You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరీం ఖాన్: నెతన్యాహు, పుతిన్‌కు అరెస్టు వారెంట్లు కోరిన ఈ ప్రాసిక్యూటర్ చరిత్ర ఏంటి?
- రచయిత, ఇస్మాయిల్ షేక్
- హోదా, బీబీసీ ఉర్దూ
యుద్ధ నేరాలు (వార్ క్రైమ్స్), మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరాలకు (క్రైమ్స్ ఎగెనెస్ట్ హ్యుమానిటీ) పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రితో పాటు హమాస్ నేతలపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ)ను కరీంఖాన్ కోరారు.
ఈ కేసులో ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటరైన ఆయన అసలు పేరు కరీం అసద్ అహ్మద్ ఖాన్. పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తి.
యుద్ధ నేరాలు, మానవత్వాన్ని విస్మరించి చేసిన నేరాలకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ గాజా నాయకుడు యహ్యా సిన్వార్ బాధ్యులని చెప్పేందుకు ''నమ్మదగిన సహేతుకమైన ఆధారాలు'' ఉన్నాయని కోర్టులో పేర్కొన్న పత్రాల్లో ఆయన పేర్కొన్నారు.
హమాస్ నాయకులు ఇస్మాయిల్ హనియే, మొహమ్మద్ అల్ మస్రీ, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్‌పై కూడా అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఖాన్ కోరుతున్నారు.
తనకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖండించారు. ''అసంబద్ధమైన, తప్పుడు వాదన''గా పేర్కొంటూ దానిని తిరస్కరించారు. ఇజ్రాయెల్, హమాస్‌లను ప్రాసిక్యూటర్ పోల్చి చూడడం ''వాస్తవాలను వక్రీకరించడమే'' అని ఆయన పేర్కొన్నారు.
అసలీ కరీం అసద్ అహ్మద్ ఖాన్ ఎవరు?
ఎడిన్‌బరా నుంచి ఐసీసీ వరకూ..
కరీం అసద్ అహ్మద్ ఖాన్ 1970 మార్చి 30న స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరాలో పుట్టారు.
ఆయన తండ్రి డాక్టర్ సయూద్ అహ్మద్ పాకిస్తానీ. ఆయన 1960లలో పాకిస్తాన్ నుంచి బ్రిటన్ వెళ్లారు. కరీం ఖాన్ తల్లి బ్రిటీష్ పౌరురాలు.
లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి 1992లో కరీం ఖాన్ న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే వృత్తిని చేపట్టారు.
లండన్‌కి చెందిన న్యాయవాద సంస్థ టెంపుల్ గార్డెన్ చాంబర్స్‌లో సభ్యులు. ఈయనకు అంతర్జాతీయ క్రిమినల్ లా, మానవ హక్కుల న్యాయవాదిగా 30 ఏళ్ల అనుభవముంది.
దేశీయ, అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్స్‌లో ప్రాసిక్యూటర్‌గా, బాధితుల తరఫు లాయర్‌గా, డిఫెన్స్ లాయర్‌గా విస్తృత అనుభవముంది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ఫర్ రువాండా, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ఫార్మర్ యుగోస్లేవియా, ది ఎక్స్‌ట్రార్డినరీ చాంబర్స్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ కాంబోడియా, స్పెషల్ ట్రిబ్యునల్ ఫర్ లెబనాన్, స్పెషల్ కోర్ట్ ఫర్ సియెర్రా లియోన్‌లో పనిచేశారు.
1997-2000 మధ్య కాలంలో పాత యుగోస్లేవియా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్, రువాండా ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ ప్రాసిక్యూషన్‌కి లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు.
గడాఫీ కుమారుడి డిఫెన్స్ లాయర్‌గా..
ఆయన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో లీడ్ కౌన్సెల్‌గా పనిచేశారు. 2016 నుంచి 2018 వరకూ లిబియా మాజీ అధ్యక్షుడు మువమ్మర్ గడాఫీ కుమారుడు సైఫ్ అల్ - ఇస్లాంకు డిఫెన్స్ లాయర్‌గా పని చేశారు.
2017 నుంచి 2018 మధ్య కరీం ఖాన్ ఐసీపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆఫ్రికన్ బార్ అసోసియేషన్ గ్లోబల్ అంబాసిడర్ కూడా.
2018లో ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆయన్ను మొదటి ప్రత్యేక సలహాదారుగా, ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ చేసిన యుద్ధ నేరాలు, మానవతా వ్యతిరేక నేరాలపై దర్యాప్తు జరిపే ఐక్యరాజ్యసమితి బృందానికి అధిపతిగా నియమించారు.
2021 ఫిబ్రవరి 12న కరీం ఖాన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 2021 జూన్ 16న ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. 2002 జూలైలో ఏర్పాటైన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చరిత్రలో ఆయన మూడో ప్రాసిక్యూటర్.
ప్రపంచ స్థాయి నేతపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ కోరడం చరిత్రలో ఇదే తొలిసారి కాదు.
సుమారు ఏడాది కిందట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా చైల్డ్ రైట్స్ కమిషనర్ మరియా లెవోవా బెలోవాకి ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంలో ప్రాసిక్యూటర్‌గా కరీం ఖాన్ కీలకపాత్ర పోషించారు.
అరెస్టు వారెంట్లు జారీ చేసిన కొద్దిరోజుల తర్వాత, కరీం ఖాన్ సహా ముగ్గురు ఐసీసీ న్యాయమూర్తులపై రష్యా విచారణ ప్రారంభించింది.
తదనంతరం ఆ నిర్ణయం తీసుకోవడంలో ప్రమేయమున్న ఐసీసీ అధికారులను రష్యా 'వాంటెడ్ క్రిమినల్స్' జాబితాలో చేర్చింది.
అయితే, దాని తర్వాత అరెస్టు భయం కారణంగా దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్ సదస్సుకు వెళ్లకూడదని పుతిన్ నిర్ణయించుకున్నారు.
నెతన్యాహు, హమాస్ నేతలపై అరెస్టు వారెంట్లు ఎందుకు కోరారు?
అక్టోబర్ 7న హమాస్ దాడుల బాధితులను కరీం ఖాన్, ఆయన బృందం ఇంటర్వ్యూ చేసింది. ఆ దాడుల ప్రణాళికలకు, ప్రేరేపించేందుకు హమాస్ నాయకులే బాధ్యులని ఆరోపించింది.
నిర్మూలన, హత్య, బంధించడం, రేప్, చిత్రహింసల వంటి యుద్ధ నేరాలకు హమాస్ పాల్పడిందని ఖాన్ చెప్పారు.
బెంజమిన్ నెతన్యాహు, యోవ్ గల్లంట్‌పై చేసిన యుద్ధ నేరాల్లో ఆకలి చావులను యుద్ధంలో ఆయుధంగా వాడడం, సామాన్య పౌరులపై సైనిక దాడుల వంటివి ఉన్నాయి.
''ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షుల ఇంటర్వ్యూలు, విశ్వసనీయ వీడియో, ఫోటో, ఆడియో సాక్ష్యాల'' ఆధారంగా ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ మాట్లాడుతూ, ''ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా, ఒక క్రమపద్ధతిలో గాజా పౌరుల మనుగడకు కనీస అవసరాలను కూడా అందకుండా చేసింది'' అన్నారు.
ఇజ్రాయెల్ తనను తాను సమర్థించుకునే హక్కు ఉందని, అయితే ''ఈ హక్కు కారణంగా, అంతర్జాతీయ మానవతా చట్టానికి లోబడి ఉండాల్సిన బాధ్యత నుంచి ఇజ్రాయెల్‌కు కానీ, లేదా మరే దేశానికి కూడా మినహాయింపు లభించదు'' అని కరీం ఖాన్ అన్నారు.
అంతర్జాతీయ చట్టం, సాయుధ పోరాట చట్టాలను ఎవరైనప్పటికీ అన్నివర్గాలకూ వర్తింపజేయాలనే నిబద్ధత కరీం ఖాన్ ప్రకటనలో అంతర్లీనంగా కనిపిస్తోందని, అరెస్టు వారెంట్లను కోరడంలో తన సమర్థతను కూడా ప్రదర్శించారని బీబీసీ అంతర్జాతీయ ప్రతినిధి జెరెమీ బోవెన్ పేర్కొన్నారు.
''సైనికుడైనా, కమాండర్ అయినా, నాయకుడు అయినా, ఎవరైనా శిక్షకు అతీతులు కారు'', చట్టం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉండదు, ఒకవేళ అదే జరిగితే, ''దానిని కూలదోసే పరిస్థితులు సృష్టిస్తాం'' అని కరీం ఖాన్ రాశారు.
'చట్టానికి ఎవరూ అతీతులు కారు'
సీఎన్ఎన్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరువర్గాలు వాదిస్తున్న జెనోసైడ్ (మారణ హోమం) అనే పదాన్ని తన పిటిషన్‌లో ఎందుకు ఉపయోగించలేదన్న ప్రశ్న కరీం ఖాన్‌కు ఎదురైంది.
అందుకు ఆయన, 'ఈ విచారణ కొనసాగుతుంది' అని బదులిచ్చారు. ప్రస్తుతం న్యాయమూర్తుల ముందుంచిన అభియోగాల్లో మారణ హోమాన్ని చేర్చలేదు.
''కానీ, మా దర్యాప్తు కొనసాగుతోంది. ఇది సంక్లిష్టమైన పరిస్థితి'' గాజాలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ అధికారులు తమను అనుమతించలేదని ఆయన చెప్పారు.
ఐసీసీ ప్రీ ట్రయల్ జడ్జిల ప్యానెల్ వారెంట్లు జారీ చేసేందుకు అంగీకరిస్తుందో లేదో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు కొద్ది వారాల సమయం పట్టొచ్చు.
అమెరికా, ఇజ్రాయెల్ ఐసీసీ నిబంధనలకు కట్టుబడి లేవు.
అరెస్టు వారెంట్ల కోసం దరఖాస్తు చేయడాన్ని ''అత్యంత దారుణం'' అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ''ఇజ్రాయెల్, హమాస్ మధ్య అసలు పోలికే లేదు.'' అన్నారు.
గత నెలలో, ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు.
''ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు, సైనికాధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తే, అది చారిత్రాత్మక వాస్తవాలపై దాడి అవుతుంది. అలాగే, ఇజ్రాయెల్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ కూడా చట్ట ఉల్లంఘనలను కఠినంగా పరిశీలిస్తుంది.'' అన్నారు.
''ఇజ్రాయెల్ నైతికంగా అగాథంలోకి కూరుకుపోతోంది'' అనేందుకు వారెంట్లు సంకేతంగా కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్‌కి చెందిన ప్రముఖ మానవ హక్కుల సంస్థ బీసెలెమ్ పేర్కొంది.
నెతన్యాహు వ్యాఖ్యల గురించి సీఎన్ఎన్ యాంకర్ అడిగిన ప్రశ్నకు, ''ఎవరూ చట్టానికి అతీతులు కారు'' అని కరీం ఖాన్ సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి:
- భార్య మీద అనుమానంతో మాటలలో చెప్పలేనంత క్రూరత్వానికి పాల్పడ్డ భర్త...
- రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఒక యువతి గంధపు మాల తీసుకుని ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..
- జమ్మూ కశ్మీర్లో తీవ్రవాద దాడులు, బీజేపీకి చెందిన మాజీ సర్పంచ్ మృతి, ఇద్దరు పర్యటకులకు గాయాలు
- యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)