You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యాహ్యా సిన్వార్: ఖైదీల మార్పిడిలో విడుదలై హమాస్‌కు చీఫ్ అయిన ఈయన్ను కొన్ని అరబ్ దేశాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి
- రచయిత, రష్దీ అబులోఫ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఆ గ్రూప్ తన పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌ను ఎంచుకుంది.
అయితే సిన్వార్‌ను ఏ ప్రాతిపదికన ఎన్నుకున్నారు? దీని తెర వెనుక కథ ఏమిటి?
హమాస్ అధికారులు తమ నాయకుడు హనియెకు నివాళులు అర్పించేందుకు దోహా చేరుకున్నారు.
ఈ దృశ్యం చాలా ఆసక్తికరం.. హమాస్‌కు చెందినవారంతా తెల్లటి గుడారాల వద్ద పక్కపక్కనే నిల్చుని కనిపించారు. అక్కడ హనియె ఫోటోను అలంకరించారు. ఇది ఒక యుగం ముగిసి, మరొక యుగం ప్రారంభమవుతున్నట్లు సూచించినట్లుగా ఉంది.
హమాస్ అధికారులు తమ నాయకుడిని ఎన్నుకొనేందుకు ఒక్కచోటికి చేరడం ఇది మొదటిసారి కాదు. హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ హత్య తర్వాత గాజాలోని ఆయన ఇంట్లోనూ ఇలాంటి సమావేశం జరిగింది.
అయితే, నెల వ్యవధిలోనే యాసిన్ వారసుడు అబ్దెల్ అజీజ్ అల్-రాంటిసిని ఇజ్రాయెల్ హత్య చేసింది. ఈసారి మాత్రం హమాస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని తెరవెనుక చర్చలు సూచిస్తున్నాయి.
హమాస్‌కు అతిపెద్ద దెబ్బ
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది.
ఈ దాడిలో సుమారు 1200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ దాడిలో 30 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు.
ఇదే క్రమంలో జులై 31న హమాస్ అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావించే టెహ్రాన్‌లో గ్రూప్ పొలిటికల్ చీఫ్ హనియె హత్యకు గురయ్యారు. ఇది ఆ గ్రూప్‌కి అతిపెద్ద దెబ్బ.
ఖైదీల మార్పిడిలో విడుదలైన సిన్వార్
సిన్వార్ ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ కోసం ఖైదీల మార్పిడిలో భాగంగా ఆయనను విడుదల చేశారు. సిన్వార్ గురించి తెలిసిన వాళ్లు ఆయన ఏదో ఒక రోజు హమాస్‌కు నాయకత్వం వహిస్తారని భావించారు.
హమాస్ సాయుధ విభాగానికి సిన్వార్ అత్యంత సన్నిహితుడు. సిన్వార్ సోదరుడు మొహమ్మద్ హమాస్ అతిపెద్ద సైనిక బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.
గత రెండు దశాబ్దాలుగా సాయుధ విభాగానికి నాయకత్వం వహించిన మొహమ్మద్ డేఫ్ గత నెలలో ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు.
సిన్వార్, డేఫ్‌లు స్నేహితులు, సహవిద్యార్థులు, పొరుగింటివారు. ఇద్దరూ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలోనే పెరిగారు.
సిన్వార్‌ను ఎందుకు ఎంపిక చేశారు?
‘‘హమాస్ నాయకత్వంలోని చాలామంది సిన్వార్ ఎన్నికకు మద్దతుగా లేరు, పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మితవాదిని ఎన్నుకోవాలని కోరారు. అయితే చివరకు సిన్వార్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి’’ అని హమాస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సమావేశానికి హాజరైన మరో హమాస్ అధికారి ‘‘బయటి వ్యక్తులకు అబూ ఒమర్ హసన్ ఎక్కువగా తెలియని కారణంగా ఆయనను ఎంపిక చేయలేదు. మరోవైపు అక్టోబర్ 7 దాడి తర్వాత సిన్వార్ అరబ్, ఇస్లామిక్ దేశాలలో చాలా పాపులర్ అయ్యారు. ఇరాన్-మద్దతుగల గ్రూపుతో సిన్వార్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఆయన నియామకం ఇజ్రాయెల్‌కు ఒక సందేశాన్ని పంపినట్లవుతుంది’’ అని అన్నారు.
అరబ్ దేశాలు ఎందుకు వ్యతిరేకించాయి?
అక్టోబర్ 7 దాడిలో సిన్వార్‌కు ప్రమేయం ఉన్నందున, ఆయనను హమాస్ చీఫ్‌గా ఎంపిక చేయవద్దని పలు అరబ్, పాశ్చాత్య దేశాలు సూచించాయి. హమాస్, సిన్వార్‌లను కొన్ని పాశ్చాత్య దేశాలు ‘ఉగ్రవాదులు’గా ప్రకటించాయి.
అయితే, ఇజ్రాయెల్‌పై దాడికి సిన్వార్ సూత్రధారిగా ఉన్నందున ఆయనకు బహుమతి ఇవ్వాలని ఎంపిక చేసినట్లు మరో హమాస్ అధికారి తెలిపారు.
గత పది నెలలుగా సాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఖతార్, ఈజిప్ట్‌లు కొత్త కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి.
ఈ ఒప్పందాల్లో హనియె హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి దిగకుండా ఒప్పించాలనే షరతు ఉంది. ప్రతిగా ఇజ్రాయెల్ గాజాలో పోరాటాన్ని ముగించి ఫిలడెల్ఫియా కారిడార్ నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలి. ఫిలడెల్ఫియా కారిడార్ చాలా ముఖ్యమైనది, ఇది బఫర్ జోన్.
అటువంటి సమయంలో అతివాది అయిన సిన్వార్ వచ్చే ఐదేళ్ల పాటు హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)