You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- రచయిత, ఎ.కిశోర్‌బాబు
- హోదా, బీబీసీ కోసం
మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొంది, 88 రకాల చిన్న చిన్న వ్యాపారాలు నెలకొల్పుకొని ఆర్థికంగా స్థిరపడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ‘ఉద్యోగిని’.
ఉద్యోగిని పథకం అంటే ఏమిటి, దీని కింద రుణం ఎలా పొందాలి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి, దరఖాస్తు ఎలా చేయాలి, ఏఏ వ్యాపారాలు చేయడానికి రుణం ఇస్తారు?
ఏమిటీ ఉద్యోగిని పథకం?
కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ కార్యక్రమం లక్ష్యాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆర్థిక సహాయం అందించడమూ ఒకటి.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడానికి ప్రవేశపెట్టిన పథకమే ఉద్యోగిని.
దీన్ని మొదట కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ తరువాత కేంద్ర ప్రభుత్వం దీన్ని వుమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షణలో దేశమంతటా అమలు చేస్తోంది.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 48 వేల మంది మహిళలు లబ్ధి పొంది చిన్నపాటి పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు.
రుణ పరిమితి రూ.3 లక్షలేనా?
కాదు. వైకల్యమున్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితి లేదు. వారు నెలకొల్పే వ్యాపారం, వారి అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం కల్పిస్తారు.
వడ్డీ ఎంత?
వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుంచీ 12 శాతం వడ్డీ మీద రుణం ఇస్తారు.
ఈ వడ్డీ అనేది ఆ మహిళ రుణం పొందే బ్యాంకు నిబంధనలను బట్టి ఉంటుంది.
రుణంలో రాయితీ ఎంత?
కుటుంబ వార్షికాదాాయాన్ని బట్టి 30 శాతం వరకూ రాయితీ కల్పిస్తారు.
ఎవరు అర్హులు?
18 సంవత్సరాలు నిండిన 55 సంవత్సరాల వయసులోపు మహిళలందరూ అర్హులే.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్ స్కోరు బలంగా ఉండేలా చూసుకోవాలి.
గతంలో ఏదైనా రుణాలు తీసుకుని సరిగ్గా తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే రుణం ఇవ్వరు.
సిబిల్ స్కోరు బాగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఏమేం పత్రాలు సమర్పించాలి?
- పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు జత చేయాలి
- దరఖాస్తు చేస్తున్న మహిళ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం
- దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు రేషన్ కార్డు కాపీని జతపరచాలి.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- నివాస ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- బ్యాంకు ఖాతా పాసు పుస్తకం
ఎవర్ని సంప్రదించాలి?
ఈ పథకం కింద రుణం పొందడానికి మహిళలు తమ ప్రాంతంలోని బ్యాంకులను సంప్రదించాలి.
బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు కూడా ఈ రుణాన్ని కల్పిస్తున్నాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:
Udyogini
D-17
Basement, Saket,
New Delhi - 110017
ఫోన్ నంబరు: 011-45781125
ఈమెయిల్ : [email protected]
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)