You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘స్వాగత తిలకం’ వద్దన్న ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. వారిపై ట్రోలింగ్ ఎందుకు?
నాగపూర్‌లో ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో భారత ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియో చుట్టూ సోషల్ మీడియాలో వివాదం మొదలైంది.
టీమ్‌ఇండియా బౌలర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై పెద్దఎత్తున ట్రోలింగ్‌కు దిగుతున్నారు నెటిజన్లు.
జట్టుకు స్వాగతం పలికే సమయంలో నుదుటన బొట్టు పెడుతుంటారు చాలా సందర్భాలలో. ఈ వీడియోలోనూ అలాగే జట్టు సభ్యులకు బొట్టు పెడుతుండడం కనిపించింది.
అయితే ఆటగాళ్లు, సిబ్బందిలో చాలామంది బొట్టు పెట్టించుకోగా మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు బొట్టు పెట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం అందులో తప్పేముంది అంటూ వారికి మద్దతుగా నిలుస్తున్నారు.
అంతేకాదు... జట్టుతో పాటే వచ్చిన కోచింగ్ స్టాఫ్ విక్రమ్ రాథోడ్, హరిప్రసాద్ మోహన్ కూడా బొట్టు పెట్టించుకోలేదని, అది కూడా వీడియోలో కనిపిస్తోందని గుర్తుచేస్తున్నారు.
ఈ వీడియో ఎప్పటిదనేది స్పష్టత లేదు. ఇటీవలి న్యూజీలాండ్ సిరీస్ సమయంలోది కానీ శ్రీలంక సిరీస్ నాటిది కానీ కావొచ్చని భావిస్తున్నారు.
వివాదం ఎక్కడ మొదలైంది?
సుదర్శన్ టీవీ యజమాని, చీఫ్ ఎడిటర్ సురేశ్ చవాంకే ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లను లక్ష్యంగా చేసుకోవడంతో వివాదం మొదలైంది.
‘స్వాగతం పలుకుతున్నప్పుడు నుదుటన తిలకం పెడుతుంటే మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ వద్దన్నారు. వాళ్లు ఇండియా ఆటగాళ్లు. పాకిస్తాన్ ఆటగాళ్లు కాదు. ఇంటర్నేషనల్ క్రికెటర్లుగా ఎదిగినా కూడా వారు మతాన్ని వదిలిపెట్టలేదు’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
యోగి దేవనాథ్ అనే ట్విటర్ యూజర్ దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు ఈ స్థాయికి చేరుకున్న తరువాత కూడా తమ మత విశ్వాసాలను పాటిస్తున్నారు’ అన్నారు.
సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు ముస్లింలు కాబట్టే భారతీయ ఆచారాలను పాటించరంటూ జియా అగర్వాల్ అనే మరో యూజర్ ట్వీట్ చేశారు.
అయితే, కోచింగ్ స్టాఫ్ విక్రమ్ రాథోడ్, హరిప్రసాద్ మోహన్ కూడా తిలకం పెట్టించుకోలేదంటూ ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు, ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ట్వీట్ చేశారు.
దానికి సంబంధించిన ఫోటోలూ ఆయన షేర్ చేశారు.
మొహమ్మద్ అల్తాఫ్ అనే మరో యూజర్ కూడా ఇదే విషయం చెప్పారు. సిరాజ్ ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా తిలకం పెట్టించుకోలేదని చెప్పారు.
ఉమ్రాన్ మాలిక్ వేరే సందర్భాలలో బొట్టు పెట్టించుకున్న చిత్రాన్ని వైభవ్ భోలా అనే మరో యూజర్ ట్వీట్ చేశారు.
సిద్ధార్థ్ రాజ్‌పుత్ అనే మరో యూజర్ సిరాజ్‌కు సంబంధించిన ఇంకో వీడియో షేర్ చేశారు. అందులో జాతీయ గీతం వింటున్నప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)