‘ఇక్కడ చూడటానికి పెద్దమ్మాయిలా ఉంటే చదువుకోవడానికి వీల్లేదు’

    • రచయిత, ఆలియా ఫర్జాన్, ఫ్లోరా డ్యూరీ
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘మానసికంగా చచ్చిపోయాం’’... బీబీసీతో అఫ్గానిస్తాన్ టీనేజీ బాలికలు చెప్పిన మాట ఇది.

బాలికల విద్య మీద తాలిబాన్లు విధించిన నిషేధం వల్ల తాము మరోసారి స్కూళ్లకు వెళ్లలేకపోతుండటంతో ఇలా అనిపిస్తోందని వారు చెప్పారు.

12 ఏళ్లు పైబడిన బాలికల విద్య మీద తాలిబాన్లు మొదట నిషేధం విధించి 900 రోజులకు పైగా గడిచాయి.

ఇస్లామిక్ కరిక్యులం ప్రవేశపెట్టడం సహా అనేక సమస్యలు కొలిక్కి వచ్చిన తర్వాత బాలికలను తిరిగి స్కూళ్లలోకి అనుమతిస్తామని తాలిబాన్లు పదేపదే హామీ ఇచ్చారు.

టీనేజీ బాలికలు లేకుండా మూడో విద్యా సంవత్సరం కొద్ది రోజుల క్రితం మొదలైంది. దీనిపై తాలిబాన్ విద్యా మంత్రిత్వ శాఖను బీబీసీ వివరణ కోరగా, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

నిషేధాన్ని ఎత్తివేయడంలో కొన్ని సమస్యలు, లోపాలు ఉన్నట్లు తాలిబాన్ల ముఖ్య అధికార ప్రతినిధి ఒకరు స్థానిక టీవీతో చెప్పారు.

ఈ నిషేధం అఫ్గానిస్తాన్‌లోని 14 లక్షల మంది బాలికల చదువును ప్రభావితం చేసిందని యూనిసెఫ్ పేర్కొంది.

ఈ బాధితుల్లో మాజీ సహవిద్యార్థులు హబీబా, మహ్తబ్, తమన్నా ఉన్నారు. వీరు నిరుడు బీబీసీతో మాట్లాడారు.

12 నెలల క్రితం వారు మళ్లీ చదువుకుంటామనే ఆశతో కనిపించారు. ఇప్పటికీ వారు చదువుకోవాలనే ఆశపడుతున్నారు. కానీ, వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి.

‘‘నిజానికి మేం బతికి ఉన్నాం అంతే, జీవించట్లేదు. మేం అఫ్గానిస్తాన్‌లో కదులుతున్న శవాలం అనుకోండి’’ అని 16 ఏళ్ల మహ్తబ్ అన్నారు.

తమన్నా కల పీహెచ్‌డీ చదవడం. ‘‘మేం శారీరకంగా బతికి ఉన్నాం. కానీ, మానసికంగా చచ్చిపోయాం’’ అని తమన్నా వ్యాఖ్యానించారు.

బాలికలు పాఠశాలకు వెళ్లకుండా తాలిబాన్లు 2021 సెప్టెంబర్‌లో తొలిసారిగా అడ్డుకున్నారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు నియంత్రణలోకి తీసుకున్న నెల రోజుల తర్వాత ఇది జరిగింది.

ఇస్లామిక్, అఫ్గాన్ సంప్రదాయాలకు అనుగుణమైన కొత్త విద్యా విధానానికి ఆమోదం దక్కే వరకు సెకండరీ పాఠశాలల్లోకి బాలికలను అనుమతించబోమని బీబీసీతో అప్పటి తాత్కాలిక ఉప విద్యా మంత్రి అబ్దుల్ హకీమ్ హేమత్ చెప్పారు.

2022 మార్చిలో స్కూళ్ల ప్రారంభం నాటికి ఈ విద్యా విధానం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఆయన ఈ మాట చెప్పి రెండేళ్లు గడిచాయి.

ఈ ఏడాది మార్చికి 3,30,000 మంది బాలికలు సెకండరీ స్కూల్ విద్యను ప్రారంభించాల్సి ఉందని యూనిసెఫ్ అంచనా వేసింది.

వీరిలో జైనాబ్ (అసలు పేరు కాదు) ఒకరు. తన తోటి విద్యార్థినులతో కలసి ఆరో తరగతి చదువుతానని జైనాబ్ కూడా ఆశపడ్డారు. కానీ, పరీక్షా హాలులోకి వచ్చిన హెడ్‌మాస్టర్, వారంతా ఇక కొత్త విద్యా సంవత్సరంలోకి రాలేరని చెప్పేంత వరకు తమ చదువు అక్కడితోనే ఆగిపోతుందనే విషయం ఆమెకు తెలియదు.

తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి అయిన జైనాబ్, బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నా కలలన్నీ సమాధి అయినట్లుగా అనిపిస్తుంది’’ అని అన్నారు.

జైనాబ్ తండ్రి, అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, అది ఫలించలేదు.

ఇక చదువుకోవడానికి జైనాబ్ ముందు ఉన్న ఏకైక దారి ప్రభుత్వ నియంత్రిత మత పాఠశాలలు, మదర్సాలలో చదువుకోవడం. ఇది ఆమె కుటుంబానికి ఇష్టం లేదు.

పాఠశాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని ఆమె తండ్రి అన్నారు. అక్కడ వారికి కేవలం మతపరమైన సబ్జెక్టులు మాత్రమే బోధిస్తారని ఆయన చెప్పారు.

ఇప్పటికైతే జైనాబ్, తన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి హడావుడీ లేకుండా నడుస్తున్న ఇంగ్లిష్ తరగతులకు హాజరవుతున్నారు. ఇటీవలి కాలంలో విద్యపై విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ తెర పైకి వచ్చిన అనేక ఏర్పాట్లలో ఇది కూడా ఒకటి.

ఆన్‌లైన్ కోర్సులు లేదా బీబీసీ డార్స్ వంటి కార్యక్రమాలను చూడటం ద్వారా బాలికలు తమ చదువును కొనసాగించగలుగుతున్నారు.

బీబీసీ డార్స్ అనేది అఫ్గాన్ పిల్లల కోసం రూపొందించిన విద్యా కార్యక్రమం. పాఠశాల నుంచి నిషేధించిన 11-16 ఏళ్ల బాలికలు సహా పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉండే ఈ విద్యా కార్యక్రమాన్ని యూనిసెఫ్ నిరుడు ‘లెర్నింగ్ లైఫ్‌లైన్’ అని అభిర్ణించింది.

కానీ, జైనాబ్‌తో పాటు ఆమె తరహాలో ఆన్‌లైన్ విద్యను పొందుతున్న బాలికలు అదృష్టవంతుల్లో ఒకరని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రీజినల్ క్యాంపెయినర్ సమీరా హమీదీ అన్నారు.

ఎందుకంటే, అఫ్గానిస్తాన్‌లోని కుటుంబాలు కడుపు నిండా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఇంట్లోని ఆడపిల్లలకు ఆన్‌లైన్ విద్యను అందించడం ఆ కుటుంబాలకు ప్రాధాన్య అంశంగా ఉండదని ఆమె వివరించారు.

చాలా మంది అప్గాన్ బాలికల భవిష్యత్తు అంధకారంలో పడబోతుందని ఆమె హెచ్చరించారు. యుక్తవయస్సు వచ్చిన బాలికలకు చిన్నవయస్సులోనే వివాహాలు జరుగుతున్నాయని ఆమె నొక్కి చెప్పారు. అలాగే బాధాకర వివాహ బంధం నుంచి మహిళలను రక్షించే చట్టాలను తాలిబాన్లు ఉపసంహరించడంతో వారి కష్టాలు మరింత పెరిగాయని ఆమె వివరించారు.

టీనేజీ బాలికలు అంటే 13 ఏళ్లు వచ్చిన వారినే కాకుండా, అంతకన్నా చిన్నవయస్సులో రజస్వల అయిన బాలికలను కూడా పాఠశాలకు వెళ్లకుండా నిరోధిస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.

నయా (అసలు పేరు కాదు) వయస్సు 11 ఏళ్లు. కాందహార్ ప్రావిన్సులో ఆమె నివసిస్తారు. ఇక ఆమె పాఠశాలకు వెళ్లేందుకు వీల్లేదు. అసలు వయస్సు కంటే పెద్ద అమ్మాయిలా నయా కనిపిస్తుందంటూ ఆమెను పాఠశాలకు రానివ్వట్లేదని ఆమె తండ్రి చెప్పారు.

‘‘ఆమె చూడటానికి 11 ఏళ్ల కంటే పెద్దమ్మాయిలా కనిపిస్తున్నందున పాఠశాలకు పంపించకూడదని మాకు చెప్పారు. ఆమె హిజాబ్ ధరించి ఇంట్లోనే ఉండాలన్నారు’’ అని బీబీసీకి నయా తండ్రి వివరించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నియమాల్లో మార్పు వస్తుందని ఆయన అనుకోవడం లేదు. తాలిబాన్లు విధించిన నిషేధానికి అఫ్గాన్ ప్రజల మద్దతు ఉందని చెప్పడం చాలా పెద్ద అబద్ధమని ఆయన స్పష్టం చేశారు.

‘‘అఫ్గాన్లు, పష్తూన్లు తమ కూతుళ్ల చదువును కోరుకోవడం లేదనేది అతిపెద్ద ఆరోపణ. ముఖ్యంగా కాందహార్‌తోపాటు ఇతర పష్తూన్ ప్రావిన్సుల్లో చాలా మంది తమ కూతుళ్లను పాఠశాలలకు, యూనివర్సిటీలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

ఇక్కడి బాలికలు ఎదుర్కొంటున్న నిషేధాల్లో సెకండరీ విద్య మాత్రమే లేదు.

మహిళలు ఇక యూనివర్సిటీలకు వెళ్లకూడదంటూ 2022 డిసెంబర్‌లో ఆదేశాలు జారీ చేశారు. అలాగే మగ బంధువు తోడు లేకుండా మహిళలు ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు, వారు ఎలాంటి దుస్తుల్ని ధరించాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి అనే అంశాల్లోనూ మహిళలకు నిబంధనలు విధించడంతోపాటు స్థానిక పార్కులకు వారు వెళ్లకుండా నిషేధం విధించారు.

ఈ రహస్య పాఠశాలలు, ఆన్‌లైన్ విద్యను విస్తరించవచ్చని ఆమ్నెస్టీకి చెందిన సమీరా హమీదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కానీ, 10 లక్షల మందికి పైగా బాలికలు ప్రాథమిక హక్కు అయిన విద్యపై నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక దేశంలో ఇలాంటి ప్రయత్నాలు ఏమాత్రం సరిపోవు. తాలిబాన్లపై ఒత్తిడి పెరిగేలా అంతర్జాతీయ సమాజం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె అన్నారు.

ఇది జరిగేంతవరకు హబీబా, మహ్తబ్, తమన్నా వంటి బాలికలు చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోక తప్పదు.

‘‘మేం జైలులో ఉన్నట్లుగా ఉంది’’ అని 18 ఏళ్ల హబీబా అన్నారు. కానీ, పరిస్థితిలో మార్పు వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ, తమన్నా మాత్రం తమ కోసం పాఠశాలలు తిరిగి తెరుచుకునేది అనుమానమే అని అన్నారు.

‘‘నిజంగా, మాకోసం స్కూళ్లు తెరుచుకుంటాయో, లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి బాలికల గురించి ఏమాత్రం ఆలోచన లేదు. బాలికల్ని అర్థం చేసుకోదు. వారు బాలికలకు విలువ ఇవ్వరు’’ అని 16 ఏళ్ల తమన్నా నిరాశ వ్యక్తం చేశారు.

అదనపు రిపోర్టింగ్: మరియం అమన్, జార్జినా పియర్స్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)