ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం, 10 మంది మృతి

    • రచయిత, అమీ వాకర్, జోనాథన్ హెడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

తూర్పు ఇండోనేషియాలో సోమవారం తెల్లవారుజామున అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో 10 మందికి పైగా చనిపోాయారని అధికారులు చెప్పారు.

ఈస్ట్ నుసా టెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ దీవిలో ఉన్న మౌంట్ లెవొటోబి లకి-లకి అనే అగ్నిపర్వతం పేలిందని ఇండోనేషియా వోల్కనాలజీ, జియోలాజికల్ డిజాస్టర్ మిటిగేషన్(పీవీఎంజీ) చెప్పింది.

బద్దలైన ఈ అగ్నిపర్వతం ప్రాంతం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను లావా మంటలు, బూడిద, గులకరాళ్లు తాకుతున్నాయని, పలు ఇళ్లు కాలిపోతున్నాయని పీవీఎంజీ ప్రతినిధి హడి విజయ చెప్పారు.

బద్దలైన ఈ అగ్నిపర్వతం వల్ల ఏడు గ్రామాలు ప్రభావితమయ్యాయని స్థానిక అధికారులు చెప్పారు.

అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల స్థానిక గ్రామాలలో మంటలు చెలరేగాయని పీవీఎంజీ తెలిపింది.

ఈ అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

లావా బిలం ఉన్న ప్రాంతం నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు అన్నింటినీ ఖాళీ చేయాలని హెచ్చరించారు.

‘‘లావా బిలం నుంచి సుమారు 20 కి.మీల దూరంలో ఉన్న ఇతర గ్రామాలకు ప్రజల్ని తరలించడం ప్రారంభించాం’’ అని స్థానిక అధికారి హీరోనిమస్ లామావురాన్ వార్తా సంస్థ రాయిటర్స్‌కు చెప్పారు.

ఈ విస్ఫోటనాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు కొన్ని వీడియోలను బీబీసీకి చూపించారు. అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న బూడిద, గులక రాళ్లు, కాలిపోతున్న ఇళ్లు ఆ వీడియోల్లో కనిపించాయి.

రాబోయే రోజుల్లో కోల్డ్ లావా ప్రవాహాలు, ఆకస్మిక వరదలు రావొచ్చని ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ ప్రతినిధి చెప్పారు.

వచ్చే 58 రోజుల వరకు అత్యవసర పరిస్థితిని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో ప్రభావితులైన 10 వేల మందికి అక్కడి కేంద్ర ప్రభుత్వమే సాయం చేయనుంది.

ఫ్లోర్స్ దీవిలో తూర్పు కొన వద్దనున్న ప్రముఖ జంట అగ్నిపర్వతాల్లో ఒకటైన లెవొటోబి లకి-లకి పర్వతం గత డిసెంబర్ నుంచి బద్ధలవుతూనే ఉందని, దాని నుంచి 3 కి.మీలకు పైగా దూరంలో ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఏడాది సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

వందల మంది తమ ఇళ్లను విడిచిపెట్టి, స్కూళ్లలో ఆశ్రయం పొందుతున్నారు.

ఈ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున వెదజల్లుతున్న బూడిద వల్ల పరిసర ప్రాంతాల్లోని తమ పంటలు నాశనమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

ఇండోనేషియా దేశం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’పై ఉంది. 130 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి.

అగ్నిపర్వతాలకు దగ్గర్లో చాలా కమ్యూనిటీలు ప్రమాదకరమైన జీవనాన్ని సాగిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)