You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెద్దిరెడ్డి చుట్టూ అటవీ భూముల వివాదం.. పవన్ కల్యాణ్ ఏమన్నారు, అధికారులు ఏమంటున్నారు?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ భూములను ఆక్రమించుకున్నారంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ కేసు నమోదు చేసింది.
చిత్తూరు జిల్లా మంగళంపేటలో 32.63 ఎకరాల అటవీ భూములు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉన్నాయని ఏపీ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్(పీసీసీఎఫ్) చలపతిరావు బీబీసీతో చెప్పారు.
ఈ మేరకు రాష్ట్ర అటవీ చట్టంలోని సెక్షన్ 61(2), 20(1), (డి)(2), 52(డి) ప్రకారం పెద్దిరెడ్డి కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఏ–1గా పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని, ఏ–2గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లను నమోదు చేశామని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఈ కేసులో అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్టు (పీవోఆర్) మేరకు ఛార్జిషీటు దాఖలు చేశామని చలపతిరావు తెలిపారు.
'అటవీ భూములనూ కలిపేసుకున్నారు'
1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబసభ్యుల పేరిట 76.74 ఎకరాలకు పట్టాలు ఉన్నాయని పీసీసీఎఫ్ చలపతిరావు బీబీసీతో చెప్పారు.
అయితే ఈ భూములకు ఆనుకుని ఉన్న 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా కలిపేసుకొని కంచె వేశారని ఆయన తెలిపారు.
ఆ అటవీ భూముల్లో వారు ఉద్యాన పంటలు వేసి సాగు చేస్తున్నారని చెప్పారు.
పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే..
నవంబర్ 9న ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ హెలికాప్టర్‌లో తిరుగుతూ మంగళంపేట అటవీ భూములను పరిశీలించారు.
ఆ ప్రాంతంలో ఏరియల్ సర్వే అనంతరం పెద్దిరెడ్డితో పాటు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అటవీభూములను ఆక్రమించారని పేర్కొంటూ గురువారం (నవంబర్ 13) సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆరోపించారు. ఈ మేరకు ఏరియల్ సర్వే వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ వీడియో విడుదలకు ముందు పవన్ ఆ భూముల వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
''మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికల ప్రాతిపదికగా ముందుకు వెళ్లాలని అధికారులకు తేల్చిచెప్పారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో వెల్లడించాలని ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములెలా వచ్చాయని ప్రశ్నించారు. అటవీ భూముల్లో భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు' అని' చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు బీబీసీకి తెలిపారు.
పవన్ సమీక్షకి ముందే కేసులు
పవన్ కల్యాణ్ సమీక్ష తర్వాతే పెద్దిరెడ్డి కుటుంబసభ్యులపై కేసులు పెట్టారన్న ప్రచారం సరికాదని పీసీసీఎఫ్ చలపతిరావు బీబీసీకి తెలిపారు.
ఉపముఖ్యమంత్రి సమీక్షకు ముందే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల విచారణ మేరకు అటవీశాఖ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశామని చెప్పారు.
వాస్తవానికి 2025 మే 4న కేసులు నమోదు చేశామని, ఇప్పటికే పాకాల కోర్టులో విచారణ జరుగుతోందని ఆయన వివరించారు.
అటవీ భూములు ఆక్రమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చలపతిరావు చెప్పారు.
అటవీ భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారని, ఆ మేరకు సర్వే మొత్తం పూర్తిచేసి స్థలాల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని వెల్లడించారు.
పెద్దిరెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, అసలు ఈ భూమి ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకొని నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశించారని ఆ మేరకు విచారణ చేపడతామని చలపతిరావు అన్నారు.
వారసత్వ భూములు: పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
''పవన్ కల్యాణ్‌కు ఏమీ తెలియదు. చంద్రబాబు ఏం చేయమంటే అది చేస్తారు. వాస్తవానికి మాకు ఆ 78.74 ఎకరాల రెవెన్యూ భూమి మా బంధువుల నుంచి వారసత్వంగా వచ్చింది. మాకే అన్ని ఎకరాల భూమి ఉంటే పక్కన 32 ఎకరాల భూమి మేం ఎందుకు ఆక్రమిస్తాం. అధికారులతో కావాలని అలా తప్పుడు సర్వే చేయించి మా దుష్ప్రచారం చేస్తున్నారు'' అని ఈ భూముల వివాదంలో ఏ–3గా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బీబీసీతో అన్నారు.
'' మాకు వేలాది ఆవులు ఉన్నాయి. వాటిని ఆ ప్రాంతంలో మేత కోసం వదిలేస్తాం. అవి అటవీ భూముల్లో తిరిగితే వాటిని చూపించి మేం ఆక్రమించాం. అనడం సరైంది కాదు. పవన్‌కి చిత్తశుద్ధి ఉంటే పక్కా ఆధారాలతో నిరూపించాలి'' అని ద్వారకానాథ్ డిమాండ్ చేశారు.
పవన్‌కి నిజాయితీ ఉంటే పెద్ద ఉప్పరపల్లిలో టీడీపీ నేతలు ఆక్రమించుకున్న 4 వేల ఎకరాల అటవీ భూములపై మాట్లాడాలని అన్నారు. తమపై ఎన్ని కేసులు కట్టినా లెక్కచేసేది లేదన్నారు ద్వారకానాథ్.
ఇదే విషయమై ఎంపీ మిథున్‌రెడ్డి పవన్ కల్యాణ్‌ని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''ఆ భూమిని మేం 2000 సంవత్సరంలో చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. అప్పటి ప్రభుత్వం కూడా టీడీపీదే. మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి. ఆధారాలు బయటపెట్టండి'' అని ఎక్స్‌లో మిథున్ పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)