You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నవీన్ యాదవ్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా ప్రకటించారు.
ఉదయం 8 గంటలకు ఉప ఎన్నిక కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు.
మొదటి రెండు రౌండ్లు కాంగ్రెస్ ముందంజలో ఉండగా, మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం సాధించింది.
ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ మొత్తం పది రౌండ్లు జరగ్గా, అందులో తొమ్మిది రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది.
మొత్తంగా లెక్కించిన 1,94,631 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,945, బీఆర్ఎస్ అభ్యర్థి 74,234 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి(17,041) డిపాజిట్ కోల్పోయారు.
నోటాకు 924 ఓట్లు పడ్డాయి.
విజయం అనంతరం నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మకంతో తనను గెలిపించారని అన్నారు.
"నాపై ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు వారికి సమాధానమిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు. నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అంతా కలిసి పనిచేద్దాం. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తాం. జూబ్లీహిల్స్‌ను రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా'' అని గెలిచిన అనంతరం నవీన్ యాదవ్ అన్నారు.
ఫలితంపై కేటీఆర్ ఏమన్నారంటే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) స్పందించారు. ఈ ఉప ఎన్నికపై ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారాయన.
బీఆర్ఎస్‌కు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారని ప్రశంసించారు.
"ఈ ఉప ఎన్నిక మాకు కొత్త బలాన్ని ఇచ్చింది. తెలంగాణలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే అని తేలింది. ఎన్నికల ప్రచారంలో మేం అనవసర అంశాల జోలికి వెళ్లలేదు. ఈ ఎన్నిక కోసం మేం కుల, మత రాజకీయాలు చేయలేదు. హుందాగా కొట్లాడాం. కాంగ్రెస్, బీజేపీ కవ్వించే యత్నం చేసినా సంయమనంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఒత్తిడి వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. జూబ్లీహిల్స్ ఫలితాలపై మాకు నిరాశ లేదు" అని కేటీఆర్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)