహనాలు ఎక్కడ, ఏ విధంగా నడపవచ్చు అనేదానిపై ఇదివరకే ఆంక్షలు విధించాయి.

కోమో నగరంలో పర్యటక అభివృద్ధి చర్యల్లో భాగంగా వాహనాల రద్దీ తగ్గించేందుకు లిమిటెడ్ ట్రాఫిక్ జోన్ (జెడ్‌టీఎల్)లను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం సిటీ సెంటర్‌లో కార్లు, వ్యాన్లు నడపడంపై కఠిన నిబంధనలు పెట్టారు.

ఈ నూతన ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగానే బైక్‌లపైనా నిషేధం విధిస్తున్నట్టు రాపినీస్ తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై చర్చించి బయటకు రాగానే...

విశాలమైన రోడ్లతో చారిత్రక ప్రాముఖ్యం కలిగిన అనేక ప్రాంతాల్లో ఈ నిషేధం అమలవుతోంది. అక్కడ డెలివరీ డ్రైవర్లు ఎక్కువగా కనిపించేవారు.

ఈ నియమాలు ఎలక్ట్రిక్‌తో పాటు పుష్ బైక్స్‌కి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ఇటలీ హైవే కోడ్‌లో ఈ రెండు మోడల్స్ మధ్య తేడా లేదు.

స్వయంగా తాను చేసే రాపిన్యూస్24 అనే ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు మేయర్.

ఈ సందర్భంగా జులైలో నగరం నడిబొడ్డున ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై పాలనా యంత్రాంగంతో చర్చించి, సిటీ హాల్ నుంచి బయటకు వచ్చిన తనను బైక్ ఢీకొట్టిన ఘటనను రాపినీస్ గుర్తుచేస్తున్నారు.

మేయర్‌ని ఢీకొట్టిన సైక్లిస్ట్‌ని ఇప్పటివరకు గుర్తించలేదు.

"నేనేమీ ఆస్పత్రిలో చేరలేదు. నన్ను ఓ బైక్ ఢీకొట్టింది. సమాచారం సేకరించాను. అందులో భాగంగానే ఈ చర్య తీసుకున్నాం" అని రాపినీస్ తెలిపారు.

రోమన్ శైలి గోడలతో నిర్మితమై ఉన్న కోమో సిటీ సెంటర్, ఇదివరకే పరిమిత ట్రాఫిక్ జోన్‌లో ఉంది. అక్కడి స్థానికులు ప్రయాణాలకు ప్రధానంగా సైకిళ్లనే వినియోగిస్తారు.

బైక్, ఇటలీ, ట్రాఫిక్, పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

నగరంలో అనేక ఆంక్షలు

జెడ్‌టీఎల్ కోసం అమలు చేసిన ఈ నూతన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం పలు వాహనాలు యాన్యువల్ పర్మిట్ తీసుకోవాలి. ఒక్క రోజు ప్రవేశం కోసం 3 యూరోలు (దాదాపు రూ. 330) చెల్లించాల్సి ఉంటుంది.

షాపులు, రెస్టారెంట్లకు డెలివరీలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకే అనుమతిస్తారు. ఇక పర్యటకులకు, తమ హోటల్‌లో పార్కింగ్ సదుపాయం ఉంటేనే వారి వాహనాలను సిటీ సెంటర్‌లోకి అనుమతిస్తారు.

బైక్, ఇటలీ, ట్రాఫిక్, పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బైక్‌లపై నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

‘అనాలోచిత నిర్ణయం’

అయితే ఈ నిషేధంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓ ఆన్‌లైన్ పిటిషన్ కూడా నడుస్తోంది.

సివిటాస్ కోమో అనే ఓ స్థానిక సిటిజన్ గ్రూప్ ఈ నిషేధం చట్టబద్ధతను ప్రశ్నిస్తోంది. ఇది పూర్తిగా అనాలోచిత నిర్ణయమైని పేర్కొంది.

నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 12న బైక్ రైడ్ నిర్వహించేందుకు ద నోవా కోమో అనే ఓ సంఘం పిలుపునిచ్చింది.

బైక్, ఇటలీ, ట్రాఫిక్, పర్యటకం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారిస్ వీధులు

పారిస్ సహా ఇతర నగరాల్లోనూ..

చారిత్రక, రద్దీ ప్రాంతాల్లో బైక్‌లపై నిషేధం విధించిన ఇటలీ నగరాల్లో కోమో మొదటిదేమీ కాదు.

పాలెర్మో పట్టణంలో 2023 నుంచే ప్రధాన వీధుల్లో బైక్‌లపై ఆంక్షలున్నాయి.

ఇక పారిస్‌లోనూ భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ-స్కూటర్‌లపై ఇటీవలే ఆంక్షలు విధించారు. రెంటల్ ఈ-స్కూటర్లపై అక్కడ 2023 నుంచే పూర్తి నిషేధం అమలవుతోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)