You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విడాకులు తీసుకున్న ‘బాల వధువు’, ఆ తీర్పు చెల్లదంటున్న తాలిబాన్ కోర్టు
- రచయిత, మమూన్ దుర్రానీ, కవూన్ ఖమూష్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
బీబీ నజ్దానా అనే యువతి కొన్ని పత్రాలను పట్టుకుని రెండు బిజీ రోడ్ల మధ్యలో ఉన్న చెట్టు కింద (ఒక పొరుగు దేశంలో)కూర్చున్నారు. అవి ఆమె విడాకుల పత్రాలు.
ఆమెకు బాల్య వివాహం జరిగింది. అది ఆమెకు నచ్చలేదు. దాంతో, విడాకుల కోసం ఆమె రెండేళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి.
అయితే, తర్వాత ఇస్లామిక్ చట్టం (షరియా) కారణంగా నజ్దానా విడాకులను తాలిబాన్ కోర్టు రద్దు చేసింది.
అఫ్గానిస్తాన్ 2021లో తాలిబాన్ల నియంత్రణలోకి వెళ్లింది. అప్పటి నుంచి నజ్దానా కేసు వంటి వేలాది కోర్టు తీర్పులను తాలిబాన్లు రద్దు చేశారు.
తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న 10 రోజుల తర్వాత, నజ్దానాకు మంజూరు చేసిన విడాకులను రద్దు చేయాలంటూ ఆమె మాజీ భర్త హెక్మతుల్లా కోర్టును ఆశ్రయించారు.
నజ్దానా ఏడేళ్ల వయసులో ఉండగా పెళ్లి చేసుకుంటానని హెక్మతుల్లా వాగ్దానం చేశారు. నజ్దానా తండ్రి ఈ "బ్యాడ్ మ్యారేజ్"కి అంగీకరించారు. వివాహం ద్వారా ‘శత్రువుల’ను ‘మిత్రులు’గా మార్చి కుటుంబ వివాదాలను పరిష్కరించడమే "బ్యాడ్ మ్యారేజ్" అని అంటుంటారు.
ఎనిమిదేళ్ల తర్వాత అంటే నజ్దానాకు 15 ఏళ్ల వయసు రాగానే ఆమెను తనకు ‘భార్య’గా అప్పగించాలని హెక్మతుల్లా డిమాండ్ చేశారు.
అయితే, హెక్మతుల్లా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అప్పట్లో (2021లో తాలిబాన్ పాలన రాకముందు) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నజ్దానా. హెక్మతుల్లాను వివాహం చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పారు.
రెండేళ్ల తర్వాత, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నజ్దానా తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని కోర్టు చెప్పింది.
నన్ను కోర్టుకు రానివ్వలేదు: నజ్దానా
ఆ తీర్పును సవాల్ చేస్తూ 2021లో కోర్టుకు వెళ్లారు హెక్మతుల్లా. అదే సమయంలో నజ్దానా తన కేసును వ్యక్తిగతంగా వాదించడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు.
"నేను కోర్టుకు రాకూడదని, అది షరియాకు వ్యతిరేకమని తాలిబాన్లు నాకు చెప్పారు. బదులుగా నా సోదరుడు నా తరఫున వాదించాలన్నారు" అని నజ్దానా వివరించారు.
"వారి మాట వినకపోతే, నా సోదరిని బలవంతంగా హెక్మతుల్లాకు అప్పగిస్తామని చెప్పారు" అని నజ్దానా సోదరుడు షమ్స్ (28) అన్నారు.
తాలిబాన్ సభ్యుడిగా కొత్తగా సంతకం చేసిన ఆమె మాజీ భర్త హెక్మతుల్లా ఈ కేసులో గెలిచారు.
తన సోదరి ప్రాణాలకు ముప్పు ఉందని తమ సొంత ప్రావిన్స్ ఉరుజ్గన్‌లోని కోర్టుకు వివరించేందుకు షమ్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో, ఇక దేశం నుంచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదని తోబుట్టువులు నిర్ణయించుకున్నారు.
ఎందుకు రద్దు చేశారు?
మూడేళ్ల క్రితం తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, గతంలో మాదిరి అవినీతి జరగబోదని, షరియా చట్టం ప్రకారం ‘‘న్యాయం’’ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అప్పటి నుంచి దాదాపు 3,55,000 కేసులను సమీక్షించామని తాలిబాన్లు చెప్పారు. వాటిలో చాలావరకు క్రిమినల్ కేసులున్నాయి. అందులో 40 శాతం వరకు భూ వివాదాలు, 30 శాతం వరకు నజ్దానా కేసు వంటి కుటుంబ వివాదాలున్నాయి.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సుప్రీంకోర్టు కార్యాలయాలలో (బ్యాక్ ఆఫీస్) కొన్నింటిలోని రికార్డులను పరిశీలించేందుకు బీబీసీకి ప్రత్యేక ప్రవేశ అనుమతి లభించడంతో నజ్దానా విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది.
గతంలో జరిగిన విచారణకు హెక్మతుల్లా "హాజరు కానందున" ఆ తీర్పును రద్దు చేశారని అఫ్గానిస్తాన్ సుప్రీంకోర్టులోని మీడియా అధికారి అబ్దుల్ వాహిద్ హకానీ చెప్పారు.
గత ‘‘అవినీతి ప్రభుత్వం’’ హెక్మతుల్లా, నజ్దానాల వివాహాన్ని రద్దు చేయడం షరియా, వివాహ నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
తాలిబాన్లు మునుపటి న్యాయమూర్తులందరినీ తొలగించారు. తాలిబాన్ కఠినమైన అభిప్రాయాలకు మద్దతుగా నిలిచే వారిని నియమించారు. మహిళలను న్యాయవ్యవస్థలో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటించారు.
"మహిళలు అనర్హులు, తీర్పులు చెప్పలేరు, ఎందుకంటే మా షరియా సూత్రాల ప్రకారం న్యాయవ్యవస్థలో పనికి అధిక తెలివితేటలు ఉన్న వ్యక్తులు అవసరం" అని తాలిబాన్ సుప్రీంకోర్టులో విదేశీ సంబంధాలు, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్ రషీద్ అన్నారు.
తీర్పులు మారకూడదు: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
కోర్టుల్లోకి మహిళలను అనుమతించకపోతే వారి హక్కులు మెరుగుపడటానికి తక్కువ అవకాశం ఉందని అఫ్గాన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫౌజియా అమినీ అన్నారు. తాలిబాన్లు తిరిగి అధికారంలోకి రావడంతో ఆమె అఫ్గాన్ నుంచి పారిపోయారు.
"గతంలో మేం కీలక పాత్ర పోషించాం. ఉదాహరణకు, 2009లో మహిళలపై హింసను నిర్మూలించేందుకు తీసుకొచ్చిన చట్టం మా విజయాల్లో ఒకటి. మహిళల కోసం షెల్టర్ల ఏర్పాటు, అనాథలకు అండగా నిలవడంతో పాటు, మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కోసం కూడా కృషి చేశాం’’ అని ఆమె వివరించారు.
నజ్దానా విడాకుల వంటి గత తీర్పులను తాలిబాన్లు రద్దు చేయడాన్ని అమినీ ఖండించారు.
‘‘పాలన మారితే తీర్పులు మారకూడదు’’ అని ఆమె అన్నారు.
ఆఫ్గానిస్తాన్ సివిల్ కోడ్ 50 సంవత్సరాలుగా ఉందని, తాలిబాన్ పుట్టుకకు ముందు నుంచీ అది ఉందన్నారు.
"విడాకులు సహా అన్ని పౌర, శిక్షాస్మృతులనూ ఖురాన్ నుంచి స్వీకరించారు" అని అమినీ గుర్తుచేశారు.
అయితే, అఫ్గానిస్తాన్ గత పాలకులు నిజమైన ఇస్లామిక్ చట్టాన్ని అనుసరించలేదని, ఇస్లామిక్ న్యాయ శాస్త్రం హనాఫీ ఫిఖ్‌పై ఆధారపడ్డారని తాలిబాన్లు వాదిస్తున్నారు.
కాగా, గత ప్రభుత్వం సివిల్, పీనల్ కోడ్‌లను ఉపయోగించి నిర్ణయాలు తీసుకుందని, ఇపుడు అన్నీ షరియా చట్టం ఆధారంగా జరుగుతాయని అబ్దుల్ రహీమ్ రషీద్ చెప్పారు.
‘నాకు స్వేచ్ఛ లేదా?’
అఫ్గానిస్తాన్ న్యాయవ్యవస్థ తీరుపై అమినీ అసంతృప్తి వ్యక్తంచేశారు.
"తాలిబాన్‌లకు ఒక ప్రశ్న. వారి తల్లిదండ్రులు ఈ చట్టాల ఆధారంగా వివాహం చేసుకున్నారా లేదా వారి కొడుకులు రాయబోయే చట్టాల ఆధారంగా చేసుకున్నారా?" అని ఆమె అడిగారు.
ఒక పొరుగు దేశంలో రెండు రోడ్ల మధ్య చెట్టుకింద కూర్చున్న నజ్దానాకు ఇవేమీ సంతోషానివ్వవు. ఇప్పుడు నజ్దానాకు 20 ఏళ్లు, విడాకుల పత్రాలను పట్టుకుని, ఎవరైనా సహాయం చేస్తారనే ఆశతో ఏడాదిగా అక్కడే ఉన్నారు.
"ఐక్యరాజ్య సమితితో సహా సహాయం కోసం చాలా తలుపులు తట్టాను. కానీ ఎవరూ నా గోడు వినలేదు" ఆమె చెప్పారు.
"మద్దతు ఎక్కడుంది? స్త్రీగా నాకు స్వేచ్ఛ లేదా?" అని నజ్దానా ప్రశ్నిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)