కోవిడ్ భయంతో మూడేళ్లుగా ‘లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను సైతం ఇంట్లోకి రానివ్వని వైనం

దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఒక మహిళ తన కొడుకుతో సహా మూడేళ్లుగా ఇంట్లోనే తలపులు వేసుకుని ఉండిపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

హరియాణా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే ఈ తల్లీకొడుకులు కోవిడ్ భయంతో మూడు సంవత్సరాలుగా బయటకు అడుగు పెట్టలేదు.

ఈ మూడేళ్లూ బయటకు వెళ్లి పనిచేస్తున్న తన భర్తను సైతం ఆమె ఇంట్లోకి అడుగుపెట్టనివ్వలేదని అధికారులు చెప్తున్నారు.

తాజాగా ఆమె భర్త పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎట్టకేలకు ఆ తల్లీకొడుకులను పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు రక్షించారు.

‘‘గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్ నివాసి ఒకరు.. తన భార్య, కొడుకు మూడు సంవత్సరాలుగా ఫ్లాట్‌లోనే తాళం వేసుకుని ఉండిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు’’ అని గురుగ్రామ్ శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ఉషా సోలంకి తెలిపారు.

అతడి భార్య తనను ఫ్లాట్ లోపలికి అడుగు పెట్టనివ్వటం లేదని, తమ కొడుకును బయటకు అడుగు పెట్టనివ్వటం లేదని ఆయన ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఈ ఉదంతంపై పోలీసులకు కేసు నమోదు చేయాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్దేశించారు. ఫ్లాట్ వద్దకు సహాయ బృందాలను పంపించారు.

‘‘కోవిడ్ భయం వల్లే ఆ మహిళ తన కొడుకుతో సహా ఇంటికి తాళం వేసుకుని లోపలే ఉండిపోయారు. పని చేయటానికి బయటకు వెళ్లే తన భర్తకు వేరొక ఫ్లాట్ తీసుకుని, అందులో ఉండాలని చెప్పారు’’ అని ఉషా సోలంకి వివరించారు.

ఈ మూడేళ్లు ఆమె భర్త వారికి డబ్బులు పంపిస్తూ, సరకులు తెచ్చిపెడుతూ ఉన్నారు.

ఈ దంపతుల కొడుకు వయసు ప్రస్తుతం 11 సంవత్సరాలు. సంక్షేమ శాఖ అధికారులు ఈ తల్లీ కొడుకులను ఫ్లాట్ నుంచి బయటకు రప్పించి, ఆస్పత్రికి తరలించారు.

‘‘ఆ మహిళ మానసిక పరిస్థితిని కూడా వైద్యులు పరీక్షించారు. ఈ ఉదంతంలో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ఉషా సోలంకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)