ఎమ్మెల్యే కొలికపూడి వివాదం ఏంటి? పేకాటే అసలు కారణమా

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చుట్టూ వివాదం నెలకొంది.

కొలికపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గం(ఎన్టీఆర్‌ జిల్లా)లో టీడీపీ కార్యకర్తలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం చర్చనీయమైంది.

‘కొలికపూడి శ్రీనివాసరావు మాకు వద్దు’ అంటూ అక్కడి శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి.

ఇంతకీ ‘కొలికపూడి మాకు వద్దు’ అంటూ సొంత కార్యకర్తలే ఎందుకు నినదిస్తున్నారు? ఆయన చుట్టూ నెలకొన్న వివాదం ఏమిటి?

ఆందోళనలు చేస్తున్నవారి ఆరోపణలు ఏమిటి? కొలికపూడి ఏం చెప్తున్నారు?

అసలేం జరిగింది?

ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే కొలికిపూడి మాట తీరుపై అభ్యంతరాలు వినిపించాయి.

తిరువూరు టీడీపీ శ్రేణులకు, ఆయనకు మధ్య దూరం పెరగడంతో అక్కడ ఆయనకు వ్యతిరేకంగా అసంతృప్త వర్గం ఒకటి ఏర్పడిందని స్థానిక టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావుకు, చిట్యాల సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి.

దీనిపై తుమ్మలపూడి శ్రీనివాసరావు ‘బీబీసీ’తో మాట్లాడారు.

‘పేకాట ఆడిస్తున్నాననే ఆరోపణతో పది రోజుల కిందట తిరువూరు పోలీసులు నా మీద కేసు నమోదు చేసి స్టేషన్‌కు పిలిపించారు. ఆ తరువాత సంతకం పెట్టించుకుని స్టేషన్ నుంచి పంపించారు. అయితే, ఎమ్మెల్యే కొలికపూడి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు నన్ను మళ్లీ పిలిపించారు. తరువాత నేను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని ఆశ్రయించాను. స్టేషన్‌కి పిలిపించి సంతకం పెట్టించుకున్న తర్వాత కూడా ఎందుకు వేధిస్తున్నారంటూ పోలీసులతో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు’ అని తుమ్మలపూడి శ్రీనివాసరావు చెప్పారు.

ఆ తరువాత తనను తిరువూరులోని ఒక సెంటర్‌లో కొలికపూడి శ్రీనివాసరావు బహిరంగంగా దూషించారని తుమ్మలపూడి శ్రీనివాసరావు చెప్పారు.

ఇది ఇద్దరి మధ్య వివాదం మరింత పెరగడానికి కారణమైంది.

ఈ వివాదం సాగుతుండగానే కొలికపూడి శ్రీనివాసరావు తనను వేధించారని ఆరోపిస్తూ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య, వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.

ఆమె పరిస్థితి విషమించడంతో తిరువూరు నుంచి విజయవాడకు.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

తుమ్మలపూడి శ్రీనివాసరావు నేతృత్వంలోని కొందరు టీడీపీ కార్యకర్తలు కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ తిరువూరు టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. తిరువూరుతో పాటు విజయవాడలోనూ కొలికపూడికి వ్యతిరేకంగా నిరసనలు జరిపారు.

ఎమ్మెల్యే కొలికపూడి తనపై అక్రమ కేసు బనాయించారని తుమ్మలపూడి ఆరోపించారు.

‘‘పేకాట క్లబ్బులకు అనుమతి ఇప్పిస్తానని ఎమ్మెల్యే కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. అనుమతి రాకపోవడంతో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచిన యువకుల వెనుక నేను ఉన్నాననే అనుమానంతో నాపై తప్పుడు కేసు పెట్టారు’’ అని సర్పంచ్‌ తుమ్మలపూడి శ్రీనివాసరావు ఆరోపించారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలకు మనస్తాపం చెంది తన భార్య కవిత ఆత్మహత్యాయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ శ్రేణులందరినీ పరుష పదజాలంతో దూషిస్తున్నారని తుమ్మలపూడి ఆరోపించారు.

''ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నా భార్య కవితకి వాట్సప్ కాల్ చేసి వేధించారు. తన దగ్గర పీఏగా పని చేయాలంటూ ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడడంతో తట్టుకోలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఆరోపణలను నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నిరూపించలేకపోతే మేం జిల్లా వదిలి వెళ్ళిపోతాం. నిరూపిస్తే ఎమ్మెల్యే మా నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతారా?’ అని సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు అన్నారు.

అగ్రవర్ణాల పెత్తనం వల్లే: కొలికపూడి

టీడీపీ అధిష్ఠానం ఆదేశించడంతో సోమవారం సాయంత్రం(సెప్టెంబరు 30) పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో సమావేశమయ్యారు.

అసమ్మతి నేతలెవరూ ఆ సమావేశానికి హాజరు కాలేదు.

సమావేశం అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి నిరసన దీక్ష చేపట్టారు.

‘‘నన్ను చంపడానికి తోటమూల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారు. నా మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన చిట్యాల గ్రామ సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు, ఆయన భార్య కవిత తమ దగ్గరున్న సాక్ష్యాలను పోలీసులకు చూపించాలి’’ అని కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

‘‘నా మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారిద్దరిపై చర్యలు తీసుకోవాలి. నిజాలు తేల్చి వారిని శిక్షించే వరకు నిరవధిక దీక్ష చేస్తాను’’ అని ఆయన ప్రకటించారు.

ఆ సమయంలోనే దీక్ష విరమించాలని టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఫోన్‌ చేయడంతో పార్టీ పెద్దల సూచన మేరకు దీక్షను విరమిస్తున్నట్టు కొలికపూడి ప్రకటించారు.

‘ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో అగ్రవర్ణాల పెత్తనం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను డమ్మీలుగా చేసి వారు అధికారం చలాయించాలని చూస్తుంటారు. ఈ సంస్కృతిని వ్యతిరేకించాననే తిరువూరులో నాపై లేనిపోని ఆరోపణలు, వివాదం సృష్టిస్తున్నారు’’ అని కొలికపూడి శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.

తిరువూరులో ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలకు మధ్య వివాదం నెలకొన్న మాట వాస్తవమేనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు చెప్పారు.

‘‘ఎమ్మెల్యే దూకుడు మీద పార్టీ శ్రేణులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇదేం పెద్ద విషయం కాదు. ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారు’’ అని పల్లా శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

తరచూ వివాదాలు

దళిత బహుజన నేత కొలికపూడి శ్రీనివాసరావు..అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమంతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తరువాత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ ఆయనకు తిరువూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది.

అప్పటివరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌ చివరి నిమిషంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడంతో కొలికపూడికి ఆ టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో 20 వేల ఓట్లకు పైగా మెజారిటీతో కొలికపూడి శ్రీనివాసరావు విజయం సాధించారు.

మొదటి నుంచి ‘దూకుడు’ గల నేతగా కొలికపూడి శ్రీనివాసరావుకు పేరుంది.

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీపీ ఇంటిని దగ్గరుండి బుల్డోజర్‌తో కూల్చేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిచ్చింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)