You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతి తాబేళ్ల జంటకు నాలుగు పిల్లలు
- రచయిత, జాక్ బర్గెస్
- హోదా, బీబీసీ న్యూస్
అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతికి చెందిన తాబేళ్ల జంట తొలిసారి పిల్లలను పొదిగింది. ఈ జంట వయసు దాదాపు 100 ఏళ్లు.
ఫిలడెల్ఫియా జంతు ప్రదర్శనశాల (జూ)లో ఉండే తాబేళ్ల జంట మొదటిసారిగా తల్లిదండ్రులుగా మారింది.
ఈ వారంలో వెస్ట్రన్ శాంటాక్రూజ్ గలాపగోస్ జాతికి చెందిన అబ్రాజో, మోమీ అనే తాబేళ్ల జంటకు నాలుగు పిల్లలు పుట్టడం చాలా ఆనందంగా ఉందని జూ వర్గాలు తెలిపాయి.
150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జూలో తాబేళ్ల జననాలు ఇదే మొదటిసారని జూ నిర్వాహకులు తెలిపారు. 1932లో మోమీ ఈ జూలోకి వచ్చిందని, ఈ జాతి తాబేళ్లల్లో మొదటిసారి తల్లి అయిన వాటిలో ఇదే పెద్ద వయస్కురాలని వెల్లడించారు. ఈ తాబేలు వయసు 97 ఏళ్లు ఉంటుందని ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ న్యూస్ తెలిపింది.
వెస్ట్రన్ శాంటాక్రూజ్ గలాపగోస్ తాబేళ్లు వేగంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న తాబేలు జాతులు. వీటి సంఖ్య 50 కంటే తక్కువే. అమెరికా జూలలో వీటిని సంరక్షిస్తున్నారు.
అబ్రాజో, మోమీ గుడ్లలో మొదటిది ఫిబ్రవరి 27న పిల్లగా మారింది. తర్వాత, మరో మూడు కూడా పిల్లలయ్యాయి. రాబోయే వారాల్లో పిల్లలుగా మారే అవకాశం ఉన్న మిగతా గుడ్లను కూడా జూలోని జంతు సంరక్షణ బృందం పర్యవేక్షిస్తోంది.
ఇప్పుడు పుట్టిన నాలుగు పిల్లల బరువు 70 నుంచి 80 గ్రాముల మధ్య ఉంటుంది.
ఫిలడెల్ఫియా జూలోని రెప్టైల్-ఆంఫిబియాన్ ఆవాసం లోపల ఈ నాలుగు పిల్లలను ఉంచినట్లు జూ వర్గాలు వెల్లడించాయి. అవి సరిపడా ఆహారం తీసుకుంటూ పెరుగుతున్నాయని తెలిపింది.
ఏప్రిల్ 23 నాటికి జూలోకి మోమీ వచ్చి 93 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ నాలుగు పిల్లలను బహిరంగంగా ప్రదర్శించాలని భావిస్తున్నట్లు జూ యాజమాన్యం చెప్పింది.
జాతుల మనుగడ, జన్యు వైవిధ్యమే లక్ష్యంగా పనిచేస్తోన్న అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ బ్రీడింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ పిల్లలు ఊపిరి పోసుకున్నాయి.
''ఫిలడెల్ఫియా జూ చరిత్రలో ఇదో ముఖ్యమైన మైలురాయి. ఈ వార్తను మా నగరం, ప్రాంతం, ప్రపంచంతో పంచుకునేందుకు ఉత్సుకతతో ఉన్నాం. మోమీ 1932లో ఈ జూలోకి వచ్చింది. అంటే గత 92 ఏళ్లలో జూ సందర్శించిన వారెవరైనా మోమీని చూసే ఉంటారు'' అని ఒక ప్రకటనలో జూ ప్రెసిడెంట్, సీఈవో జో ఎల్ మోగెర్మాన్ పేర్కొన్నారు.
అబ్రాజో 2020లో ఫిలడెల్ఫియా జూలోకి వచ్చింది. అంతకుముందు దక్షిణ కరోలినాలోని రివర్‌బ్యాంక్స్ జూలో ఉండేది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)